తెలంగాణ

జనం నుంచి వనంలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం: కోటిన్నర మందికి పైగా భక్తులను కరుణించిన చల్లని తల్లులు... తమ కోసం తరలివచ్చిన భక్తజనావళిని ఆశీర్వదించి తల్లుల వనప్రవేశంతో మేడారం మహాజాతర ప్రధానఘట్టం శనివారం సాయంత్రం ముగిసింది. నాలుగురోజుల పాటు భక్తజన నీరాజనాలు అందుకున్న సమ్మక్క-సారలమ్మ దేవతలు సాయంత్రం వనప్రవేశం చేసారు. సమ్మక్క...ఆ తరువాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వారి వారి వడ్డె (పూజారు)లు సాంప్రదాయ పూజలు నిర్వహించి వన ప్రవేశం చేయించారు. సమ్మక్క తల్లిని సాయంత్రం 06.18 గంటలకు, సారలమ్మను, గోవిందరాజు, పగిడిద్దరాజులను ఆ వెంటనే గద్దెలను కదిలించారు. కాగా అమ్మల వనప్రవేశ ఘట్టం సాయంత్రం వడ్డెల పూజలతో ఆరంభమైంది. గిరిజన పూజారులు డోలు చప్పుళ్ల నడుమ గద్దెపైకి చేరుకుని పూజలు చేసారు. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెపైకి చేరుకుని పూజలు నిర్వహించారు. రహస్య పూజల అనంతరం ప్రతిష్టించిన అమ్మకు ప్రతిరూపమైన కుంకుమ భరిణెను తీసుకుని భక్తులను దాటుకుంటూ గద్దెల ప్రాంగణం నుంచి బయటకు తీసుకువెళ్లి సమ్మక్క తల్లిని వనప్రవేశం చేసారు. పూజారులకు పోలీసు రోప్‌పార్టీలో రక్షణ కల్పించారు. అయినా భక్తులు సమ్మక్క తల్లి వనప్రవేశ సమయంలో పూజారులను తాకేందుకు పోటీలు పడ్డారు.
గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు జరుగుతుండగానే సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, ఇతర వడ్డెలు గద్దెకు చేరుకున్నారు. అక్కడ గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించారు. గద్దెలపై ఉన్న సారలమ్మ రూపాన్ని కాక సారయ్య నేతృత్వంలో పూజారుల బృందం కనె్నపెల్లికి తీసుకువెళ్లింది. గద్దెపై ప్రతిష్టించిన సారలమ్మతల్లి ప్రతిరూపమైన మొంటె (వెదురుబుట్ట)ను తీసుకుని పూజారులు జంపన్నవాగు మీదుగా కనె్నపల్లికి తరలిస్తుంటే భక్తులు పూజారులను తాకేందుకు పోటీపడ్డారు. అంతకుముందు పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజులను ఏటూరునాగారం మండలం కొండాయికి వడ్డెలు సాంప్రదాయ పద్ధతిలో చేర్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తల్లుల వనప్రవేశం సమయంలో అశేష భక్తజనావళి హాజరయ్యారు. దేవతల వనప్రవేశంతో జాతర ముగిసినట్లు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ప్రకటించారు. సుమారు కోటి 50లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు అధికార యంత్రాంగం ధ్రువీకరించారు.

భక్తుల కానుకలతో నిండిపోయిన సమ్మక్క, సారలమ్మ తల్లుల గద్దెలు

లక్షలాది భక్తులతో కళకళలాడిన మేడారం జాతర ప్రాంగణం శనివారం వెలవెలబోయంది. వనదేవతలు అడవికి తరలివెళ్లడంతో భక్తులు సైతం తిరుగుముఖం పట్టారు. దీంతో గద్దెల ప్రాంగణం, జంపన్నవాగు ఘాట్‌లు నిర్మానుష్యంగా మారాయ.

గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజల అనంతరం అమ్మవార్లను వనంలోకి తరలిస్తున్న పూజారులు

ఖాళీ అవుతున్న మేడారం
వెలవెలబోతున్న గుడారాలు
తల్లుల పయనం కంటే ముందే
తిరుగుముఖం పట్టిన భక్తులు

