తెలంగాణ

‘మిషన్ భగీరథ’పై అనుమానాలున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:మిషన్ భగీరథ కాంట్రాక్టుల్లో తమకు అనుమానాలు ఉన్నాయని బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. శాసన సభలో మంగళవారం పద్దులపై జరిగిన చర్చల్లో మిషన్ భగీరథ కాంట్రాక్టులపై మంత్రి కె తారక రామారావు, చింతల రామచంద్రారెడ్డిల మధ్య వాగ్వివాదం జరిగింది. పొట్టకూటికోసం వచ్చిన వారితో కాదు పొట్టకొట్టే వారితోనే మా పోరాటం అని తెలంగాణ ఉద్యమ కాలంలో చెప్పారని కానీ మిషన్ భగీరథ పనులన్నీ ఎవరికిచ్చారని ఆయన ప్రశ్నించారు. 60వేల కోట్ల రూపాయల పనుల్లో ఒకే సంస్థకు 12వేల కోట్ల పనులు ఇచ్చారని, ఈ కాంట్రాక్టుల్లో తమకు అనుమానం ఉందని అన్నారు. ఒరిస్సాలో ఇలాంటి పనులకే ఎల్ అండ్ టి, మెగా వంటి సంస్థలు 40 శాతం తక్కువకు కోట్ చేసి పనులు చేపట్టారని తెలిపారు. మిషన్ భగీరథ పనుల కాంట్రాక్టులు నాగార్జున, ఎల్ అండ్ టి, నవయుగ వంటి వారికి ఇచ్చారని, తెలంగాణ వారు పనులు చేసేందుకు లేరా? అని ప్రశ్నించారు. సిడిఆర్‌ను ఏర్పాటు చేసి అత్యవసర పనులు అన్నట్టుగా మెగా వాళ్లకే పనె్నండువేల 879 కోట్ల రూపాయల పనులు కట్టబెట్టారని విమర్శించారు. దీనిపై ఐటి మంత్రి కె తారక రామారావు స్పందిస్తూ మొదటి సారి ఎన్నికైన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. 60వేల కోట్లు అని ఏదో లెక్క చెబుతున్నారని, ప్రభుత్వం మాత్రం 36,900 కోట్ల రూపాయల పనులకు సంబంధించి టెండర్లు పిలిచినట్టు చెప్పారు. అత్యవసరంగా పనులు చేపట్టేందుకు సిడిఆర్ విధానం కొత్తదేమీ కాదని అన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ పథకం చేపట్టారని, ఈ పథకం బాగుంటుందని మోదీ స్వయంగా లేఖ రాశారని చెప్పారు. గుజరాత్‌లో వాటర్ గ్రిడ్ కోసం రూపొందించిన విధి విధానాల్లో సిడిఆర్ విధానం ఉందని చెప్పారు. పప్పు పుట్నాలు పంచినట్టు పంచడానికి వీలు ఉండదని, గ్లోబల్ టెండర్లు పిలిచి కంపెనీలను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఆన్‌లైన్‌లో అంతా పారదర్శకంగా టెండర్ విధానం ఉంటుందని చెప్పారు. మిషన్ భగీరథ పనుల నాణ్యతను థర్డ్ పార్టీగా ఎప్పటికప్పుడు పరిశీలించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యాప్కోకు అప్పగించినట్టు చెప్పారు. మైకు దొరికిందని ఎటు పడితే అటు మాట్లాడ వద్దని తెలుసుకుని మాట్లాడాలని అన్నారు.
గ్రేటర్‌పై దృష్టి పెట్టండి
హుసేన్ సాగర్ ప్రక్షాళన చేయాలని, గ్రేటర్‌పై దృష్టిసారించాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరారు. మాస్టర్ ప్లాన్‌ను పదేళ్ల కోసారి మార్చుకోవాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగంగుల కమలాకర్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని వాహనాలు అన్నీ కాలం చెల్లినవని, 15 ఏళ్లు దాటిన వాహనాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వీటిని మార్చాలని, కొత్తగా కొనుగోలు చేయడం లేదా? అద్దె ప్రాతిపదికన అయినా కొత్తవి సమకూర్చుకోవాలని ఎంఐఎం కోరింది. మూసీ ప్రక్షాళన, హుసేన్ సాగర్ ప్రక్షాళన ద్వారా నగరం అందం పెరుగుతుందని సూచించారు.
మూడు గంటల విద్యుత్‌కు నిధులెక్కడివి?
ప్రస్తుతం వ్యవసాయానికి ఆరుగంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారని, దీన్ని తొమ్మిది గంటలకు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించినందున అదనపు నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటారని బిజెపి ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. అదనంగా మరో మూడు గంటల పాటు విద్యుత్ ఇస్తే మరో మూడు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, బడ్జెట్‌లో దీనికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు చూపలేదని తెలిపారు.