ఉత్తరాయణం

‘రక్షణ ముసుగు’లో అబద్ధాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రహస్యాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అది తప్పుడు పనులకు సంబంధించినదయితే మరీ మంచిది. అడ్డగోలుగా దబాయించే అవకాశమిస్తుంది. 1889లో మన దేశంలో ‘అధికార రహస్యాల చట్టం’ అమలులోకి వచ్చింది. అప్పుడు దేశీయంగా నిజాల్ని తొక్కిపెట్టడం కోసం బ్రిటిష్ వారికి అవసరమైన రీతిలో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. స్వాతంత్య్రం వస్తేనేమి? ప్రజాప్రభుత్వాలు అనుకుంటేనేమి? ప్రజలకు ఏదోరూపంలో సమాచారం బట్టబయలై చేతికి అందివస్తే పాలకులకు ఇబ్బంది కాదూ! అందుకనే 1923లో సవరించిన ఆ చట్టాన్ని మనం నెత్తిన పెట్టుకొని కొనసాగిస్తున్నాం. దేశ భద్రత ముసుగులో పాలకుల స్వంత ఎజెండా మాత్రం భద్రం. ఇక ప్రస్తుత విషయానికి వస్తే రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో గోల్‌మాల్ జరిగిందని సుప్రీంలో కేసు నడుస్తోంది. తగు ఆధారాలులేవంటూ కోర్టు తన తీర్పును వెలువరించింది. ఆ తీర్పు అలా రావడానికి నిందిత స్థానంలో ఉన్న ప్రభుత్వం తప్పుడు పత్రాలను సమర్పించడమే కారణం. కావున మళ్లీ కేసు విచారించమని అర్జీలు వచ్చాయి. అందుకు మద్దతుగా అధికారిక పత్రాలను అర్జీదారులు సమర్పించడంతోపాటు, ఈ విషయాలను ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. ఆ పత్రాలు జెట్ కొనుగోలు బేరసారాల్లో జరిగిన అవకతవకల్ని, ప్రభుత్వవాదనలో డొల్లతనాన్ని పట్టిచూపించేవే కానీ ఏమాత్రమూ దేశరక్షణ అంశాన్ని వీధిలో పెట్టేవి కాదు. తెల్లమొహం వేసిన ప్రభుత్వం తన అడ్వొకేట్ జనరల్ ద్వారా కొత్తవాదన తెస్తోంది. ఆ పత్రాలు రక్షణశాఖ నుండి దొంగిలింపబడినందున బాధ్యులను, ప్రచురించిన పత్రికను అధికార రహస్య చట్టం ప్రకారం నేరస్తులుగా నిలబెడతామంటూ చెబుతోంది. అంతే తప్ప ఆ పత్రాల్లోని అంశాలు అసత్యాలు అని మాత్రం అనడం లేదు. ప్రభుత్వాన్ని దోషిగా నిరూపించే ఆ పత్రాలు నికార్సయినవన్నమాట. దోషిగా ప్రజల ముందు నిలబడిన ప్రభుత్వం ఆ విషయాన్ని ఎత్తిచూపిన వారిని శిక్షించాలని భావిస్తోంది. అందుకోసం అధికార రహస్యాల చట్టాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఈ చర్య ప్రజాస్వామ్య వ్యతిరేకమే కాదు, ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన. పత్రికల భావప్రకటన హక్కుని అడ్డుకునే ప్రయత్నం. ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాల్సిన దుందుడుకు ప్రయత్నమిది.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
నోటి క్యాన్సర్‌పై సమరం
గత దశాబ్ద కాలంలో మన దేశంలో నోటి క్యాన్సర్ బాధితుల సంఖ్య 22 శాతం పెరిగి, ప్రస్తుతం ఇరవై రెండు లక్షలకు చేరుకోవడం, ఏటా కొత్తగా ఒకటిన్నర లక్షల మంది రోగపీడితులు కావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. పొగాకు, సిగరెట్, పాన్ పరాగ్, బీడీలు, గుట్కా వంటి విషతుల్య పదార్థాల సేవనం పెరిగినందున నోటి క్యాన్సర్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నోటి క్యాన్సర్ బాధితుల సంఖ్య ఆరు లక్షల పైచిలుకుగా నమోదై, జాతీయ స్థాయిలో తొలి అయిదు స్థానాల్లో ఉండడం బాధాకరం. ఈ నేపథ్యంలో బాధితులకు చికిత్స అందించేలా ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పాల్సిన ఆవశ్యకత వుంది. తెలంగాణాలోని ఎంఎన్‌జె ఆసుపత్రిలో రొమ్ము, గర్భాశయ ముఖద్వార, నోటి క్యాన్సర్లకు చికిత్స అందించే సౌలభ్యం వుంది. నోటి క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నందున వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు మండల స్థాయిలో ప్రత్యేక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధిని గుర్తించేందుకు ప్రత్యేక వైద్య పరీక్షలకు ప్రణాళికలను రూపొందించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా నోటి క్యాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) నుండి నిధులను విరివిగా కేటాయించాలి. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా ప్రాంతీయ కేన్సర్ చికిత్సాకేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారానికి ఒకరోజు క్యాన్సర్‌ను గుర్తించేందుకు వైద్య శిబిరాలను నిర్వహించాలి. వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే తదనంతరం చికిత్స సులభ సాధ్యమవుతుంది. ప్రమాదకరమైన వ్యాధులకు ప్రత్యేక చికిత్స అందించేందుకు మండల స్థాయిలో అత్యున్నత పరిజ్ఞానంతో వైద్యశాలలను ఏర్పాటు చేస్తే పరిస్థితిలో కొంత మార్పు వస్తుంది.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం