ఉత్తరాయణం

ఆశ్రమ ధర్మం ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిపూర్ణానంద స్వామి సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి. అందరూ వదిలిపెట్టిన వాడిని ‘సన్నాసి’ అని, అందర్ని, అన్నింటిని వదలిపెట్టిన వాడిని ‘సన్యాసి’ అనడం లోకోక్తి. సన్యసించినవారు ఏ ప్రలోభాలకు ప్రాకులాడరు. లోకహితం కోసం, మంచిమార్గంలో ప్రజలు నడచుకునేలా తమ ప్రవచనాల ద్వారా దేశభక్తిని, జాతీయతను స్వామీజీలు నూరిపోయాలి. ఈ సత్ సంప్రదాయాన్ని గతంలో ఎంతోమంది సాధుపుంగవులు ఆచరించారు. రమణ మహర్షి, చంద్రశేఖర సరస్వతి స్వాములు, జిడ్డు కృష్ణమూర్తి, స్వామి వివేకానందుడు ఈ కోవలోనివారు. సన్యాసం తీసుకున్నవారు ఏ ఆశ్రమంలోనో ఏకాంతంగా భగవధ్యానం చేసుకుంటూ లౌకిక జీవనానికి దూరంగా గడపాలి. కాని పరిపూర్ణానంద స్వామి రాజకీయాలలో ప్రవేశించి ఓ రాజకీయ పార్టీకి ప్రచారకర్తగా వ్యవహరించడం వల్ల, వ్యతిరేక పార్టీవారికి శత్రువుగా కనిపించవచ్చు. తనను అరెస్ట్‌చేసి నగర బహిష్కరణ శిక్షను విధించినంత మాత్రాన పవిత్రమైన ఆశ్రమధర్మానికి విఘాతం కలిగించడం సక్రమమైన పని అనిపించదు. కంచి పీఠాధిపతిని ఆనాటి తమిళ ప్రభుత్వం జైలులో నిర్బంధించినా ఆయన ఆశ్రమధర్మాన్ని విస్మరించలేదు. ఎంతటి మేధాసంపత్తి ఉన్నా రాజకీయాలలో గెలుపోటములను ఎవరూ ముందుగా నిర్ణయించలేరు. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోతే ‘మహిమలు లేని సన్యాసి’ అని అమాయక ప్రజలు స్వామివారి మీద ఇన్నాళ్లూ పెంచుకున్న విశ్వాసం కోల్పోతారు.
- డా. ఎన్.ఎస్.ఆర్.మూర్తి, సికిందరాబాద్
దిగజారిన రాజకీయ వ్యవస్థ
ఎన్నికల్లో ధనం, మద్యం ప్రవాహాన్ని నివారించాలంటూ పదవీ విరమణ చేయడానికి ముందు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ పిలుపునివ్వడం మన ప్రజాస్వామ్య వ్యవస్థ దీనస్థితిని తెలియజేస్తోంది. అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వందల కోట్ల రూపాయల నగదు, భారీగా మద్యం పంపిణీ కావడం భ్రష్టుపట్టిన మన రాజకీయ వ్యవస్థకు నిదర్శనం. కొన్ని చోట్ల ఓటుకు అయిదువేల రూపాయల చొప్పున రాజకీయ పార్టీలు పంపిణీ చేసినట్లు మీడియాలో వస్తున్న వార్తలను చూసి ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. దేశంలో రాజకీయ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో తాజా ఎన్నికలే నిదర్శనం. విదేశీ మీడియా సంస్థలు సైతం భారత్‌లో ఓటర్లను రాజకీయ పార్టీలు ఎరవేసి కొనుగోలు చేస్తున్నాయని కథనాలు ప్రసారం చేయడం చూస్తుంటే అంతర్జాతీయంగా మన రాజకీయ వ్యవస్థ ఎంతటి అప్రతిష్టను మూటకట్టుకుంటోందో ఇట్టే అర్థవౌతుంది. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలపైనా, అనుసరించే విధానాలపైనా చర్చ జరగాల్సిన సమయంలో ప్రలోభాల పర్వం గురించి చర్చించుకోవాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. అభ్యర్థుల ఎంపికకు కొలమానాలుగా ఉండాల్సిన ప్రజాసేవ, త్యాగం, నిజాయితీల స్థానాన్ని ఆర్థిక స్థోమత ఆక్రమించడం, నేర చరితులను అన్ని పార్టీలూ ఉదారంగా ప్రోత్సహించడం ప్రజాస్వామ్య వాదులను కలిచివేస్తోంది. యథేచ్ఛగా వాగ్దాన భంగాలకు పాల్పడే రాజకీయ పార్టీలను ప్రజాక్షేత్రంలో ఇకముందైనా జనం నిలదీయాలి. సిద్ధాంతాలకు కట్టుబడకుండా, పూటకొక మాట, రోజుకొక పార్టీ కండువా కప్పుకొనే ఊసరవెల్లి రాజకీయ నేతలకు ఓటు అనే ఆయుధం ద్వారానే ప్రజలు గుణపాఠం చెప్పాలి. ఎన్నికల సమయంలో ఆకర్షణీయమైన మేనిఫెస్టోలు, పలు రకాల రాయతీల వలలో పడకుండా జాగ్రత్త పడాలి. ప్రలోభాలకు దూరంగా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందని తెలుసుకోవాలి.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
నేరస్థుల అప్పగింతలో ముందడుగు
అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం కేసులో కీలక నిందితుడైన క్రిస్టియన్ మైఖేల్‌ని దుబాయి నుండి భారత్‌కు తీసుకురావడం నేరస్థుల అప్పగింతల్లో ముందడుగుగా భావించాలి. నేరస్థుల అప్పగింతల విషయంలో వివిధ దేశాల మధ్య స్పష్టమైన విధానాలు లేకపోవడంతో ఆర్థిక నేరస్థులకు వెసులుబాటుగా ఉంటోంది. ఆయా దేశాల కోర్టుల్లో కేసులు వెయ్యడం ద్వారా కొందరు నేరస్థులు కాలయాపన చెయ్యగలుగుతూ, స్వదేశీ చట్టాల్ని అపహాస్యం చేస్తున్నారు. మన దేశపు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేరకు బురిడీ కొట్టి, విదేశాల్లో తలదాచుకొంటున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సేలది ఇదేవరస. ఆర్థిక నేరస్థులకు ఈ వెసులుబాటు చేతికి అందిన సులభమార్గంగా ఉంది. ప్రస్తుతం అగస్టా కుంభకోణంలో కీలక బ్రోకర్‌ని చట్టపరంగా దేశానికి తీసుకురావడంతో కేసు దర్యాప్తులో కొంత వేగాన్ని ఆశించవచ్చు. ఈ ఉదంతం చూసిన పిమ్మట మాల్యా గాంభీర్యంలో తేడావచ్చినట్టుంది. భారతీయ జైళ్లు సౌకర్యంగా ఉండవంటూ బీరాలు పలికిన ఆయన స్వదేశీ బ్యాంకులకు తన పేరిట ఉన్న అప్పుల్ని చెల్లించేస్తానంటూ మర్యాద ఉట్టిపడేలా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. మాల్యాను భారత్ రప్పించే కేసు లండన్‌లో ముగింపుకి రావడం కూడా ఆయన స్వరాన్ని మెత్తబరిచి ఉండొచ్చు. ఏదైనా ఈ పరిణామాన్ని స్వాగతించాల్సిందే. రాజకీయ వత్తిడులు, స్వపర బేధాలు దాటి ఆర్థిక నేరాల దర్యాప్తు, విచారణ, శిక్ష ప్రక్రియలు వేగంగా సాగ గలిగినపుడే ప్రజాధనానికి భరోసా. ఇదే తీరులో మిగతావారినీ సత్వరమే దేశానికి రప్పించి, చట్టం ముందు నిలబెట్టాలి.
- డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం