తెలంగాణ

రెండేళ్లలో ఏం చేశామంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: రెండేళ్ల పదవీ కాలంలో ఏమి చేశామన్న దానిపై రాష్ట్ర మంత్రులు ప్రోగ్రెస్ రిపోర్టులు తయారు చేసుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భవించి, కొత్త ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా వచ్చే నెలకు రెండేళ్లు అవుతుంది. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 18 మంది మంత్రులు మంత్రివర్గంలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా రాజయ్యను తప్పించి కడియం శ్రీహరిని మంత్రివర్గంలో చేర్చుకోవడం మినహా రెండేళ్ల కాలంలో ఇప్పటి మంత్రివర్గాన్ని మార్చలేదు. అయితే ముఖ్యమంత్రితో పాటు ఇటీవల ఐదుగురు మంత్రుల శాఖలు మాత్రం మార్చారు. ప్రతి శాఖలోనూ ప్రభుత్వం ప్రధానంగా ఒక పథకంపై దృష్టిసారించి ఉద్యమంగా చేస్తోంది.
వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరు మంత్రుల కన్నా ముందు రెండేళ్లలో తమ శాఖ సాధించిన పురోగతిపై నివేదిక రూపొందించారు. గత సంవత్సరం లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తమ శాఖ ఈసారి 43వేల కోట్ల రూపాయల వసూళ్ల లక్ష్యాన్ని సాధించడానికి కసరత్తులు చేశారు. 2015-16లో 23వేల 728 కోట్ల రూపాయలు, 2015-16లో 33వేల 965 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సాధించిన తలసాని ఇప్పుడు 43వేల కోట్ల రూపాయల వసూళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ నుంచి ఆయన్ని తప్పించారు. సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా రెండేళ్లలో పెద్దగా సాధించింది. ఏమీ లేదు. ఇప్పటి వరకు సినిమా అవార్డులకు పేరు కూడా ఖరారు చేయలేదు.
హరిత హారం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటి హరితాంధ్రగా మార్చాలని తొలివిడతలోనే పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఒక ఉద్యమంగా చేపట్టిన ఈ పథకం కరవు వల్ల విఫలమైంది. రాష్ట్రంలో మూడొంతుల భాగాన్ని అటవీ భూమిగా మార్చే విధంగా హరిత హారం చేపట్టారు. కోతులు తిరిగి అడవులకు వెళ్లాలి, వానలు వెనక్కి రావాలి అనే నినాదంతో ఈ పథకం చేపట్టారు. తొలి విడత 40 కోట్ల మొక్కలు నాటినప్పటికీ వర్షాలు పడక పోవడంతో చాలా వరకు మొక్కలు ఎదగలేదు. ఈసారి 43 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. హరిత హారం విజయవంతంగా నిర్వహించడమే అటవీ శాఖ ఈసారి ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకుంది. అటవీ శాఖ నిర్వహిస్తున్న జోగు రామన్న ఈసారి హరిత హారం విజయవంతం కావాలని ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఒకే రోజు 25లక్షల మొక్కలు నాటడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించి హరిత హారం విజయవంతం చేయాలని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ భావిస్తున్నారు.
నీటిపారుదల శాఖ మంత్రిగా తన్నీరు హరీశ్‌రావు పలు విజయాలను సొంతం చేసుకున్నారు. ఉప ఎన్నికల్లో అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చడమే కాకుండా తన శాఖ పనుల్లోనూ గణనీయమైన ప్రగతి సాధించారు. గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించే అంశంలో తొలుత మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సానుకూల వాతావరణం ఏర్పడేట్టు చేసింది హరీశ్‌రావే. తరువాత కర్నాటకతో ఆర్‌డిఎస్‌పై చర్చించారు. ఈనెల నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్‌తో సైతం చర్చలు జరుపనున్నారు. మిషన్ కాకతీయ దాదాపు 80 శాతం వరకు విజయవంతం అయింది. మిషన్ కాకతీయ పథకం మొదటి దశను ఒక ఉద్యమంగా చేపట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి చెరువుల్లో మట్టి ఎత్తి పోసి పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేట్టు చేశారు. మొదటి దశ అంత ఉత్సాహం రెండవ దశ అమలులో కనిపించడం లేదు. ఇక ప్రాజెక్టుల రీ డిజైనింగ్, శంకుస్థాపనలతో నీటిపారుదల శాఖ రాష్ట్రంలో ప్రధాన శాఖగా నిలిచింది. గూగుల్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఏర్పాటు, టి- హబ్, ఐటి కంపెనీలు రాష్ట్రానికి రావడానికి జరిపిన కృషి, హైదరాబాద్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కెటిఆర్ ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా పలు విజయాలు తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. హోంమంత్రిగా నాయిని నర్సింహ్మారెడ్డిపై ప్రభుత్వం పెద్దగా ఆశలు పెట్టుకున్నట్టు కనిపించడం లేదు. కేజీ టూ పీజీ ఉచిత విద్యా పథకం రూపకల్పనలో కడియం శ్రీహరి కీలక పాత్ర వహించినా విద్యా శాఖ మంత్రిగా ఇప్పటి వరకు ఆయన పెద్దగా విజయాలు నమోదు చేసుకోలేదు.
ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తన అసెంబ్లీ నియోజక వర్గానికే పరిమితం అవుతున్నారు. గుడంబాను నిర్మూలించేందుకు మద్యం ధరను తగ్గించి అమ్మాలనే ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా వెల్లడించడంలో విఫలం కావడంతో చివరకు ఆ ప్రయత్నానే్న విరమించుకోవలసి వచ్చింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నాయకత్వంలో గోదావరి పుష్కరాలను విజయవంతగా నిర్వహించారని ముఖ్యమంత్రి స్వయంగా ప్లీనరీలో తీర్మానం పెట్టించారు. అదే సమయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచలేదు.
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేరుకు రెవెన్యూ శాఖ మంత్రి అయినా మైనారిటీ వ్యవహారాలకే పరిమితం అవుతున్నారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎకో టూరిజం ద్వారా రాష్ట్రంలో టూరిజంకు పెద్ద పీట వేసేందుకు టూరిజం శాఖ మంత్రి చందూలాల్ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన తొలి విజయం రాజధాని నగరంలో కోతలు లేని విద్యుత్ సరఫరా. అయితే జగదీశ్‌రెడ్డి విద్యుత్ శాఖను చేపట్టడానికి ముందే విద్యుత్ రంగంలో విజయం సాధించారు. అదే విధంగా ఇప్పుడు వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు విద్యుత్ ఇస్తున్నారు. గతంలో ఎరువులు, విత్తనాలకు భారీ క్యూలు, లాఠీచార్జీలు కనిపించేవని, ఇప్పుడు అలాంటివేమీ లేకుండా అవసరం అయిన చర్యలు తీసుకోవడంలో వ్యవసాయ శాఖ విజయం సాధించిందని ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెబుతున్నారు. శాఖలు మారడంతో జూపల్లి కృష్ణారావు కొత్త శాఖతో కుస్తీ పడుతున్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభంలో చూపినంత దూకుడు చూపడం లేదు. మహేందర్‌రెడ్డి జిల్లా రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టిసారించారు.

