తెలంగాణ

కృష్ణానదిలో నీటి యుద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 23: గత నాలుగు నెలల నుండి కృష్ణానది ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడంతో ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో నది రాళ్లతో దర్శనమిస్తోంది. ఇటు తెలంగాణ రైతులు, అటు కర్ణాటకకు చెందిన రైతులు నదితీర ప్రాంతాలలో వరి పంటలను సాగు చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు నదిలో నీటి ప్రవాహం లేకపోవడం రైతాంగాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో నదిలో కేవలం గుంతలు, మడుగుల్లో ఉన్న నీటిని, అక్కడక్కడ నదిలో నిలిచివున్న నీటిని వాడుకునేందుకు ఇటు తెలంగాణ, అటు కర్నాటక వైపు రైతులు తాపత్రయపడుతున్నారు. అయతే, కర్ణాటకకు చెందిన రైతులు మాత్రం ఒకడుగు ముందుకేసి ఏకంగా నదిలోని గుంతల్లో ఉన్న తమ సరిహద్దు నీటితో పాటు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మడుగుల్లోని నీటిని సైతం తరలించుకుపోయేందుకు కుట్రలకు తెరలేపారు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడి అధికారుల సహకారంతో నదిలోనే కాల్వలను తవ్వి తమ పంటపొలాలకు నీటిని తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు తెలంగాణ రైతాంగం అడ్డుకున్నారు. గత మూడు నాలుగు రోజుల నుండి ఇరు ప్రాంతాల రైతుల మధ్య నీటి కోసం వార్ కొనసాగుతోంది. మంగళవారం సైతం కొందరు కర్ణాటకకు చెందిన రైతులు తరలివచ్చి తెలంగాణ వైపు నదిలోని గుంతలు, మడుగుల్లో ఉన్న నీటిని తరలించుకుపోయేందుకు కాల్వలు తీసేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్రం పరిధిలోని మాగనూర్ మండలం గుడేబలూర్ ఎత్తిపోతలకు చెందిన పలువురు రైతులు కృష్ణానది దగ్గరకు చేరుకుని కర్ణాటక రైతులతో వాగ్వాదానికి దిగారు. అప్పటికే అక్కడికి చేరుకున్న కృష్ణా పోలీసులు దేవసూగూర్ చెక్‌పోస్టు దగ్గర ఉన్న కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో కర్ణాటక పోలీసులు సైతం అక్కడికి వచ్చి ఆ పాంత్ర రైతులను అక్కడి నుండి తీసుకెళ్లారు. కాగా, తెలంగాణ రైతులు మాత్రం తమ సరిహద్దు నదిలోని నీటిని ఎలా తరలించుకుపోతారని ప్రశ్నించారు. నది ఎండిపోయి తామంతా ఇబ్బందుల్లో ఉంటే నదిలోని మడుగునీటిని సైతం కర్ణాటక రైతులు వదలకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులను గమనించిన తెలంగాణకు చెందిన మాగనూరు మండలం కృష్ణా పోలీస్‌స్టేషన్ ఎస్సై రియాజ్ అహ్మద్, హెడ్‌కానిస్టేబుల్ రామచందర్‌రెడ్డితో పాటు మరికొందరు పోలీసులు కృష్ణా బిడ్జ్రి దగ్గర నదిలోనే పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నారు. కర్ణాటక రైతులు ఇటు వైపు రాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. కాగా, కృష్ణానది తీరాన మాగనూరు, మక్తల్, ఆత్మకూర్, నర్వ మండలాలకు చెందిన వేలాది ఎకరాలలో రైతులు వరి పంటలు సాగు చేశారు. కానీ ప్రస్తుతం పంటలు పొట్ట దశలో ఉండడం నది ఎండిపోవడం రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నదిలోని మడుగు నీటితోనైనా పంటలు పండించుకుందామంటే కర్ణాటకకు చెందిన రైతులు చేస్తున్న జలదోపిడీపై ఇక్కడి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రాంత సరిహద్దు నదిలో మడుగులో నిల్వ ఉన్న నీరు... కర్ణాటక, తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది బ్రిడ్జి దగ్గర నదిలో పికెట్ నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులు

గోల్ఫ్ టోర్నమెంట్ ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 23: గోల్ఫ్ టోర్నమెంట్ వల్ల హైదరాబాద్ నగర ఖ్యాతి మరింతగా పెరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. నగరంలోని సెవెన్ టోంబ్స్ వద్ద ఉన్న గోల్ఫ్ క్లబ్‌లో రెండవ గోల్కొండ మాస్టర్స్ ప్రొఫెషనల్స్ గోల్ఫ్ టోర్నమెంట్‌ను మంగళవారం ప్రారంభించారు. గోల్ఫ్‌కు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి ఎ చందూలాల్ మాట్లాడుతూ గోల్ఫ్ టోర్నమెంట్ తెలంగాణకు మంచి పేరు తీసుకు వస్తుందని అన్నారు. ఈ టోర్నమెంట్ ఈనెల 24 నుండి 28 వరకు హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో జరుగుతాయి. వివిధ స్థాయిల్లో విజేతలకు 40లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. టోర్నమెంట్‌లో భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన 120 మంది ప్రొఫెషనల్ గోల్ఫర్స్ పాల్గొంటున్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ యండి బాబా ఫసియుద్దీన్, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నుంచి
సారయ్య సస్పెన్షన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 23: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. బస్వరాజు సారయ్య తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడంతో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం ఆయన్ను పార్టీనుంచి సస్పెండ్ చేశారు. బస్వరాజు సారయ్య పార్టీ వీడకుండా చివరి నిమిషం వరకూ పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తనకు రాజకీయంగా గుర్తింపునిచ్చిన కాంగ్రెస్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ విమర్శించనని సారయ్య అన్నట్లు తెలిసింది.