మేడారం బృందం: అశేష భక్త జనావళితో గత వారంరోజులుగా ఒలలాడిన మేడారం పరిసర ప్రాంతాలు శనివారం ఖాళీగా కనిపిస్తున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో తిరుగుముఖం పట్టడంతో గుడారాలన్ని వెలవెల బోతున్నాయి. తల్లుల వనప్రవేశం కంటే ముందే భక్తులు స్వస్థలాలకు తిరిగివెల్లుతుండడంతో కాల్వపల్లి, కనె్నపల్లి, రెడ్డిగూడెం, కొత్తూరు, నార్లాపూర్, ఊరట్టం, ఎల్బాక, పగిడాపూర్ తదితర మేడారం పరిసర గ్రామాలన్నీ ఖాళీ అయ్యాయి. నాలుగు రోజుల పాటు కోట్లాదిమంది భక్తులు తల్లులను దర్శించుకోవడానికి తరలిరావడంతో నదిప్రవాహంలా మారిన మేడారం పరిసర గ్రామాలు నేడు బోసిపోయి కనిపిస్తున్నాయి. నాలుగురోజుల పాటు భక్తులను తన ఒడిలో చేర్చుకుని దీవెనలు అందించిన సమ్మక్క-సారలమ్మ తల్లులు శనివారం సాయంత్రం వనప్రవేశం వెళ్తుండడంతో శనివారం సైతం భక్తులు భారీగానే తరలివచ్చినప్పటికీ గద్దెల ప్రాంగణం, క్యూలైన్‌లో మాత్రమే భక్తుల హడావుడి కనిపించింది.
జంపన్నవాగులో తగ్గిన భక్తులు
గత మూడు రోజులుగా కొనసాగిన భక్తుల జన ప్రవాహం శనివారం తగ్గుముఖం పట్టడంతో జంపన్నవాగు రద్దీ తక్కువగా ఉంది. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద పుణ్యస్నానాలుచేసిన భక్తులు... జంపన్నవాగులో జలస్నానాలు చేశారు. శుక్రవారం ఉన్న భక్తజన ప్రవాహం శనివారం కనిపించలేదు.

కెసిఆర్
అభినందనలు

హైదరాబాద్: మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర విజయవంతంగా ముగియడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. లక్షలాది భక్తులు హాజరైన జాతర కోసం రేయింబవళ్లు పని చేసిన అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయ పరిచి జాతరను అద్భుతంగా జరిపేందుకు కృషి చేసిన కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులను, వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోయే విధంగా సమ్మక్క సారలమ్మ దీవిస్తారని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అందరి సహకారంతో...: ఇంద్రకరణ్‌రెడ్డి
సమ్మక్క సారలమ్మ జాతరను అందరి సహకారంతో అద్భుతంగా నిర్వహించినట్టు దేవాదాయ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన తొలి జాతర విజయవంతం కావడానికి ముఖ్యమంత్రి అవసరం అయిన నిధులు విడుదల చేశారని తెలిపారు. అందరి సహకారంతో జాతర విజయవంతం అయిందని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

భక్తుల రద్దీ తగ్గినా
తీరు మారని పోలీసులు
భక్తులకు ప్రసాదం అందకుండా నెట్టివేసిన వైనం
అల్లాడిన భక్తులు..
పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం

మేడారం: నాలుగు రోజుల మహాజాతర చివరి రోజుకు చేరుకున్నా విధి నిర్వహణలో ఉన్న పోలీసుల తీరులో మార్పు లేదు. తమ సిబ్బందిని గద్దెల వద్దకు నేరుగా పంపడం..ప్రసాదాలతోపాటు గద్దెలపై భక్తులు సమర్పించిన చీర, జాకెట్‌లను తమ వారికి అందజేస్తున్నారు. పోలీసు సిబ్బందికి తల్లుల ప్రసాదం ఇచ్చేటప్పుడు తమకు ఇవ్వాలని భక్తులు ఎన్నిసార్లు పోలీస్ సిబ్బందిని వేడుకున్నా..కనికరిచక పోగా మహిళా భక్తులనికూడా చూడకుండా ఇష్టారాజ్యంగా నెట్టివేస్తుండటం పలు విమర్శలకు తావిస్తుండగా, భక్తులు మాత్రం పొలీస్ సిబ్బంది చర్యలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మంచెపై ఉన్న అధికారులు పోలీసుల తీరు మార్చుకోవాలని, తమ సిబ్బందిని అక్కడి నుండి పంపించాలని, మరికొన్ని గంటలు ఓపికతో విధి నిర్వహిస్తే ప్రసాదం కోసం ఇబ్బందులు పడాల్సిన పని ఉండదని మైకులో అధికారులు సూచిస్తున్నా తమకు పట్టనట్టుగా గద్దెల వద్ద పోలీసులు వ్యవహరిస్తున్నారు. మేడారం జాతరలో మేము ఏం చేసినా చెల్లుతుందని... జాతరంటేనే పోలీసులనే తీరులో సిబ్బంది ప్రవర్తిస్తూ..గద్దెల వద్ద విధులు నిర్వహించే ఇతర శాఖల అధికారులను, మీడియా ప్రతినిధులను సైతం నెట్టివేస్తున్న పోలీసులు తమ సహజ నైజాన్ని చాటిచెపుతున్నారు.

