ఉత్తరాయణం

అశాస్ర్తియ విజ్ఞానం హానికరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దారి తెలియని అజ్ఞానం కన్నా దారితప్పిన విజ్ఞానమే ఎక్కువ నష్టం కలిగిస్తుంది. సమాజంలో అసలైన విజ్ఞానం, శాస్ర్తియ దృక్పథం పెరిగేలా విస్తృత కృషి జరగాలి. విద్యాధికులు అందుకు ముందుండాలి. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్లు మరింత శ్రద్ధగా ఆ పని చేయాలి. ఇప్పటికే మూఢ నమ్మకాలతో దిగజారుతున్న మన సమాజానికి మరిన్ని మూఢ నమ్మకాల్ని పరిచయంచేస్తూ ఇంకా గందరగోళ పర్చరాదు. జలంధర్ పట్టణంలో ప్రతిష్టాత్మక భారత సైన్స్ కాంగ్రెస్ 106వ సమావేశాల్లో ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జి.నాగేశ్వర రావు చేసిన ప్రసంగం శాస్ర్తియ స్ఫూర్తికి విరుద్ధం. ఆయన భారతంలో కౌరవుల జననానికి కారణం స్టెమ్‌సెల్ పరిజ్ఞానమంటూ, అలాగే అప్పటి బాణాలు మిస్సైల్ టెక్నాలజీ అంటూ సరికొత్త థియరీలు చెప్పారు. శాస్తవ్రేత్తలు, శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తిఉన్న విద్యార్థులు, ఆ సమావేశాలవైపు చూస్తున్న దేశ ప్రజలకు ఒక విశ్వవిద్యాలయ పెద్ద చెప్పవలసిన మాటలా అవి? పురాణాల్ని, చరిత్రనీ, సంస్కృతినీ సైన్స్‌తో కలగలిపి వక్రభాష్యాలు చెప్పడంలో ఏ ప్రయోజనం వుంది? మన పూర్వీకులు గొప్పవారని చెప్పాలనుకొంటే చెప్పగలిగిన దృష్టాంతాలు చరిత్రలో కోకొల్లలు. ఆర్యభట్ట, సుశ్రుతుడు, నలంద, తక్షశిల వంటి విషయాలెన్నో ఉన్నాయి. పురాణాల్లో ఉదంతాల్ని సృజనాత్మకతకి దర్పణంగా వర్ణించవచ్చు. తప్పుడు భాష్యాలు, నమ్మకాలూ కొంపముంచుతాయి. దక్షిణ ఆఫ్రికాలో (ఎంబెకే అధ్యక్షుడుగా ఉన్న కాలంలో) హెచ్‌ఐవీతో ఎయిడ్స్ వ్యాధి రాదు అని తప్పుడుగా ప్రభుత్వం నమ్మి ఏ చర్యలూ తీసుకోకపోవడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తరువాత తప్పు దిద్దుకొన్నారనుకోండి. సమకాలీనంగా కూడా దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకువెళ్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఒక మంచి వేదికని అశాస్ర్తియ విజ్ఞాన వేదికగా మార్చడం, అదీ బాధ్యతాయుత స్థానంలో ఉండీ చెయ్యడం తప్పు. దేశంలో పరిశోధన రంగం బలపడాల్సిన అవసరం ఎంతోఉంది. పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు, పరిశోధనా పత్రాలకు ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే పరిస్థితిలో ప్రస్తుతం దేశం లేదు. ఆ వాతావరణం కల్పించడానికి ఎంతో కృషిజరగాల్సి ఉంది. మరోవైపు మూఢ నమ్మకాలు ప్రబలి ఆర్థికంగా దేశం నష్టపోతోంది. ప్రభుత్వం కన్నా, విధానకర్తలు కన్నా శాస్ర్తియ దృక్పథం పెంచడంలో విద్యాధికుల పాత్ర ఎక్కువ. అవసరమనుకొంటే ప్రభుత్వాన్ని నిలదీయాలి. శాస్తజ్ఞ్రానం వైపు నిలవాలి. ఇప్పటికైనా తన భాష్యం పొరపాటని ఏయూ వైస్ చాన్సలర్ ప్రకటించాలి.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
ద్వంద్వ వైఖరి తగునా?
‘తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసిఆర్ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకొని కేంద్ర రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నాడు. అందుకే పలు రాష్ట్రాలు పర్యటిస్తూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాడు. తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలన్నది ఆయన లక్ష్యం..’- అంటూ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శిస్తున్నారు. చిత్రంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు కూడా చేస్తున్నది అదే. చంద్రబాబుని ఆలింగనం చేసుకొని, కేసీఆర్‌ని విమర్శించడం రఘువీరుని ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం కాదా? మరి తాను ప్రధానమంత్రి కావాలన్న ఉద్దేశంతోనే కదా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విపక్ష నేతల్ని కలుస్తున్నది? రాజకీయాల్లో రఘువీరునికి ఇవన్నీ కొత్త కాదుకదా. ఒకర్ని పొగడుతూ ఇంకొకర్ని విమర్శించనేల?
- శాండీ, కాకినాడ
యువనాయకత్వం ఎక్కడ?
ఒకనాడు కమ్యూనిస్టు ఉద్యమాలకు కంచుకోట అయిన ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో వామపక్షాలు నేడు ఒంటరిగా బరిలోకి దిగి గెలువలేని దుస్థితి నెలకొంది. నేడు రాజకీయాలలో యువత ప్రాధాన్యత పెరగటంలో ఇతర పార్టీలపై యువ నాయకత్వంపై ఆకర్షితులవుతున్నారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్, టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలపై యువత ఆకర్షితులవుతున్నారు. చాలాకాలంగా కమ్యూనిస్టు పార్టీలలో యువ నాయకత్వం కొరవడిందనే చెప్పాలి. మంచి నాయకులు ఉన్నా వయోభారం పైన పడడంతో వారు అంత చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనలేని పరిస్థితి ఉంది. గెలుపు ఓటములను నియంత్రించే సత్తా వామపక్షాలకు ఉంది. కాని గెలుపొందే వీలులేని పరిస్థితి కొనసాగుతూనే ఉంది. వామపక్షాలు చెరో దారిలో పయనించటం కూడా ఇందుకు ఒక కారణం. మళ్ళీ కమ్యూనిస్టు పార్టీలు గత వైభవం సంతరించుకోవాలంటే యువ నాయకత్వం అడుగిడాల్సిన అవరం ఎంతైనా వుంది.
- ఎ.ఆర్.ఆర్.ఆర్, ఖమ్మం
ఆర్టీసీ సిబ్బందికీ పోస్టల్ బ్యాలెట్
ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన రోజున ఆర్టీసీ సిబ్బందిని ఉపయోగించుకున్న ఎన్నికల సంఘం అధికారులు వారిని ఓటుకు దూరంగా ఉంచడం అన్యాయం. పోలింగ్ ముందు రోజు నుండే పోలింగ్ సామాగ్రిని, సిబ్బందిని తరలించడం లాంటి పనులతో బిజీగా ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను అభినందించాల్సిందే. పోలింగ్ రోజు ఓటువేయడానికి సొంత గ్రామాలకు వెళ్ళే సామాన్య ప్రజలను తరలించడానికి కూడా ఆర్టీసీ బస్సులను నడిపారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడానికి సహకరిస్తున్న ఆర్టీసీ సిబ్బంది మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పోస్టల్ బ్యాలట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు మాత్రం పోస్టల్ బ్యాలట్ సౌకర్యం కల్పించారు. మిగతా ఉద్యోగుల మాదిరి ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు కూడా భవిష్యత్‌లో జరిగే ఎన్నికలలో పోస్టల్ బ్యాలట్ సౌకర్యం కల్పించాలి. పోలింగ్ శాతం పెరగడానికి ప్రచారం కల్పిస్తున్న ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలి.
- జి.అశోక్, గోధూర్ (జగిత్యాల జిల్లా)