‘కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తెంత?’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 3: కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని మీటర్ల ఎత్తులో నిర్మించాలనుకుంటున్నారో ప్రజలకు తెలియజేయాలని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుమ్మడిహట్టి వద్ద 155 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మిస్తేనే తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఆ విధంగా చేయకుండా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం నిర్మిస్తే తెలంగాణకు ప్రయోజనం ఉండదని ఆయన తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారని జీవన్‌రెడ్డి టిఆర్‌ఎస్ నాయకులను తూర్పారబట్టారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే తెలంగాణకు దరిద్రం పట్టుకున్నదని ఆయన విమర్శించారు.

ఎన్ని అడ్డంకులెదురైనా
ప్రాజెక్టులు ఆగవు
చంద్రబాబు, జగన్‌పై
తెరాస ప్రజాప్రతినిధుల ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 3: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులను అసలు పట్టించుకోలేదు, కనీసం రాష్ట్రం ఏర్పడిన తర్వాతైన ప్రాజెక్టులను నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆంధ్ర నాయకులు అభ్యంతర పెడుతుండటంతో వారి అసలు నైజం, కుట్ర బుద్ధి బయటపడిందని టిఆర్‌ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకపడింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గంలో తీర్మానం చేయడం, అక్కడి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ దీక్ష చేయడాన్ని టిఆర్‌ఎస్ పార్టీ తప్పు పట్టింది. తెలంగాణ భవన్‌లో మంగళవారం పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన పార్టీలో తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తుంటే, ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఆ పార్టీల్లో తెలంగాణ నేతలు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ఆంధ్ర నేతలు విసిరే కుక్క బిస్కెట్లకు ఆశపడి తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ఆత్మవంచన చేసుకొని ఆంధ్ర పార్టీల్లో ఎలా కొనసాగుతారని వారు ప్రశ్నించారు. వెయ్యి మంది చంద్రబాబులు అడ్డుపడినా పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులను కట్టితీరుతామని వారు హెచ్చరించారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న నేతలే ప్రస్తుతం ఇక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారని వారన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర పార్టీలు, నేతలు ఏ విధంగా ఏకం అవుతున్నారో గమనించి, ఆ పార్టీలను, వాటిలో ఉన్న నేతలను ప్రజలు తరిమికొట్టే పరిస్దితి రాకముందే కళ్లు తెరవాలని బాల్క సుమన్, ప్రశాంత్‌రెడ్డి, భానుప్రసాద్ హెచ్చరించారు.

