ఉత్తరాయణం

ఉత్తరాయణం.......

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాఫెల్’పై జవాబు చెప్పాలి
రహస్యం పెరిగేకొద్దీ అనుమానాలు పెరిగి ధ్రువపడతాయి. ఆ తర్వాత అందుకు భిన్నంగా ఏమైనా నిజాలున్నా ఎవరూ పట్టించుకోరు. దేశ రక్షణకు, వాయుసేనకు అవసరమని 36 రాఫెల్ యుద్ధవిమానాల్ని ఫ్రెంచ్ కంపెనీ నుండి 58వేల కోట్ల రూపాయలకు భారత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొంది. ఆ ఒప్పందంలో నిబంధన ఏమిటంటే ఆ సంస్థకు భారత్‌లో భాగస్వామిగా ఒక కంపెనీ ఉండాలి. కొన్నివేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అంటే విడి భాగాల తయారీ బాధ్యతను భారతీయ కంపెనీకి ఇస్తారు. తద్వారా మన దేశీయ కంపెనీకి కూడా కొంత లాభం చేకూర్చాలి. ఇదే తరహా ఒప్పందం గత యుపీఏ ప్రభుత్వం మొదలుపెట్టినప్పుడు 126 యుద్ధవిమానాలకు 90వేల కోట్ల రూపాయలుగా నిర్ణయించడమే కాకుండా భారత ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ను భాగస్వామిగా నిర్ణయించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అదే బేరం ఇలా ముగిసింది. అంటే ఒక్కో యుద్ధవిమానం ధర రెట్టింపు అయ్యింది. ఎంతో అనుభవం ఉన్న ప్రభుత్వరంగ సంస్థ పక్కకెళ్లి, నష్టాల్లో ఉన్న ప్రయివేట్ సంస్థ ‘రిలయన్స్ డిఫెన్స్’ తెరమీదకు వచ్చింది. ఇదంతా కుంభకోణమని ప్రతిపక్షాలు, పాలక పక్షంలోనే కొందరు మాజీ మంత్రులు చెప్తున్నారు. ప్రజలు సైతం అనుమానపడుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఇదో రక్షణ రహస్యం, బయటకు చెప్తే ప్రమాదం అంటూ చెబుతోంది. ఇప్పుడు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడే చెప్తున్నారు- అనిల్ అంబానీ సంస్థనే భాగస్వామిగా ఉంచుకోమని భారత ప్రభుత్వమే సిఫార్సు చేసిందంటూ. ఎలాంటి అనుభవమూ, యోగ్యతా లేని ప్రయివేట్ కంపెనీలపై ప్రేమ కురిపిస్తున్న ప్రభుత్వం, న్యాయంగా వ్యవహరించి ప్రభుత్వరంగ సంస్థకే ఆ భాగస్వామ్యం కల్పించి వుంటే ప్రజాధనం సద్వినియోగమయ్యేది. ‘మేక్ ఇన్ ఇండియా’ ఆశయానికి అర్థం చేకూరేది. సుప్రీం కోర్టు రాఫెల్ ఒప్పందంపై విచారణకు సరే అనడం ఊరటే కానీ ప్రభుత్వం నిజాల్ని బయటపెట్టడం మరింత ఆవశ్యకం. ప్రజాధనం, దేశరక్షణ అంశాలతో ముడిపడి ఉన్న ఒక పెద్ద ఒప్పదంపై నీలినీడలు కమ్ముకోవడం మంచిది కాదు.
- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

ఎంపీ లాడ్స్.. వ్యర్థ పథకం
గతంలో ఎంపీ లాడ్స్ పథకం కింద ఒక్కొక్క ఎంపీకి కోటి రూపాయల నిధులు ఏటా కేంద్రం కేటాయించేంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా ప్రతి పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు నిర్దేశించిన ఈ పథకం తొలుత మంచి ఫలితాలను ఇచ్చింది. తర్వాత పార్లమెంటరీ స్థారుూ సంఘం సిఫార్సులమేరకు గత యుపిఏ ప్రభుత్వం ఎంపీ లాడ్స్ నిధులను కోటి నుండి మూడు కోట్లకు పెంచింది. అనంతరం నిధులు దారిమళ్ళుతున్నాయని, అవినీతికి, అక్రమాలకు తావునిస్తోందని ‘కాగ్’ నివేదిక ప్రాతిపదికపై మోదీ ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేసింది. అందులో ముఖ్యమైనది కొన్ని నిధులను ఆదర్శ గ్రామ యోజన కింద గ్రామాలను దత్తతకు తీసుకొని అభివృద్ధిచేయాలి. పది మంది కేంద్ర మంత్రులు సహా 78శాతం మంది ఎంపీలు ఇప్పటివరకు ఒక్క గ్రామాన్ని కూడా దత్తత తీసుకోలేదని తాజా నివేదిక పేర్కొంది. 13 రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ ఎంపీలు ఒక్క గ్రామాన్ని కూడా దత్తత తీసుకోలేదు. 16 రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ ఎంపీలు అసలు ఈ పథకంలో తమ పేరునే నమోదు చేయించలేదు. ఒకపక్క సెలబ్రిటీలు, కార్పొరేట్ సంస్థల అధిపతులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి గ్రామాలను దత్తత ద్వారా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుంటే వారికి దిశానిర్దేశం చెయ్యాల్సిన మంత్రులు, పార్లమెంటు సభ్యులు నిర్లిప్తవైఖరి అవలంబించడం దారుణం. దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి కాస్తమెరుగ్గా వున్నా బిహార్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులు ఇప్పటివరకు గ్రామాలను దత్తత తీసుకోవడం అటుంచి కనీసం ఏ నిర్ణయం కూడా తీసుకోకపోవడం బాధాకరం. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో పాలుపంచుకోని సభ్యులు నిధులను ఆపివేయాలని ‘కాగ్’ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ పథకంలో అక్రమాలు జరగకుండా, అవినీతికి తావులేకుండా, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ‘కాగ్’ వంటి ఒక స్వయం ప్రతిపత్తి వున్న సంస్థతో నిష్పక్షపాతంగా ఆడిట్ జరిపించి, అవినీతి జరిగిన పక్షంలో సంబంధిత సభ్యుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. ఈ చక్కని పథకం నిర్వీర్యమవకుండా సమష్టి కృషితో సత్ఫలితాలనిచ్చే విధంగా అమలుచేయాల్సిన గురుతర బాధ్యత పార్లమెంటు సభ్యులపై ఉంది.
-ఎం.కనకదుర్గ, తెనాలి