మరి మీరేం చేశారు?
చంద్రబాబుపై మంత్రి తలసాని ఫైర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి గురించి ఎక్కువగా మాట్లాడుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో తలసాని మాట్లాడారు. పార్టీలు మారడం గురించి చంద్రబాబు రోజూ నీతులు మాట్లాడతారని, మరిప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై సమాధానం చెప్పాలని అన్నారు. టిడిపికి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా? అని తలసాని ప్రశ్నించారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను కొనుక్కున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు చేసేది నీతి, ఇంకొకరు చేసేది అవినీతా? అని ప్రశ్నించారు. బాబు చేసేవన్నీ నీచ రాజకీయాలేనని మండిపడ్డారు. విలువలు ఏ మాత్రం లేని చంద్రబాబు విలువల గురించి ఎక్కువగా మాట్లాడతారని అన్నారు. తాను పార్టీ మారడంపై ప్రేలాపనలు చేసిన చంద్రబాబు ఇప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై సమాధానం చెప్పాలని అన్నారు. తాము టిఆర్‌ఎస్‌లో చేరినప్పుడు చంద్రబాబు వాడిన భాష తనకు బాధ కలిగించిందని అన్నారు. టిడిపిలో చేరిన వారితో బాబు రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళతారా? అని ప్రశ్నించారు. నోరుంది కదా? అని ఇష్టం వచ్చినట్టు మాట్లడవద్దని హితవు పలికారు. చంద్రబాబు మాటలు సత్యహరిశ్చంద్రునిలా ఉంటాయని, అయితే జీవితంలో ఒక్కసారి కూడా నిజం చెప్పే అలవాటు బాబుకు లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాబు చుక్కలు చూపిస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయడం లేదని, రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అమరావతిని సింగపూర్ చేసేస్తానని బాబు చెబుతున్న మాటలు ఆచరణ సాధ్యం కానివని ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు.
అక్రమాలు బయటపడతాయనే
వెబ్‌సైట్‌ను రద్దు చేశారు
టి.కాంగ్రెస్ విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 23: రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్న అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే ప్రభుత్వ జివోలకు సంబంధించిన వెబ్ సైట్‌ను రద్దు చేసిందని టి.పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. ప్రభుత్వ వెబ్ సైట్‌ను ఎందుకు రద్దు చేశారో తెలియజేయాల్సిందిగా తాను శనివారం రాష్ట్ర సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశానని ఆయన తెలిపారు. ఈ రెండేళ్ళలో ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని ఆయన విమర్శించారు. మిషన్ భగీరథ టెండర్లు, మిషన్ కాకతీయ టెండర్లు, అనేక పాలనాపరమైన అంశాలలో విధి విధానాలు, పారిశ్రామిక విధానాల్లో, ఇసుక కేటాయింపుల్లో, మున్సిపాలిటీలకు నిధులు కేటాయించడంలో ఇలా అన్నింటిలోనూ అవకతవకలు జరిగాయని విమర్శించారు. ప్రజలకు ఉన్న సమాచార హక్కును కాలరాసే విధంగా ప్రభుత్వం వెబ్‌సైట్‌ను రద్దు చేసిందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో నోటా లేకుండా చేసిందని దాసోజు శ్రవణ్ విమర్శించారు.
గోదావరిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
ఒకరి మృతదేహం లభ్యం
ప.గో.లో విషాదం
పోలవరం, ఫిబ్రవరి 23: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యంకాగా, మరొకరి ఆచూకీ లభించాల్సివుంది. జిల్లాలోని కొయ్యలగూడెం డిగ్రీ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు మంగళవారం పోలవరం పంచాయతీ పరిధిలో గోదావరి ఒడ్డున ఉన్న మహా నందీశ్వర స్వామి ఆలయం వద్దకు వచ్చారు. వీరిలో అయిదుగురు ఒడ్డున కూర్చోగా, ముగ్గురు గోదావరిలో స్నానానికి దిగారు. వీరిలో ఇద్దరు గల్లంతయ్యారు. గాలింపు అనంతరం కనుమూరి అశోక్ (20) మృతదేహాన్ని వెలికితీశారు. గల్లంతైన మోటేపల్లి వీరబాబు (20) ఆచూకీ లభించాల్సివుంది. పోలవరం విఆర్వో జి గణపతిరావు ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీహరిరావు తెలిపారు.