నేటి నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, మే 3: రాష్ట్రంలోని పది జిల్లాల అభ్యర్ధులకు బుధవారం నుంచి ఈ నెల 14 వరకు వరంగల్ జిల్లా హన్మకొండ జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు సికింద్రాబాద్ డైరెక్టర్, కల్నల్ అనిల్‌కుమార్ రోహెల, ఆర్మీ రిక్రూట్‌మెంట్, చెన్నై జోన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఎస్‌ఎన్ దాల్వి తెలిపారు. మంగళవారం వీరు జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్, అసిస్టెంట్ సోల్జర్, జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మెన్‌లో ప్రవేశానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీకి వచ్చే అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డును, దరఖాస్తును తీసుకురావాలని, దళారులను నమ్మవద్దని సూచించారు. ఎండతీవ్రత దృష్ట్యా రిక్రూట్‌మెంట్ ర్యాలీ, పరీక్షలను ఉదయం 4 గంటలకే ప్రారంభిస్తున్నామన్నారు.

రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వచ్చిన అభ్యర్థులు పక్కనే ఉన్న యూత్ హాస్టల్‌లో వేచి ఉండాలన్నారు. అభ్యర్థులకు వైద్య పరీక్ష మే 4 నుంచి 16వరకు ర్యాలీ జరుగు ప్రదేశం వద్ద నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు సోల్జర్ క్లర్క్, సోల్జర్ స్టోర్ కీపర్, టెక్నికల్ నర్సింగ్, సోల్జర్ టెక్నికల్ కేటగిరి పోస్టులకు అర్హులు కారు. సోల్జర్ ట్రేడ్స్‌మెన్, సోల్జర్ జనరల్ డ్యూటీ కేటగిరిలకు అభ్యర్థులు అర్హులని తెలిపారు. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు వారి తల్లిదండ్రుల అనుమతి సర్ట్ఫికేట్ తీసుకొని రావాలన్నారు. అభ్యర్థులందరికీ శారీరక ఫిట్‌నెస్ పరీక్షలు తప్పనిసరి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 1.6కి.మీల పరుగును కనీసం 6.20నిముషాల్లో పరిగెత్తాలని, ఈ నిబంధన సోల్జర్ జనరల్ డ్యూటీ కేటగిరికి వర్తించదన్నారు. ఆరు నిముషాల్లో 1.6కి.మీల పరుగు సోల్జర్ జనరల్ డ్యూటీ కేటగిరి అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది. 9అడుగుల కందకం దూకుట, పుల్ ఆప్స్ కనీసం ఆరు నిముషాలు, బ్యాలెన్సింగ్ బీమ్ పరీక్షలు ఉంటాయన్నారు. శారీరక ఫిట్‌నెస్ టెస్టు, శారీరక కొలతల టెస్టు పూరె్తైన తర్వాత విజయవంతమైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వైద్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్‌మెంట్ సికింద్రాబాద్ కార్యాలయం నందు నిర్వహించే సాధారణ ప్రవేశ పరీక్షకు హాజరుకావాలని తెలిపారు. ర్యాలీ రోజు అభ్యర్థులు ఒరిజినల్ దృవపత్రాలు క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకొని ఒక ఫైల్ కలిగిన సెట్‌తో పాటు ఫొటో స్టార్ట్ గెజిటెడ్ అధికారి దృవీకరణ చేసి ఉన్న దానిని తమ వెంట తెచ్చుకోవాలన్నారు. పదవ తరగతి మార్కుల జాబితా, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, డిగ్రీ మార్కుల జాబితాతో పాటు జనన, కుల దృవీకరణ పత్రాలు తాజాగా తెలంగాణ రాష్ట్ర జిల్లా యంత్రాంగం మీసేవ ద్వారా ఇంగ్లీష్‌లో జారీ చేసిన పత్రాలు ఉండాలన్నారు. ఇంగ్లీష్‌లో గత విద్యా సంస్థ నుంచి స్టడీ, ప్రవర్తన సర్ట్ఫికేట్, బదిలీ సర్ట్ఫికేట్, ఎన్‌సిసి, క్రీడలు, ఐటి ఐ, కంప్యూటర్ సర్ట్ఫికేట్, జిల్లా స్థాయి సర్ట్ఫికేట్లు తీసుకురావాలన్నారు. రిక్రూట్‌మెంట్ ఒక ఉచిత సేవ అని, అభ్యర్థులు మధ్య వర్తులను, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ నోడల్ అధికారి రాము తదితరులు పాల్గొన్నారు.