ఉత్తరాయణం

పౌష్టికాహారంపై ఇంత నిర్లక్ష్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌష్టికాహార లేమితో బాధపడుతున్న ప్రపంచ జనాభాలో మూడో వంతు మంది భారతదేశంలోనే ఉన్నారు. మన దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో 46 శాతం మంది పౌష్టికాహారం అందక- బరువు తక్కువతో, పెరుగుదల లోపంతో బతుకులీడుస్తున్నారు. ఆ వయసువారిలోనే 70 శాతం మందికి రక్తహీనత. ఈ అంకెలు ఎవరినైనా భయపెట్టే వాస్తవాలను తెలుపుతున్నాయి. 2030 నాటికి భారతదేశ జనాభాలో సగటు వయసు 26 సంవత్సరాలుగా, దాదాపు 70 శాతం మంది యువకులుగా ఉంటారన్న నేపథ్యంలో పాలకులు ఎంత ఆందోళన చెందాలి? విలువైన మానవ వనరులతో అభ్యున్నతి చెందడానికి ఎంతో ప్రణాళికాబద్ధంగా కృషి చెయ్యాల్సి వుంది. ముఖ్యంగా పౌష్టికాహార లేమితో బాల్యం గడిస్తే ఆ దుష్ప్రభావాలు అనేకం. విద్యా కౌశలాల సాధనలో ఆటంకం ఏర్పడడమే కాకుండా శారీరక దౌర్బల్యం జీవితాంతం వెంటాడుతుంది. అందుకనే బాల్యంలో ఆ తరహా ఇబ్బందులపై వెంటనే స్పందించాలి. లేకుంటే దీర్ఘకాలిక దుష్ప్రభావాలు వ్యక్తిపై, వ్యవస్థపై తప్పవు. తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి వారికి చికిత్స అందించడంతోపాటు తల్లికి అవగాహన కలిగించి తరువాత కూడా ఆ నియమాలను పాటించేలా చూసేందుకు పౌష్టికాహార పునరావాస కేంద్రాల్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆసుపత్రికి, ఇంటికి మధ్య వంతెనలా పనిచేస్తూ అవి విజయవంతం అవుతున్నాయి. ఆ కేంద్రాల్లో ఉన్నన్నాళ్ళూ పిల్లలకు వైద్యం, ఆహారం ఇవ్వడంతోబాటు తల్లికి కూడా కొంత నగదు అందించడం వల్ల ఉపాధి కోసం కంగారుపడే బాధ తప్పి, ఆ కేంద్రాల్లో పిల్లల హాజరు బాగుంటుంది. అయితే బాగా పనిచేస్తున్న ఈ కేంద్రాల పట్ల మరింత శ్రద్ధ చూపించాల్సిన ప్రభుత్వం వేరేరకంగా ప్రవర్తించడం జరుగుతున్న పరిణామం.
