ఉత్తరాయణం

‘విగ్రహాల’పై పోటాపోటీ ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పోటీ పడాలనేమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల వింత వింత నిర్ణయాలను తీసుకుంటున్నారు. గుజరాత్‌లో ‘ఉక్కుమనిషి’ సర్దార్ వల్లభభాయి పటేల్ భారీ విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి ప్రపంచ రికార్డును మోదీ నెలకొల్పారు. అదే తరహాలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించడం విస్మయం కలిగిస్తోంది. గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని పర్యాటకపరంగా తీర్చిదిద్దేందుకు మోదీ చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని నీరుకొండపై 108 అడుగుల ఎత్తయిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థలాన్ని కూడా చంద్రబాబు ఎంపిక చేశారని తాజాగా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ విగ్రహం వద్ద సుమారు 200 ఎకరాల్లో మెమోరియల్ ప్రాజెక్టును చేపట్టి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి, ఈ ప్రాజెక్టుకు మొత్తం 406 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని ప్రతిపాదించారట. విగ్రహం ఏర్పాటుకు 14 ఎకరాలను, మెమోరియల్ ప్రాజెక్టుకు 200 ఎకరాలను, జలాశయ నిర్మాణానికి 80 ఎకరాలను కేటాయించాలని ప్రతిపాదించారు. ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి 155 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని చంద్రబాబు నిర్ణయించారని మీడియాలో ప్రచారమైంది. ఈ మొత్తం ప్రాజెక్టుకు ప్రభుత్వ నిధులనే గాక ప్రజల నుంచి విరాళాలను కూడా సేకరించాలని నిర్ణయించారట! మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడంపై ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, పోటాపోటీగా వందలు, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి అత్యంత భారీ స్థాయిలో విగ్రహాలను ఏర్పాటు చేయాలా? ఈ విషయంలో నేతలు ఒకరితో ఒకరు పోటీ పడడం సమంజసమా? ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో ఈ పోటీతత్వం ఉంటే దేశానికి ఎంతో మేలు జరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు.
-కె.సాయిపవన్, విశాఖ
ఓటు బాధ్యత ఎన్నికల కమిషన్‌దే
మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ప్రజాస్వామ్యంలో ముఖ్య ఘట్టం అది. ప్రజలే ప్రభువులన్న స్ఫూర్తికి దర్పణం ఎన్నికల ప్రక్రియ. ఆ ప్రక్రియ ఎంత లోపరహితంగా జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థకు అంత మేలు అన్నది సదా గమనంలో ఉంచుకొని ప్రభుత్వం, రాజ్యాంగ సంస్థలు ఆ దిశగా తప్పుల్ని, పొరపాట్లని సవరించుకు వెళ్ళాలి. తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని ప్రశాంతంగా, సమర్ధవంతంగా ఎన్నికల కమిషన్ నిర్వహించింది. అయితే ఓటర్ల జాబితాలో మాత్రం తప్పులు పునరావృతమయ్యాయి. తెలంగాణలో దాదాపు 22 లక్షల మంది ఓట్లు గల్లంతు కావడం అన్నది తీవ్ర తప్పిదం. గెలుపుకీ, ఓటమికి ఒక్క ఓటు తేడా చాలు అనే ప్రజాస్వామ్య రీతికి అంత పెద్దసంఖ్యలో ప్రజలు ఓటు హక్కుని కోల్పోవడమంటే అన్యాయమే. ఈ విషయంలో తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి క్షమాపణ చెప్పినా ఫలితం ఏముంది? ఎన్నికల సంస్కరణల కోసం కమిషన్ నిజంగా కట్టుబడితే మొదట చెయ్యాల్సిన ప్రాథమిక చర్య తప్పులూ, తడకలూ లేని ఓటర్ జాబితాలను తయారు చెయ్యడం. దొంగ ఓట్లు తొలగించడం ఎంత ముఖ్యమో, అర్హులందరికీ ఆ హక్కు అందించడం అంతే ముఖ్యం. ఎలాగూ ఏడాది పొడుగునా ఓట్ల నమోదుకు అవకాశం ఉంది. ఓటుతో ఆధార్ కార్డును లింక్ చేయాలన్నది మంచి సూచన. గతంలో అలాచేసినా వ్యక్తిగత గోప్యత కోణంలో ఆ ప్రక్రియని నిలుపుదల చేశారు. న్యాయశాఖతో సంప్రదించి మళ్ళీ ఆధార్ లింకింగ్ ప్రక్రియని విస్తృతపరిస్తే దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు బెడద తగ్గుతుంది. మున్ముందు అంతర్జాల ఓటింగుకీ, ప్రవాసుల ఫ్రాక్సీ ఓటింగ్ తరహా సంస్కరణలకు ఉపయోగపడుతుంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. ఇక అర్హులకు లిస్టులో పేరు లేదన్న సాకుతో ఓటు హక్కును తిరస్కరించడం కూడా అన్యాయమే. ఏదైనా గుర్తింపుపత్రం చూపిస్తే ఎన్నికల రోజు చివరి నిముషంలోనైనా అర్హుడు ఓటువెయ్యగలిగేలా వ్యవస్థని తీర్చిదిద్దుకోవాలి. ఆ దిశగా రానున్న ఎన్నికల్లోనే గుణాత్మక మార్పులు తీసుకురాగలిగితే అది ప్రజాస్వామ్య విజయం కాగలదు.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం