ఉత్తరాయణం

ఎన్నికల వ్యవస్థకు ప్రక్షాళన ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య బద్ధంగా చట్టసభలకు జరగాల్సిన ఎన్నికల్లో నల్లధనం, దాదాగిరీ వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఇది ప్రజాస్వామ్య ప్రియులందరికీ బాధ కలిగించే విషయం. ఎన్నికల్లో ప్రజావిశ్వాసానికి ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా ధనస్వామ్యం ప్రభావం చూపడం ప్రజాస్వామ్యానికే ముప్పు. ఎన్నికల వేళ నల్లధనం, ప్రసార మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం ప్రబలిపోవడం అత్యంత విచారకరం. 2014లో ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికల ఖర్చు 45కోట్లు కాగా, మొత్తం 532 నియోజకవర్గాలలో 22,500 వేల కోట్లు ఖర్చయ్యాయంటే ధనస్వామ్యపు ఊడలు ఎంతవరకు పాకిపోయాయో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని ప్రధాన పార్టీలు తాము సమాచార హక్కు చట్టం కిందకు రామని, ఎన్నికల సంస్కరణలను పక్కనపెట్టి విరాళాలను గుట్టుగా సేకరిస్తూ- వాటికి ఎన్నికల బాండ్లు అనే అందమైన పేరుపెట్టాయి. విరాళాల పేరుతో కార్పొరేట్ సంస్థలు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు.
ఆర్థిక బలం వున్నవారికే రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించడానికి మొగ్గుచూపి ఎన్నికలను అపహాస్యం చెయ్యడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా, పారదర్శకతతో నిర్వహించే అధికారాన్ని ఎలక్షన్ కమిషన్‌కు రాజ్యాంగంలోని 324 అధికరణ ప్రసాదించింది. ఎన్నికల కమిషన్‌కు దశాబ్దాల కింద ప్రతిపాదించిన- నిర్ణయాధికార స్వేచ్ఛ, స్వంత సచివాలయం, ఉద్యోగులకు భద్రత.. వంటి అంశాలను ప్రభుత్వాలు అటకెక్కించాయి. నల్లధనం ప్రవాహానికి అడ్డుకట్ట వేయకుండా రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ కళ్లకు గంతలు కట్టి అక్రమాలకు పాల్పడుతున్నాయి. నల్లకుబేరుల ఆటలు కట్టించడానికి, వోటర్లకు డబ్బు ఎరవేయడాన్ని శిక్షార్హంగా ప్రకటించే సిఆర్‌పిసి సవరణ బిల్లు ఆమోదం పొందడానికి సగం రాష్ట్రాల మద్దతు కోసం ఇంకా ఎంతకాలం నిరీక్షించాలి? ఈ పరిస్థితులను చూస్తుంటే స్వేచ్చాయుతమైన, పారదర్శకమైన ఎన్నికలు ఎండమావిగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు కళ్ళుతెరిచి ఓటర్లను ప్రలోభపెట్టకుండా ఉండేలా కఠినతరమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా వివేకంతో ఆలోచించి రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగకుండా వ్యవహరించాలి. విశ్వసనీయత, పారదర్శకత, జవాబుదారీతనం, చిత్తశుద్ధి, ప్రజాసంక్షేమం పట్ల విధేయత, దేశభక్తి వంటివి ఉన్న అభ్యర్థులకే ఓటు వెయ్యకపోతే ప్రజాస్వామ్యం సంకటంలో పడే ప్రమాదం వుంది. రాజకీయ పార్టీలు తమ మనుగడ కోసం కాకుండా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దీక్ష వహించాలి.

-సి.కనకదుర్గ, హైదరాబాద్