ఉత్తరాయణం

రైతుల కడగండ్లు తీరేదెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా అన్నదాతలు తరచూ రోడ్డెక్కడం బాధాకరం. గత రెండేళ్లుగా పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఆందోళనలకు దిగుతున్నా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. గత నెలలో వేలాది మంది రైతులు తమ డిమాండ్ల సాధనకు కిసాన్ ముక్తిమోర్చా పేరిట ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించినా, వారి సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైంది. నానాటికీ పెరుగుతున్న రుణభారంతో రైతు కుదేలైపోతున్నాడు. వాతావరణ పరిస్థితులు కలిసి వచ్చినా రాకపోయినా, వ్యవసాయం కోసం అప్పు చేసి రైతులు పంటలు వేస్తున్నారు. దళారీలు ఫలసాయాన్ని తక్కువ రేటుకు తన్నుకుపోతుండడం రైతుకు పట్టిన దౌర్భాగ్యం. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. 1995-2015లో దేశంలో మూడు లక్షలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు, రోజుకు సగటున 42 మంది ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారని వివిధ సర్వేలు ఘోషిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంలో పారిశ్రామిక రంగాన్ని ఆదుకున్న ప్రభుత్వాలు రైతులకు రుణమాఫీ చేయాలంటే మీనమేషాలు లెక్కిస్తాయి. ప్రభుత్వాల అనుచిత నిర్ణయాలతో కనీస మద్దతు ధర లేక, పంటను భద్రపరచుకునే సౌకర్యం లేక, తక్కువ ధరలకే పంటలను అమ్ముకొని రైతులు రుణభారాన్ని మోస్తున్నారు. దళారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. పార్లమెంటు సమావేశాలలో రైతుల సమస్యలపై ఒక గంట కూడా చర్చించిన పాపాన లేకపోవడం మన రాజకీయ నేతల నిర్లక్ష్యవైఖరిని తెలియజేస్తోంది. పెట్టుబడి, రైతు శ్రమవిలువ, సాగుభూమి బాడుగ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని, దానికి 50శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధరను నిర్ధారించాలని ప్రొఫెసర్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులు పుష్కరకాలంగా ఆచరణకు నోచుకోలేదు. ప్రభుత్వం 26 రకాల పంటలకు ఇటీవల మద్దతు ధరలను ప్రకటించినా అందులో ప్రధానంగా కొనేది గోధుమలు కావడం, మిగతా పంటలకు అరకొర మద్దతు ధరలు ప్రకటించడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఫసల్ బీమా పథకం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని చెప్పిన కేంద్ర ప్రభుత్వం బీమా సంస్థలకు లాభం చేకూరుస్తోంది. బీమా సంస్థలకు చెల్లించే కిస్తు రూ. 47వేల కోట్లు కాగా, రైతులకు చెల్లించే పరిహారం 30 కోట్లు అని ‘కాగ్’ తేల్చి చెప్పడం గమనార్హం.
-సి.కనకదుర్గ, హైదరాబాద్