ఉత్తరాయణం

లక్ష్యాలకు దూరం ‘ఫసల్ బీమా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కష్టకాలంలో రైతులకు అండగా ఉండాల్సిన పంటల బీమా పథకం (ఫసల్ బీమా) కార్పొరేట్ కంపెనీలకు కాసులు కురిపిస్తోందంటూ, ఈ పథకం ద్వారా లక్షల కోట్ల విలువైన ప్రజాధనం ఖర్చవుతున్నా వాస్తవానికి ప్రజలకు, రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదంటూ ‘కాగ్’ ఇటీవల తన నివేదికలో పేర్కొనడం ఆందోళనకర పరిణామం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం ప్రజాసంక్షేమానికన్నా, కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందన్న విమర్శలు ఇప్పటికే పతాక స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వాల అలక్ష్యం, వాతావరణంలో చేటుచేసుకుంటున్న పెనుమార్పుల కారణంగా ఏర్పడుతున్న అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వలన ఇప్పటికే వ్యవసాయ రంగం పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న రైతాంగం కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎరగా మారడం జీర్ణించుకోలేని విషయం. 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ప్రవేశపెడుతూ రైతాంగ జీవన చిత్రాన్ని మార్చివేయడమే తమ ఏకైక లక్ష్యమని ప్రకటించారు. గతంలో ఉన్న పంటల బీమా పథకాల్లోని లోటుపాట్లను తొలగించి, రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త అంశాలను చేర్చామంటూ ప్రధాని మోదీ ఘనంగా చేసిన ప్రకటనలు- రైతుల జీవితాలను సమూలంగా మార్చివేస్తాయని అందరూ ఆశించారు. అయితే పలు రాష్ట్రాలలో ఆరోగ్య బీమా పథకాలు తప్పుదారి పడి వేల కోట్ల రూపాయల విలువైన ప్రజాధనం దుర్వినియోగం అయిన నేపథ్యంలో ఈ బీమా పథకాన్ని మరింత సమర్ధవంతంగా ఆచరించేందుకు ప్రభుత్వరంగంలోని ఇన్సూరెన్స్ కంపెనీలకే పెద్దపీట వేయాలని ఆర్థిక నిపుణులు, సామాజిక శాస్తవ్రేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసి ప్రైవేట్ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలకే పెద్దపీట వేసింది. పైగా వౌలిక వసతులు, అనుభవం ఏమాత్రం లేని సంస్థలకు ఈ పథకంలో భాగస్వామ్యం కల్పించింది. అంతేకాకుండా ఈ పథకం పక్కదారి పట్టకుండా ఒక సమర్ధవంతమైన నియంత్రణ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేయక పోవడంతో ప్రైవేటు రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు పెద్దఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాయని ‘కాగ్’ తన నివేదికలో తూర్పారపట్టింది. లాభాపేక్ష తప్ప సేవా దృక్పథం నామమాత్రంగా కూడా లేని సంస్థలకు అత్యంత కీలకమైన ఈ పథకంలో స్థానం ఎలా దక్కింది? అన్న ‘కాగ్’ ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద ఇప్పటివరకూ సంతృప్తికరమైన సమాధానం లేకపోవడం దురదృష్టకరం. జాతీయ ఆడిట్ విధానం ప్రకారం కొత్త పథకాలు ప్రవేశపెట్టబడిన మొదటి రెండు సంవత్సరాలలో ఆరు నెలల కొకసారి ‘కాగ్’ వంటి ఒక నిష్పాక్షిక సంస్థచేత ఆడిట్ చేయించి, అందులోని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. సంబంధిత మంత్రిత్వ విభాగం ఈ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పథకం అమలులో ఏమైనా లోపాలువుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా దిద్దుబాటు చర్యలు సత్వరం చేపట్టాలి. అయితే ప్రభుత్వం ఇందులో ఒక్క చర్యనుకూడా చేపట్టలేదని ‘కాగ్’ తన నివేదికలో పేర్కొనడం పథకం అమలుపై ప్రభుత్వ, ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యవైఖరికి తిరుగులేని నిదర్శనం. రైతుల పాలిట ఎంతో ప్రయోజనకారిగా వర్ణింపబడుతున్న సదరు పథకంలో జరుగుతున్న అవకతవకలను గుర్తించి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టడం అత్యావశ్యకం.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
ప్రభుత్వంపై మెరుపుదాడి!
శత్రుదేశం స్థావరాలపై ‘మెరుపుదాడి’ ముఖ్య ఉద్దేశం ‘టార్గెట్’ని ధ్వంసం చేయడం ఒక్కటే కాదు, ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టడం.. అని అనుకొంటే రిజర్వుబ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ ఆకస్మిక రాజీనామాను కూడా కేంద్ర ప్రభుత్వంపై మెరుపుదాడిగానే భావించాలి. రాజీనామాకు ఊర్జిత్ ఎన్నుకొన్న ముహూర్తం అందుకు బలపరుస్తోంది. ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంకుకి మధ్య భేదాభిప్రాయాలు కొత్తవి కావు. పెద్దనోట్ల రద్దు వ్యవహారం నుంచి విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. ద్రవ్యోల్బణాలు, వడ్డీరేట్లు, నగదు నిల్వల్లో వాటాలు, పెత్తనాలు.. వంటి మాటెలాఉన్నా, నీరవ్ మోడీ లాంటి ఆర్థిక నేరస్థులు తయారవ్వడానికి, వారు తప్పించుకుపోవడానికి ప్రభుత్వం ఆర్బీఐ అసమర్థ నిర్వాకమే కారణమని చూపింది. అందుకు నొచ్చుకొన్న రిజర్వుబ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ తన సమాధానాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ బ్యాంకులపై తమకు పూర్తి నియంత్రణ ఉండదని, బోర్డుద్వారా విధానాల అమలులో పాలకులు వేలుపెడతారని, ఆ విషయాన్ని ఆయన బలంగా చెప్పాలని భావించి వుండొచ్చు. అందుకనే సరిగ్గా విజయ్ మాల్యాని మన దేశానికి రప్పించే కేసు తీర్పు వచ్చేరోజున తన రాజీనామాను ఊర్జిత్ సమర్పించారు. తద్వారా మాల్యా కేసులో తమది విజయం అని పాలకులు చంకలు గుద్దుకొనే అవకాశాన్ని ఆయన తగ్గించేశారు. వాస్తవానికి మాల్యా కేసులో అంత మురిసిపోవాల్సింది కూడా ఏమంత లేదు. 9వేల కోట్ల రూపాయల ప్రజాధనానికి టోకరా వేసిన ఘరానా మనిషిని దేశం విడిచి పారిపోనిచ్చి, అంటే- ఎలుకని కలుగులోకి దూరిపోయే వరకూ చూసి ఆ తరువాత తోక పట్టుకొని లాగడానికి విశ్వప్రయత్నం చేస్తున్నట్టు, తరువాత పట్టుకోడానికి వ్యాజ్యం నడపడం ఓ ప్రహసనం. అది విజయవంతం అయినా కొలిక్కి రావడానికి దశాబ్దాలు పడుతుంది. ఆ విషయం ఇప్పుడు తేటతెల్లం. ఏది ఏమైనా ఒక కీలక పదవిలోఉన్న ఆర్థికవేత్త ఆకస్మికంగా రాజీనామా చెయ్యడం, అదీ ఆర్‌బీఐ బోర్డు మీటింగ్‌కి నాలుగురోజులముందు చెయ్యడం, స్వతంత్రత ఉండాల్సిన రాజ్యాంగ వ్యవస్థకీ, ప్రభుత్వానికి నడుమ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఇలా జరగడం దేశానికి మంచిది కాదు. ఈ విపరిణామాలను పాలకులు గుర్తెరగాలి.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం