రివ్యూ

ఏమాత్రం తూగలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*తులసీదళం (బాగోలేదు)

తారాగణం:
నిశ్చల్, వందనాగుప్తా, దీపక్ రావెళ్ల, ఆర్‌పి పట్నాయక్, దువ్వాసి, బ్రహ్మానందం, రాకెట్ రాఘవ, అనితాచౌదరి తదితరులు.
సినిమాటోగ్రఫీ:
శరత్ మండవ
సంగీతం,
దర్శకత్వం:
ఆర్‌పి పట్నాయక్

హారర్ జోనర్‌లో భయంలేకున్నా పర్వాలేదు. ప్రేక్షకుడికి కనీసం సినిమాపై ఉత్సుకత కలిగించాలి. కథా కథనాలకు మసిపూసి మారేడుకాయ చేస్తే హారర్ అనిపించుకోదు. సరికదా ఆ జోనర్ సినిమాలపట్ల ఆడియన్స్‌కి వెగటు పుడుతుంది. అలాంటి చిత్రమే తులసీదళం. పేరు పవిత్రం. హారర్ మాట అపవిత్రం.
కథేంటి?
సాత్విక్ (నిశ్చల్) అనాథ. విదేశాల్లో చదువుకొని చిన్ననాటి ప్రియురాలు నిషా (వందనా గుప్తా)ను కలిసేందుకు లాస్ విల్లాస్‌కు వస్తాడు. మొదటి సన్నివేశమే కేరళలో ఓపెన్ చేశారు. అక్కడ ఓ అమ్మాయి స్నేహితురాలు చనిపోగా, ఆ అమ్మాయి దయ్యమై స్నేహితురాల్ని చంపేసి తనతోపాటు తీసుకెళ్తానంటూ గోల చేస్తుంది. కేరళ మాంత్రికులతో ఆ దయ్యాన్ని సీసాలో బంధించి, భూమిలో పాతిపెడతారు. కట్ చేస్తే హీరో లాస్‌విల్లాస్‌లోకి ప్రవేశిస్తాడు. తన ప్రియురాలితో ఆనందంగా చెట్లమ్మట, పుట్లమ్మట తిరుగుతూ లవ్ చేస్తుంటాడు. అతనితోవున్న నలుగురు బ్రహ్మచారుల మధ్య నిరంతరం దయ్యాలకు సంబంధించిన చర్చలు వస్తుంటాయి. అందులో భాగంగా తనకి దయ్యాలంటే భయంలేదని, కావాలంటే రాత్రంతా శ్మశానంలో నిద్రిస్తానని సవాలు చేస్తాడు సాత్విక్. ఆ సవాల్‌నూ సాధిస్తాడు. అప్పట్నుండి అతనిలో ఏదో మార్పు వస్తుంది. అనుకోకుండా శాంతి అనే అమ్మాయి పరిచయవౌతుంది. స్నేహితుల వద్ద శాంతి ప్రస్తావన వచ్చేసరికి, ఆమె చనిపోయి రెండేళ్లయ్యిందని తెలుస్తుంది. మరి తనకు పరిచయమైన అమ్మాయి ఎవరు? అని సాత్విక్ ఆలోచనలో పడతాడు. అతనిలోని ఆలోచనను బయటపెట్టించడానికి స్నేహితుడు తిలక్ (ఆర్‌పి పట్నాయక్) అనే సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్తారు. సాత్విక్‌ను వెంబడిస్తున్న దయ్యం కోరిక తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చివరికి దయ్యం కోరిక ఏంటి? సాత్విక్‌ని వెంబడించడానికి కారణాలేంటి? అనేది మిగతా కథ.
ఎలా వుంది?
