తెలంగాణ

అబ్కారీ ఖజానా... కాసుల గలగల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 5: అటు సంబరమైనా.. ఇటు విషాదమైనా.. దావత్ (పార్టీలు) మాత్రం చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఇంకేముంది మద్యం వ్యాపారం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్న చందంగా వర్థిల్లుతుండగా, అబ్కారీ ఖజానా కాసులతో గలగలలాడుతోంది. ఇక మండుటెండల్లో బీర్లు పారులై పారింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.1400కోట్ల లిక్కరు, బీర్లు అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోల్చితే రూ.200కోట్లు అమ్మకాలు అదనంగా పెరిగాయి. జిల్లాలో కల్తీ కల్లు, గుడుంబా విక్రయాలపై ఉక్కుపాదం మోపడం లాంటి కారణాలు మద్యం అమ్మకాలు పెరగడానికి దోహదపడినట్లు అబ్కారీ అధికారులు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 301 మద్యం దుకాణాలు, 48బార్లు ఉన్నాయి. అధికారికంగా 301 మద్యం దుకాణాలే ఉన్నా... ప్రతి గ్రామంలో మాత్రం అనధికారికంగా ఐదారు బెల్ట్ (గొలుసు) షాపులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 2015-16 సంవత్సరానికి సంబంధించి గతేడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 31వరకు 23,84,192 లిక్కరు కాటన్ (కేసుల)ను అమ్ముడుపోగా, 45,29,983 కాటన్‌ల బీర్లు అమ్ముడుపోయాయి. వీటి విలువ రూ.1400.22కోట్లు. అంటే రోజుకు సగటున సుమారు రూ.4కోట్ల అమ్మకాలు జరిగాయన్న మాట. గతేడాదితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200కోట్లు అదనంగా (16శాతం) అమ్మకాలు పెరిగాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 19,96,290 కాటన్‌ల మద్యం, 40,77,189 కాటన్‌ల బీర్లు అమ్మకాలు జరిగి రూ.1199.33కోట్లు అబ్కారీ శాఖకు సమకూరింది. 2013- 14 ఆర్థిక సంవత్సరంలో 17,20,866 కేసుల మద్యం, 34,28,044 కేసుల బీర్లు అమ్మగా, రూ.9124.71కోట్లు ఆదాయం సమకూరింది. ఏడాది పొడవునా మద్యం అమ్మకాలు ఇలా ఉంటే...వేసవిలో మాత్రం బీర్లు పొంగాయి. దంచికొట్టిన ఎండలతో మద్యం ప్రియులు బీర్లు తెగ తాగేసారు. పిబ్రవరిలో 3.15లక్షల కాటన్ బీర్లు అమ్ముడుపోగా, మార్చిలో 3.25లక్షల కాటన్‌ల బీర్లు అమ్ముడుపోయాయి. ఏప్రిల్‌లో 3.65లక్షల కాటన్‌లు బీర్లు అమ్ముడుపోయాయి. ఏప్రిల్ మాసంలో లిక్కరు, బీర్లు కలిపి మొత్తం రూ.124.70కోట్లు అమ్మకాలు జరిగాయ. గత ఏప్రిల్ మాసంతో పోల్చితే రూ.30కోట్లు అదనంగా అమ్మకాలు జరిగాయి. గత ఏప్రిల్ మాసంలో 14,4,008కాటన్‌లు లిక్కర్, 3,75,457 కాటన్‌ల బీర్లు అమ్మకాలు జరిగి, రూ.96.04లక్షలు ఆదాయం వచ్చింది. మద్యం అమ్మకాల్లో నల్గొండ జిల్లా మొదటి స్థానం, ఖమ్మం జిల్లా రెండవ స్థానంలో నిలువగా, కరీంనగర్ జిల్లా మూడవ స్థానం నిలిచింది. ఏప్రిల్ మాసంలో మద్యం విక్రయాల్లో ఖమ్మం మొదటి స్థానంలో ఉండగా, కరీంనగర్ రెండవ స్థానంలో ఉంది. మొత్తానికి ఎండ దెబ్బకు అన్ని రంగాలు కుదేలవుతుండగా, ఎక్సైజ్ రంగం మాత్రం దూసుకెళ్తూ మద్యం ప్రియులకు మత్తెక్కిస్తూ, అబ్కారీ ఖజానా కాసుల గలగలలతో నిండిపోతోంది.