తెలంగాణ

లక్కు చిక్కని లకుడారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 25: సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న తమ గ్రామాలకు మహర్దశ పడుతుందని భావించిన దత్తత గ్రామాల ప్రజల ఆశలు అడియాసలే అవుతున్నాయి. మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని లకుడారం గ్రామాన్ని దత్తత తీసుకోగా జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు బిబి పాటిల్ ఝరాసంగం మండలం ఈదులపల్లి గ్రామాన్ని దత్తత స్వీకరించారు. ఎంపి ప్రభాకరరెడ్డి దత్తత తీసుకున్న లకుడారం గ్రామం హైదరాబాద్‌కు అత్యంత చేరువలో ఉంది. ఇక్కడ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నీటి ఎద్దడితో గ్రామస్థులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. లకుడారంలో 1054 కుటుంబాలు ఉండగా 3973 మంది నివసిస్తున్నారు. గ్రామంలో మొత్తం 15 చేతి పంపులు ఉండగా అవన్నీ ఎండిపోయాయి. సుమారు నాలుగు వేల మంది జనాభాకు రోజుకు 1.50 లక్షల లీటర్ల నీటిని అందించినా సరిపోని పరిస్థితి. నీటి సరఫరా చేసే బోర్లు ఎండిపోవడంతో వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజు 15 ట్రిప్పులు తీసుకువచ్చి సంప్‌హౌస్‌లోకి చేర్చి మోటార్ల ద్వారా ట్యాంకులకు ఎక్కించి నీటి సరఫరా చేస్తున్నారు. పెద్ద గ్రామం కావడంతో ఒక్కో బస్తీకి 40 రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రసాయన పరిశ్రమల వల్ల భూగర్భ జలాలు సైతం కలుషితం కావడంతో తాగడానికి అటుంచితే వాడుకోవడానికి కూడా పనికి రావడం లేదు. సంప్‌హౌస్ వద్ద పనిచేసేవారిని బతిమాలి రోజుకు రెండు మూడు బిందెలు తీసుకువెళ్లి మంచినీటి అవసరాలు తీర్చుకుంటున్నామని గ్రామానికి చెందిన మిఠమ్మ అనే మహిళ వాపోయింది. గ్రామంలో ఏ వేళ చూసినా జనం ఖాళీ బిందెలు, వాటర్ బాటిళ్లు పట్టుకుని తిరగడమే కనిపిస్తుంది. సుమారు 40 లక్షల రూపాయలు వెచ్చించి గ్రామ శివారులో నిర్మించిన సంప్‌హౌస్ నిరుపయోగంగా మారింది. దీనిని మిషన్ భగీరథ కోసం నిర్మించినట్లు చెప్పుకుంటున్నారు. గ్రామంలో మురికి కాలువలన్నీ చెత్తాచెదారంతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. గ్రామ పొలిమెరల్లోని గుట్టల్లో స్టోన్ క్రషర్లు ఎక్కువగా ఉండటం, రాత్రి సమయాల్లో మందుపాతరలతో బండరాళ్లను పేల్చివేస్తుండటంతో ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని, క్రషర్లు వెదజల్లే దుమ్ముధూళితో అనారోగ్యం పాలబడుతున్నామని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపి ప్రభాకర్‌రెడ్డి దత్తత తీసుకుని 15 మాసాలు పూర్తికాగా కేవలం మూడు సార్లు మాత్రమే గ్రామాన్ని సందర్శించారు. ఇంకుడు గుంతలను కట్టించే నాథుడు లేకపోగా గీతం విశ్వవిద్యాలయం పుణ్యమాని గ్రామంలో సుమారు 80 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది.

పాటిల్ సారూ.. ఎప్పుడొస్తారు?
పేరుకే దత్తత తీసుకున్న ఎంపి
ఒక్కసారీ గ్రామానికి రాని వైనం
సంగారెడ్డి, ఏప్రిల్ 25: ఈదులపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి వెళ్లిన ఎంపి పాటిల్ ఇప్పటివరకు గ్రామానికి వస్తే ఒట్టు. దత్తత పేరిట తమను దగా చేస్తున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఉన్న బోర్లన్ని ఎండిపోవడంతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఓ కిరాణా దుకాణం యజమాని తన సొంత ప్లాటు వద్ద వేయించిన బోరు నుంచి తన ఇంటి వద్ద నల్లాలను ఏర్పాటు చేసి నీటిని సమకూర్చుతున్నాడు. గ్రామ సర్పంచ్ రాచమ్మ కూడా తన ఇంటి వద్ద బోరు తవ్వించి నీటి ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. ఎంపి పాటిల్ తమ గ్రామానికి ఎందుకు వచ్చారో, ఎవరు దత్తత తీసుకోమన్నారో తెలియదని, ఆయనపై పెట్టుకున్న ఆశలు నిరాశకు గురి చేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.