కేరళలో మొదలైన సినిమా లాస్ విల్లాస్‌లో జరగటానికి గల కారణాలను ఎక్కడా వివరించలేదు. ఇదే కథను ఇండియా నేపథ్యంలోనూ చక్కగా చెప్పొచ్చు. కాకపోతే హారర్ జోనర్‌లో చెప్పాలన్న ఆలోచన బాగానేవున్నా, దాన్ని ఆలోచనలోనుంచి తెరపైకి తీసుకురావడంలో తడబడ్డారు. తిలక్ పాత్ర దయ్యాలను వదలగొట్టేదా? లేక సైకియాట్రిస్ట్ పాత్రా అనేది క్లారిటీ ఇవ్వలేకపోయారు. శాంతి బతికున్నప్పుడు ఒక్కసారీ సాత్విక్‌ను చూడలేదు. కానీ, సాత్విక్‌నే ఎంచుకోటానికి కారణమేంటి? అనేది బలమైన పాయింట్‌గా చూపలేదు. నిషాకు పిల్లలు ఇష్టంలేరన్న ఒక కారణంతో ఆమెను అంతం చేయడానికి దయ్యం ప్రయత్నించడంలో కూడా సరైన రీజన్ కనిపించదు. తెరపై బొమ్మ వెళ్లిపోతుంది కాబట్టి, ఆ పాత్ర చెప్పింది వినాలి కాబట్టి, వింటాం కానీ.. కథలో ఒక్కటీ సరైన పాయింట్ కనిపించదు. శాంతిని నిషాకు పరిచయం చేసే సీన్‌లోనూ లోపంవుంది. నిషాకు శాంతి కనబడలేదు. ఓకే. సాత్విక్‌కు మెంటల్ కండిషన్ సరిగా లేదని ఆమెకి అర్థమైవుంటుంది కదా? అలాంటప్పుడు తన ప్రేమికుడు అటువంటి పరిస్థితుల్లో వుంటే, ఆమె వెళ్లిపోవడంలో అర్థమేంటి? అంటే సన్నివేశాలను వారికి తగ్గట్టు రాసుకున్నారు కానీ, పాత్రల ప్రవర్తనను బట్టి ఎక్కడా రాసుకోలేదు. అలా దయ్యం అంటే భయం బదులు నవ్వొచ్చే విధంగా తయారుచేసిన సినిమాల్లో, ఈ చిత్రం వెగటు వచ్చేలా చేసింది. దొంగ బాబాలు డబ్బుకోసం ఎలాంటి హోమాలైనా చేస్తారని బ్రహ్మానందం పాత్రలో చూపించారు బాగానే వుంది. అలాంటి గురువులకు భక్తులైన వాళ్లు ఏవో ట్రాన్స్‌లోవుంటారు అనడానికి నిదర్శనమే, కలియుగాంతం కాకుండా నేను రెండు లక్షలిచ్చి, హోమం చేయిస్తేనే ఆగిపోయిందని చెప్పే సుబ్బులాంటి పాత్రలు కనిపిస్తూనే వుంటాయి. ఈ పాత్రలో వున్న నిజాయితీ మిగతా పాత్రల్లో ఎక్కడా కనబడదు. అదే తులసీదళం పవిత్రత.
నటీనటుల్లో నిశ్చల్ తన పాత్ర వరకూ బాగానే చేశాడు. నిషాగా వందనాగుప్తా తేలిపోయింది. ఒక్క దువ్వాసి పాత్రే బాగా పండింది. బ్రహ్మానందం గోలగోల చేసినా వర్కవుట్ కాలేదు. ఆర్‌పి పట్నాయక్ తాను హారర్ జోనర్‌లో భావాలు పలికించగలనని చెప్పుకోవడానికే ఈ చిత్రం చేసినట్టనిపించింది. ముగింపులో పెళ్లి సన్నివేశంలో దయ్యం పట్టినట్టు అరచిన ఒక్క సీన్‌లో అతను చక్కగా కనిపించాడు. ఓ రకంగా అలాంటి సీన్ అతనికి ఫేవరెట్ అయి వుండొచ్చు. మిగతా వాళ్లంతా సోసోగా చేశారు. కెమెరా పనితనం ఫరవాలేదు. పాటలు ఒక్కటీ బాగా లేదు. నేపథ్య సంగీతం సోసోగా వుంది. నిర్మాణ విలువలు విదేశాలకు కావాలని వెళ్లినట్టే వుంది. దర్శకత్వపరంగా ఎక్కడా మెరుపులు మెరిపించలేకపోయాడు.

-శేఖర్