ఆంధ్రప్రదేశ్‌లో పౌష్టికాహార పునరావాస కేంద్రాలు ప్రస్తుతం పద్దెనిమిది ఉన్నాయి. ఇంకా మరిన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అయితే ఉన్నవాటినే నీరుగార్చే ఆదేశాలు ప్రభుత్వం జారీ చేస్తుంది. 20 మంది పిల్లలున్న కేంద్రాల్లో ఇంతవరకూ ఇద్దరు పోషకాహార నిపుణులు, ఇద్దరు వంటవాళ్ళు, ఒక సామాజిక కార్యకర్త, సహాయకులు పనిచేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో ముగ్గురేసి సిబ్బందిని తొలగించమని హఠాత్తుగా వైద్యశాఖ పేరిట ఆదేశాలు ఈనెల 6న జారీ అయ్యాయి. ఏ మాత్రం ముందస్తు నోటీసు ఇవ్వకుండా తక్షణం విధుల నుండి తొలగిస్తామని సిబ్బందికి ఆదేశమివ్వడం అంటే అది వారి హక్కుల్ని దారుణంగా నిరాకరించడమే, అప్రజాస్వామికమే. ఆ విషయం అలా ఉంచితే 20 మంది పిల్లలకు భోజనం తయారీ చేసే వంటమనిషి ఒక్కరే ఉంటే అన్ని రోజులూ సెలవు లేకుండా పనిచేయడం సాధ్యం అవుతుందా? అవగాహన కల్పించే సామాజిక కార్యకర్తని తొలగించి ఖజానాకు ఎంత పొదుపు చేసేస్తుంది ప్రభుత్వం? ఇంతవరకూ ఈ కేంద్రాలు ఎంతో కొంత మంచి పనితీరు కనబరుస్తున్నాయంటే తగిన సంఖ్యలో సిబ్బంది ఉండడం వల్లనే. మరిన్ని కేంద్రాల్ని నెలకొల్పి మంచి ఫలితాలు సాధించేందుకు ప్రయత్నించకుండా, ప్రభుత్వం ఉన్నవాటికి ఎసరు పెట్టడం దురాలోచన. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన తిరోగామి ఆదేశాలను నిలుపుదల చెయ్యాలి. ఉన్న వ్యవస్థను బలోపేతం చెయ్యాలి.
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

ఆ నివేదిక ఏకపక్షం..
గోదావరి నది పుష్కరాల సమయంలో రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద మొదటిరోజు జరిగిన తొక్కిసలాటపై జస్టిస్ సోమయాజులు కమిషన్ సమర్పించిన నివేదిక ఏకపక్షంగా సాగింది. పుష్కర ఘాట్ వద్ద ప్రజలు అత్యుత్సాహంతో స్నానాలకు తోసుకురావడం, తొలిరోజు మొదటి గంటలో స్నానం చేస్తేనే ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక ప్రవచనకారుల అభిప్రాయానికి మీడియా విస్తృత ప్రచారం కల్పించడం వల్లనే తొక్కిసలాట జరిగిందని విచారణ కమిషన్ తేల్చడం సరికాదు. ప్రవచనకారులు భక్తులలో అంధ విశ్వాసాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టారని, ఇటువంటి సందర్భాలలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసువ్యవస్థ నియంత్రణ చేయడం కష్టసాధ్యమని సదరు నివేదిక ప్రకటించడం అహేతుకం. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులను లోపలికి రానివ్వకుండా- వీఐపీలు, వారి కుటుంబ సభ్యులు తీరికగా పుష్కర స్నానాలు చెయ్యడం, పుష్కరాల సందడిని కొందరు సినిమా దర్శకులు చిత్రీకరించడం వంటి అంశాలపై సదరు నివేదిక దృష్టిసారించలేదు. పుష్కరాలంటే ఎంతో పవిత్రమని భావించడం వల్లనే ప్రజలు లక్షల సంఖ్యలో రావడం సహజం. వచ్చే భక్తులను అంచనా వేసి, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపైనే వుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో అనేకసార్లు పుష్కరాలు నిర్వహించినా ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. భక్తులకు సరిపోయేటట్టుగా ఏర్పాట్లు చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నది నిర్వివాదాంశం. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పును ప్రజలపై, మీడియాపై రుద్దడం సమంజసం కాదు. పుష్కరాలకు చాలీచాలని ఏర్పాట్లు చేసినా- క్రమశిక్షణతో, నిబద్ధతతో అశేష భక్తజనావళి స్వీయ నియంత్రణ పాటించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించిన తీరు అపూర్వం, అద్వితీయం. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట ఘటనతోనైనా ప్రభుత్వ యంత్రాంగం తగిన పాఠాలు నేర్చుకొని, భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృత్తం కాకుండా తగు చర్యలు చేపట్టడం అత్యావశ్యకం.
- సి.హెచ్.ప్రతాప్, శ్రీకాకుళం