ఎక్కడి చెత్త.. అక్కడే!

మేడారం: మేడారం జాతర అడవితల్లుల వన ప్రవేశంతో ముగియడంతో మేడారం, తదితర పరిసరాలలో దుర్గంధం వెదజల్లుతోంది. జాతరకు పెద్ద ఎత్తున పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసిన అధికారులు ఈ సారి హైదరాబాద్‌నుండి సైతం చెత్తతొలగించే వాహనాలను తీసుకువచ్చారు. మొదటి రెండు రోజులు పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై ప్రశంసలు వచ్చినా చివరి రెండు రోజులు మాత్రం చెత్త తొలగించడంలో సిబ్బంది నిర్లక్ష్యం కనిపించింది. భక్తులు వదిలేసిన వ్యర్థాలు, చెత్త ఎక్కడ వేసింది అక్కడే అన్న రీతిలో తయారైంది. దీనికి తోడు మంచినీటి ట్యాంకుల వద్ద ఆన్ ఆఫ్ లేకపోవడంతో నీరు వృధాగా మారి పరిసరాలను చిత్తడిగా మారుస్తున్నాయి. మురికినీరు పేరుకుపోయి వ్యర్థాల్లో కలిసి పరిసర ప్రాంతాలన్ని దుర్గంధ భరితంగా మారాయి. శనివారం తల్లులను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మేడారం పరిసర ప్రాంతాలలో ఏర్పడింది. ఇకనైన అధికారులు స్పందించి పారిశుద్ధ్యంపై దృష్టిసారించాల్సి ఉంది.

మళ్లొస్తం తల్లీ...

మేడారం: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు తల్లులుగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల దర్శనం చేసుకున్న భక్తులు మళ్లీ జాతరకు వస్తామంటూ స్వగ్రామాలకు పయనమయ్యారు. ఎదనిండా భక్తి భావాన్ని నింపుకొని..తల్లులను దర్శించి మరుపురాని, మరచిపోలేని అనుభవాలను తమ వెంట తీసుకువెళ్తున్న భక్తులు 2018లో జరిగే మేడారం జాతరకు తిరిగి మళ్లీ వస్తామంటూ సెలవు తీసుకుంటున్నారు. తల్లుల దగ్గర మొక్కులు చెల్లించుకుంటే తమకు, తమ కుటుంబాలకు మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం. కాగా ఎన్ని కష్టాలు ఎదురైనా తిరిగి తల్లుల దర్శనం కోసం ఎన్ని ప్రయాసలైనా ఎదుర్కొంటామని, మళ్లీ జాతరకు తిరిగివస్తామంటూ భక్తులు తమ మనోభావాలను పంచుకున్నారు.

జాతర ఏర్పాట్లు ఘనం

అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కృషి చేస్తా: దత్తాత్రేయ

వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొట్టమొదటిసారిగా జరిగిన మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతమైందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న ఆయన అమ్మవార్లకు మొక్కులు చెల్లించి వరంగల్‌కు చేరుకున్నారు. అనంతరం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అయితే వచ్చే జాతర నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరిన్ని వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన జాతరగా పేరుపొందిన మేడారం మహాజాతరకు తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాల్సివుందన్నారు. సమ్మక్క-సారలమ్మలు హక్కుల కోసం పోరాడి దేవతలుగా నిలిచారని, సామాన్య జనం ఈ వీర మహిళలను దేవతలుగా కొనియాడడం గొప్ప విషయమన్నారు. సమ్మక్క-సారలమ్మలు కోరిన కోర్కెలు తీర్చే దేవతలు కావడం వల్లే ఈ మహాజాతర ఇంత పెద్దఎత్తున జరుగుతుందన్నారు. ప్రజలకు ఈ దేవుళ్లపై అపారమైన విశ్వాసం ఉందని ఆయన అన్నారు. ఈ మహాజాతరకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చే విధంగా తాను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిని కలుస్తానని తెలిపారు. మహాజాతర సందర్భంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా విజయవంతంగా జాతర ఘట్టం పూర్తయిందన్నారు.
ఈ విలేఖరుల సమావేశంలో మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు మందాడి సత్యనారాయణరెడ్డి, ధర్మారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుపద్మ, వంగాల సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న దత్తాత్రేయ