ఉత్తరాయణం

తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరవై శతాబ్దాలకు పైగా తెలుగు సీమలను అలరించిన భాష మనది. నన్నయ, తిక్కన, ఎర్రన, పోతనాదుల ఉద్గ్రంధ రచనలు వెలగ ఎంతో సంపన్నతనొందిన భాష మనది. రాజరాజ నరేంద్రుడు, శ్రీకృష్ణదేవరాయలు మరెందరో మహారాజ పోషకుల చేతుల్లో ఆదరింపబడి సువికసితయైన భాష మనది. రాజసభలనలరించిన అల్లసాని పెద్దనాదులు, మొల్ల, రంగనాథ, వెంగమాంబాదుల రచనల ద్వారా నడయాడిన తెలుగు- మనం గర్వించదగిన భాషగా విలసిల్లినది. దాశరథి, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, విశ్వనాథ, జాషువా వంటి ఎందరెందరో మహాకవులు వారి కవితలచే తెలుగువారి నోళ్లలో నడయాడించిన దివ్యభాష మనది. పరాయి పాలనలో కూడ పరువును కాపాడుకుంటూ వచ్చిన భాష నేడు మన పాలకులచే పాతిపెట్టబడుతున్నది. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి, గొప్ప గౌరవాన్ని కల్పించినది ఎన్టీరామారావు కాగా, ఆయన రాజకీయ వారసుల చేతుల్లో నేడది అడవులబట్టిపోతున్నది.
ఉగ్గుపాలతో రంగరించి తల్లులు తమ పిల్లలకు మాతృభాషను నేర్పించినా, తెలుగు కథలు చెప్పి తెలివిని గూర్చుతున్నా తెలుగు పాటలు పాడి జోపుచ్చుతున్నా- నేడు మన చిన్నారులను చదివించనెంచి నర్సరీలకు గాని, పాఠశాలలకు గాని పంపిస్తూంటే వారికి ఆంగ్లాన్ని నూరిపోస్తూ నెమ్మది నెమ్మదిగా మాతృభాషకు దూరం చేస్తున్న పాలకుల్ని ఏమనాలి? తెలుగు భాషను తుదముట్టించే భాషావిరోధులు కారావీరు? ప్రాథమిక స్థాయిలో పిల్లలకు తెలుగునేర్పితే వారికి వచ్చిన నష్టమేమిటి? ముందుగా మన భాషను నేర్వాలి. తర్వాత ఆంగ్లం సహా మరెన్ని భాషలనైనా నేర్పవచ్చును. మాతృభాష ద్వారా తల్లి ఇస్తున్న సంస్కారాల్ని ఆపివేస్తూ, పాఠశాలల్లో చేరడంతోనే ఆంగ్ల భాష ఎంగిలి పదాలను వల్లింపజేసేవారు మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తున్న వారనాలా? కాదా? పరాయి భాషపై వల్లమాలినమోజు నేతలకు ఉంటే ఉండనివ్వండి. రాబోయే తరం వారి భవిష్యత్తును నాశనం చేయవద్దు. ఆ అధికారం పాలకులకు లేదు. వారి మనసులలో ఏ దురాలోచనలున్నా, వాటిని చిన్నారులపై రుద్ది సమాజాన్ని నాశనం చెయ్యకండి. పాలకులు మనసులో తెలుగుయెడల ఇంత విషం పెట్టుకుని, మన స్వాతంత్య్రాన్ని హరించి పాలించిన బ్రిటిష్‌వారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత గతిలేక మనలను వదలిపోయేరని ఒకప్రక్క మనం సంతోషిస్తూంటే, వారి భాషను పట్టుకువేళ్ళాడేవారు ఆంధ్రకు ప్రత్యేక హోదాను ఇస్తేనే ఆత్మగౌరవం నిలుస్తుందని కేంద్రంపై బడి ఏడవటంలో ఔచిత్యమేముంది? తల్లిపాలు త్రాగి పెరిగి, తల్లిపేరిట రాజకీయ పార్టీని పెట్టి పాలకులై తల్లి భాషను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేవారు ఆ తల్లి రొమ్ము గ్రుద్దే ద్రోహులవరా? వీరా ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం గూర్చి నీతులు చెప్పేది?
-ఆచార్య దుగ్గిరాల విశే్వశ్వరం, విశాఖ

పెట్రో ఉత్పత్తుల వాడకం తగ్గించాలి
నిత్యం పెట్రో ధరలు పెరుగుతుంటే తమ ఆదాయం కూడా పెరుగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులను ఆదుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. నేడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటివి అందరికీ నిత్యావసరాలుగా మారాయి. పెట్రో ధరల పెరుగుదల ప్రత్యక్షంగా రవాణా రంగంపై, పరోక్షంగా నిత్యావసర వస్తువులపై దుష్ప్రభావం చూపుతోంది. యుపీఏ ప్రభుత్వం పెట్రో కంపెనీలకు బకాయి పడిన రెండు లక్షల కోట్ల రూపాయలను మోదీ ప్రభుత్వం తీర్చిందని కేంద్ర మంత్రి ఒకరు అన్నారు. పెద్దల మొండి బకాయిల నుండి గట్టెక్కటానికి రెండు లక్షల కోట్ల రూపాయలకుపైగా ఇచ్చి బ్యాంకులను ఆదుకున్న ప్రభుత్వం, కోట్లాదిమంది సామాన్య ప్రజానీకాన్ని ఆదుకోకూడదా? అభివృద్ధి పేరిట జరుగుతున్న స్మార్ట్ నగరాలు, ఫ్లైఓవర్లు, ఇతర పథకాల్లో అవినీతి వ్యవహారాలు పేట్రేగిపోతున్నాయి. పెట్రో ధరల తగ్గింపువంటి చర్యలతోనే ప్రజానీకానికి ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది. కేంద్రం తక్షణమే స్పందించి పెట్రో ఉత్పత్తులను జిఎస్‌టీ పరిధిలోకి తేవటమో, వాటి ధరలను సహేతుకంగా తగ్గించటమో చేస్తే రాష్ట్రాలు అదే బాట పట్టక తప్పదు. మన విదేశీ మారక నిల్వల్లో అత్యధిక భాగం పెట్రో దిగుమతులకే పోతున్నందున వాటి ధరల పెంపుకంటే నిల్వల్లో అత్యధిక భాగం వ్యక్తిగత వాహన వినియోగం తగ్గించేలా ప్రజలను చైతన్యపరచాలి. ఈ విషయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు మార్గదర్శకంగా వుండాలి. డెన్మార్క్, హాలెండ్ వంటి ధనిక దేశాల్లో కోటీశ్వరులు, మంత్రులు సైతం సైకిళ్ళను ఎక్కువగా వాడతారట. ఈమధ్య న్యూజిలాండ్ మహిళా మంత్రి తన తొలి ప్రసవానికి కూడా సైకిల్‌పై హాస్పిటల్‌కు వెళ్లిందట. మరి మన దేశంలో మంత్రులు బయటకు కదిలితే డజన్ల కొద్దీ వాహనాలు ఉండాల్సిందే. వేదికలపై ఆదర్శాలు మాట్లాడే నేతలు తాము కూడా వాటిని ఆచరిస్తే ప్రజలూ అదే దారిలో నడుస్తారు. ఇంధన దిగుమతుల భారం తగ్గుతుంది, రూపాయి విలువ పెరుగుతుంది. ఇక, పెట్రో ఉత్పత్తుల వాడకం తగ్గించాలంటే ప్రభుత్వం రవాణా వ్యవస్థను పెంచాలి. రద్దీగా వున్న మార్గాల్లో లోకల్ రైల్ సర్వీసులు పెంచాలి. బయో డీజిల్, బయోగ్యాస్, గోబర్ గ్యాస్ వంటి స్వదేశీ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. బ్యాంకులిచ్చే వాహన రుణాలను నియంత్రించాలి. ప్రజలు కూడా వాతావరణ కాలుష్యాలు, అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకొని సైకిళ్లను వాడితే దేహానికీ, దేశానికీ మంచిది.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట

దిగజారుడు ప్రసంగాలు
ఎన్నికల నగారా మోగిన అనంతరం రాజకీయ పార్టీలు మాటల యుద్ధాలను ప్రారంభించాయి. రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన మాటల యుద్ధం కాకుండా అసంబద్ధమైన అసభ్య పదజాలంతో కూడిన ప్రసంగాలు బాధను కలిగిస్తున్నాయి. మాధ్యమాలు వారి టిఆర్‌పి రేటింగులను పెంచుకునేందుకు వీటిని ప్రత్యక్ష ప్రసారం చేయడం, పదే పదే అవే పంచ్‌లను చూపించడం సరికాదు. భావోద్వేగాలను రెచ్చగొట్టే నేతల ప్రసంగాలను ప్రసారం చేయడం రాజకీయ వ్యవస్థను అప్రదిష్టపాలుచేస్తోంది. పదవులు రావాలని అనుకోవడంలో తప్పులేదు కానీ, వాటికోసం ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, కుల, మత, వర్గ, ప్రాంతీయ ప్రాతిపదికలపై విడగొట్టి తమ పబ్బం గడుపుకోవడం, ఒకరిపై ఒకరు బురద జల్లుకొని తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు వాటిని ప్రజలపైకి విసరడం శోచనీయం. ఇప్పటికైనా వోటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలకాలి. తమ సమస్యల పరిష్కారం ఆశలు పెట్టుకుంటున్న ప్రజలను నాయకులు రాజకీయాలకు అతీతంగా ఆదుకోవాలి. నేతలు అలా పనిచేసినపుడు పదవులను ప్రజలే స్వచ్ఛందంగా కట్టబెడతారు. దిగజారుడు రాజకీయ ప్రసంగాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో మనుగడ సాగించలేవు.
- సి.కనకదుర్గ, హైదరాబాద్