సీపీఎస్ విధానంతో ఇక్కట్లు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విశ్రాంత ఉద్యోగులకు ‘పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం’ చందాన ఉంది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ఉద్యోగుల పెన్షన్ సొమ్ము నుండి 8 శాతం స్టాక్ మార్కెట్‌లోకి మళ్లించి, అక్కడ వచ్చే లాభనష్టాలను బట్టి ఉద్యోగుల పెన్షన్ నిధిలో మార్పుచెయ్యడం అనే విధానం విశ్రాంత ఉద్యోగులకు అప్రయోజనకారిగా వుంది. జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకొని ఉద్యోగ విరమణ చేసిన అనంతరం వారి శ్రమకు ఫలితంగా శేషజీవితం గౌరవప్రదంగా బ్రతికేందుకు నిర్దేశించిన పెన్షన్ సొమ్మును ఉద్యోగుల అభిప్రాయాలు, అనుమతులతో పనిలేకుండా జూదానికి పర్యాయపదమైన స్టాక్‌మార్కెట్‌లో పెట్టే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు. ఇది చాలక స్టాక్‌మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా పెట్టుబడులకు నష్టం వస్తే ఆ బాధ్యత ఈ విధానంతో ఏమాత్రం సంబంధంలేని ఉద్యోగులే వహించాల్సిరావడం, సదరు స్కీములో ప్రభుత్వోద్యోగులతోపాటు ప్రైవేట్ రంగం ఉద్యోగులను కూడా ఇరికించడం అనే ప్రభుత్వ విధానం పెట్టుబడిదారీ వ్యవస్థకు మద్దతు ఇచ్చేదిగా వుంది. ఉద్యోగులు ఏమైపోతే మాకెందుకు, మాకుమాత్రం వారి డబ్బు, కార్పొరేట్ రంగం పాలిట వరప్రసాదిని అయిన స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులే ముఖ్యం అనే ప్రజావ్యతిరేక ఆలోచనా విధానాన్ని ప్రస్ఫుటిస్తోంది. గతంలో ఎల్‌ఐసి కూడా ఇటువంటి పథకం ప్రవేశపెట్టి వారి ఉద్యోగుల పెన్షన్‌ను మ్యూచువల్ ఫండ్స్‌లోపెట్టి మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా తీవ్రంగా నష్టాలు చవిచూసి వేలాది ఉద్యోగుల నోళ్ళలో మట్టికొట్టింది. ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం ఆరోగ్య సమస్యలు, కుటుంబ అవసరాలు, పిల్లల పెళ్ళిళ్ళు వంటి అవసరాలు ఎన్నో వుంటాయి. అయితే సిపిఎస్ విధానంవలన విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ డబ్బు సకాలంలో అందదు. స్టాక్‌మార్కెట్ ఎప్పుడూ ఒకేరీతిలో ఉండక అనేక ఒడిదుడుకులకు గురవుతూ వుంటుంది. ప్రభుత్వం మదుపుపెట్టిన షేర్లు పతనమైతే తమ పెన్షన్ పని గోవిందా అయిపోతుందని లక్షలాది ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. అసలు ఉద్యోగుల పెన్షన్ డబ్బు స్టాక్‌మార్కెట్‌లో పెట్టే అధికారం ప్రభుత్వానికి ఎలావుంటుందని అశేష ఉద్యోగులు వేసే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాధానం లేదు. ఆర్థిక సంస్కరణలు ప్రజల జీవితాలకు ప్రయోజనం కలిగించే రీతిలో వుండాలి తప్ప జీవితాలలో అంధకారం నింపేదిగా వుండకూడదు.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం