తెలంగాణ

నిప్పుల కొలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఏప్రిల్ 3: కరీంనగర్ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. గత వేసవి కాలం కన్నా మరింత తీవ్రంగా ఎండలు మండుతున్నాయి. దీంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులు, విద్యార్ధులు ఎండలకు తల్లడిల్లుతున్నారు. ఎండ తీవ్రత విపరీతంగా ఉండడంతో ప్రజలు రోడ్డుపై రావడానికి జంకుతున్నారు. ఆదివారం రామగుండంలో 41.08 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదైనట్లు స్ధానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వేసవి కాలంలో ఎండలు ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపడంతో స్ధానిక ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు. సింగరేణి బొగ్గుగనులు, 2600మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగే రామగుండం ఎన్టీపీసీతో పాటు 62మెగావాట్ల టి-జెన్‌కో, ఎఫ్‌సిఐ, కేశోరాం సిమెంట్ వంటి భారీ పరిశ్రమలు ఉండడంతో వేడి ఉంటుంది. ఎండలు మండి పోవడంతో ఇంకా రామగుండంలో మరింత ఎండ తీవ్రమైంది. సింగరేణి బొగ్గుగని కార్మికులు ఓసీపీ గనుల్లో బొగ్గు ఉత్పత్తులను మండుటెండల్లోనే జరుపుతున్నారు. బొగ్గుగనుల నుండి వెళ్ళే వేడితోపాటు ఎండ తీవ్రతకు తట్టుకోలేక పోతున్నారు. అదేవిధంగా రోజు వారిగా మధ్యాహ్నం డ్యూటీలకు వెళ్ళి రావడానికి జంకుతున్నారు. సి ఎస్ ఫితో పాటు బొగ్గు రవాణా జరిగే పలు ఏ రియాల్లో పని చేసే కార్మికులు ఎండ తాకిడికి తట్టుకోలేక పోతున్నారు. అదేవిధంగా ఎన్టీపీసీ ఫ్లాంట్‌తో పాటు వివిధ ఏరియాల్లో పనిచేసే కార్మికులు మధ్యాహ్నా సమయంలో పనికి విరామం కల్పించాలని కోరుతున్నారు. 10వ తరగతి పరీక్షలు ఉదయం పూట నిర్వహించడంతో మధ్యాహ్నం 1గంట ల నుండి పాఠశాలలు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు మండుటెండల్లో పాఠశాలలకు హాజరవుతున్నారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో సరైన ఫ్యాన్లు, వెంటిలేషన్ లేకపోవడంతో ఎండ వేడికి తట్టుకోలేక పోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఉదయం 9గంటల నుండి ఎండ తీవ్రత పెరగడంతో జనం రోడ్లపైకి రాలేకపోతున్నారు. ఎండ తీవ్రత తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. చల్లదనం ఇచ్చే దోసకాయలు, మజ్జిగ, తాటి ముంజలు, కొబ్బరి బొండాలపై విరివిగా కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఎండ తీవ్రతతో పాటు తాగునీటి కొరత కూడా తీవ్రంగా ఉండడంతో ప్రజలు ఎండలు, నీటి కోసం తల్లడిల్లిపోతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో
మావోల కాల్పులు
బిజెపి నేతకు తీవ్రగాయాలు
చింతూరు, ఏప్రిల్ 3: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బిజెవైఎం జిల్లా యూత్ అధ్యక్షుడు మురళీకృష్ణనాయుడుపై మావోయిస్టులు శనివారం రాత్రి కాల్పులు జరిపి తీవ్రంగా గాయపర్చారు. బీజాపూర్ ఎస్పీ కెఎల్ ధ్రు తెలిపిన వివరాల ప్రకారం.. మురళీకృష్ణనాయుడు శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో బైరంగర్ పట్టణంలోని దేవాలయానికి వెళ్లగా ముందుగానే అక్కడకు చేరుకున్న నలుగురు మావోయిస్టులు ఒక్కసారిగా అతనిపై కాల్పులు జరిపి గాయపర్చారు. అనంతరం ఆయుధాలతో మావోయిస్టులు దాడిచేసేందుకు అతని వద్దకు వెళుతుండగా ప్రజలు ప్రతిఘటించడంతో మావోలు వెళ్లిపోయినట్లు ఎస్పీ తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ మురళీకృష్ణనాయుడిని హెలికాఫ్టర్ ద్వారా జగదల్‌పూర్ తరలించి, అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం రాయపూర్ తరలించినట్టు ఎస్పీ కెఎల్ ధ్రు తెలిపారు. మురళీకృష్ణనాయుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి మహేష్ గడ్డాకు ఆప్తుడు. మహేష్ గడ్డా బీజాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందడం తో ఆ నియోజకవర్గ వ్యవహారాలను మురళీకృష్ణనాయుడు చూసుకుంటున్నారని మంత్రి మహేష్ గడ్డా తెలిపారు.
ప్రైజ్‌మనీ, భారీ వడ్డీ
మోసగాళ్లను నమ్మకండి : సిఐడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 3: ప్రైజ్ మనీ, పెట్టుబడులపై భారీ వడ్డీ ఇస్తామంటూ మోసగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని క్రైం ఇనె్వస్టిగేషన్ డిపార్టుమెంట్ (సిఐడి) హెచ్చరించింది. అధిక వడ్డీ ఆశతో మోసగాళ్లు నిర్వహించే సంస్థలో పెట్టుబడులు పెట్టవద్దని సిఐడి ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో హెచ్చరించింది. ఈజీ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసగిస్తున్నారని, ఎస్‌ఎంఎస్ పంపుతూ మీ పెట్టుబడులకు నెల రోజు ల్లో డబుల్ వస్తుందని ఆశ చూపుతారని, అలాంటి ప్రకటనలకు మోసపోకుండా ఉండాలని సిఐడి సూచించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ డేటా ఇవ్వాలంటూ మోసగాళ్లు ఒత్తిడి తెస్తారని, తొందరపడి ఎవరికీ ఫోన్ నెంబర్లు గానీ, బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఎలాంటి వివరాలు ఇవ్వకూడదని సిఐడి ఆ ప్రకటనలో పేర్కొంది.
ఉద్యమకారులపై
రైల్వే కేసులు ఎత్తివేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 3:ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై నమోదైన రైల్వే కేసులను వెంటనే ఎత్తివేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు ఆయన ఓ వినతి పత్రం అందజేశారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జెఎసి పిలుపుమేరకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, వృత్తిదారులు ప్రధాన పాత్ర పోషించారని, మిలీనియం మార్చ్, సాగరహారం లాంటి కార్యక్రమాల్లో టిఆర్‌ఎస్, సిపిఐ, బిజెపి, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ప్రత్యక్షంగా పాల్గొన్నాయని ఆయన పేర్కొన్నారు. రైల్‌రోకో పిలుపులో భాగంగా వందలాది మందిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారని, అధికారంలోవున్న మంత్రు లు, ఎమ్మెల్యేలు, నాయకులపై కేసులుండటం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై ఉన్న కేసులను ఎత్తివేసేలా కేంద్రంతో చర్చించాలని ఆయన మంత్రి దత్తాత్రేయకు విజ్ఞప్తి చేశారు.
జలదృశ్యంలో
పాలమూరు ఊసేదీ?
సిపిఎం పాదయాత్రలో తమ్మినేని
బల్మూరు, ఏప్రిల్ 3: అసెంబ్లీలో మూడు గంటల పాటు జలదృశ్యం సినిమా చూపించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కరవు, దత్తత జిల్లా పాలమూరు అభివృద్ధికి సంబంధించిన ఊసే తీసుకురాలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఆదివారం మూడో రోజు పాదయాత్ర సందర్భంగా బల్మూరులో ఆయన మాట్లాడుతూ కరవు జిల్లా పాలమూరులో గతంలో సిఎం చంద్రబాబు, సిఎం వైఎస్‌ఆర్ దత్తత తీసుకొని అభివృద్ధిని మరిచారని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించకుండా వివక్ష చూపారని అన్నారు. 14సంవత్సరాలుగా కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులకు నిధు లు కేటాయించడం, పనులకు ఖర్చుచేయలేకపోవడం జరుగుతుందని, గతంలో పాలకులవలే కేసిఆర్ కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నారని అన్నారు.
సిఐడి ఇన్‌స్పెక్టర్‌పై
నిర్భయ కేసు
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఏప్రిల్ 3: బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారే తప్పటడుగులేశాడు. ఓ మహిళా ఉద్యోగికి అసభ్యకర మెస్సేజ్‌లను పంపుతూ వేదించసాగాడు. చివరకు నిర్భయ కింద కేసు నమోదు కాబడి, మహిళా సంఘాల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఆయనే హైదరాబాద్‌లోని సిఐడి విభాగంలో పనిచేస్తున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.దయాకర్‌రెడ్డి. శ ఆయనపై నిర్భయ కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసులో విచారణాధికారిగా ఉన్న కె.దయాకర్‌రెడ్డి విచారణలో భాగంగా ఎఎస్‌ఐ బంధువు శ్రీనగర్‌కాలనీకి చెందిన ఓ మహిళా ఉద్యోగిని పలుమార్లు విచారించడంతో ఆమెతో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమె సెల్‌ఫోన్ నెంబరు తీసుకున్న దయాకర్‌రెడ్డి నాలుగైదు మాసాలుగా వాట్సాప్ ద్వారా ఆమెకు అసభ్యకర మెస్సెజ్, బూతు బొమ్మలను పంపుతూ వేదింపులకు గురిచేస్తున్నాడు. దీనిని బాధిత మహిళ ప్రశ్నిస్తే చంపుతానని బెదిరిస్తుండంతో పోలీసులను ఆశ్రయించింది. తనను అసభ్యకర మెస్సేజ్‌ల ద్వారా వేధిస్తున్నారని రెండో ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆయనపై శనివారం రాత్రి కరీంనగర్ రెండో ఠాణాలో నిర్భయ కింద కేసు నమోదు చేశారు.

13 మంది రెబెల్ అభ్యర్థుల బహిష్కరణ
రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి

సిద్దిపేట, ఏప్రిల్ 3 : మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచిన టిఆర్‌ఎస్ రెబెల్ అభ్యర్థులను పార్టీ నుండి బహిష్కరించినట్లు టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ వెల్లడించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రెబెల్ అభ్యర్థులు ఉపసంహరించుకోవాలని గడువు ఇచ్చినా ఖాతరు చేయకపోవటం వల్ల క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పటం లేదన్నారు. బరిలో ఉన్న 13 మంది రెబెల్ అభ్యర్థులు చెందిరెడ్డి రూప రాజశేఖర్‌రెడ్డి, గుడాల సంధ్య శ్రీకాంత్ గౌడ్, గోపులార దీప్తినాగరాజు, గౌటి చంద్రకళ మల్లేశం, గ్యాదరి పద్మ యాదగిరి, తాళ్ల లింగం, గంగాపురం కృష్ణ, గరిపల్లి మహిపాల్, బాబా షర్పోద్దీన్, కెమ్మసారం ప్రవీణ్‌కుమార్, గడ్డం విజయరాణి శ్రీనివాస్, నర్ర శంకరవ్వ రవీందర్, బోనాల మంజులనర్సింలును ఆరెండ్ల పాటు పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
14మంది అభ్యర్థుల ఉపసంహరణ
మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా వివిధ పార్టీలు, స్వతంత్రులు 14 మంది ఉప సంహరించుకున్నట్లు దేవేందర్‌రెడ్డి, సత్యనారాయణలు వెల్లడించారు. టిడిపి 10, కాంగ్రెస్ 13, బిజెపి 14, ఎంఐఎం 5, సిపిఎం రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుందన్నారు.

సాగర్ కుడికాల్వకు నీటి విడుదల నిలిపివేత

నాగార్జునసాగర్, ఏప్రిల్ 3: నాగార్జునసాగర్ జలాశయం నుండి కుడికాల్వ ద్వారా ఆంధ్రా రాష్ట్రానికి విడుదల చేస్తున్న తాగునీటిని ఆదివారం ఉదయం డ్యాం అధికారులు నిలిపివేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం మేరకు గత నెల 23నుండి కుడికాల్వ ద్వారా ఆంధ్రా రాష్ట్రానికి తాగునీటిని డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. ఆదివారం నాటితో ఆంధ్రా రాష్ట్రానికి కేటాయించిన 4టిఎంసిల నీటి పరిమాణం పూర్తి అవడంతో ఆదివారం ఉదయం నుండి కుడికాల్వకు విడుదల చేస్తున్న నీటిని నిలిపివేశారు. కాగా, గత 2రోజుల నుండి ఎడమకాల్వకు తాగునీటి అవసరాల నిమిత్తం డ్యాం అధికారులు నీటివిడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయానికి ఎగువ నుండి 7,248 క్యూసెక్కుల నీరు వస్తుండగా సాగర్ జలాశయం నుండి ఆదివారం తెల్లవారుఝాము వరకే కుడికాల్వకు 2,889 క్యూసెక్కులను, ఎడమకాల్వకు 5,086 క్యూసెక్కులను, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1200 క్యూసెక్కులను మొత్తం 9,175 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.