తెలంగాణ

కరవుకు సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 11: పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పిడికిలి బిగిస్తే రెండున్నరేళ్లలో కరవుకు సమాధి కట్టగలమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో పర్యటించారు. మూడు రోజులుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బస చేసిన సిఎం సోమవారం ఎర్రవల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులను పరిశీలించారు. 28 కోట్లతో చేపట్టనున్న కూడవెల్లి వాగు ఆధునీకరణ పనులు, 43 కోట్లతో చేపట్టనున్న డ్రిప్ ఇరిగేషన్ పనులకు శంఖుస్థాపన చేశారు. అక్కడినుంచి హెలికాఫ్టర్‌లో దుబ్బాక కేంద్రానికి చేరుకున్నారు. బాల్యంలో చదువుకున్న పాఠశాల శిధిలావస్థకు చేరుకోగా, 4.6 కోట్లతో నిర్మించతలపెట్టిన సమీకృత భవనానికి శంఖస్థాపన చేశారు. అనంతరం బాలాజీ ఫంక్షన్ హాల్లో ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. జీతభత్యాలు, ఇతర ఖర్చులుపోను రాష్ట్భ్రావృద్ధికి ఏటా 60 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నట్టు చెప్పారు. మన నిధులు, నీరు, వనరులు మనకు దక్కాయని, చేయిచేయి కలిపితే అభివృద్ధి అసాధ్యం కాదన్నారు. మిషన్ భగీరథ ద్వారా తొలివిడతలో తొమ్మిది నియోజకవర్గాలకు ఇంటింటికి గోదావరి నల్లా నీళ్లు ఏప్రిల్ 30నుంచి అందించనున్నట్టు పునరుద్ఘాటించారు. ఏ గ్రామంలోనూ ఆడపడుచులు బిందెలు పట్టుకుని బజారులో కనిపించకూడదని, ఒకవేళ అలా జరిగితే గ్రామ సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పీటీసీ, ఎంపిపిలతో పాటు అవసరమైతే సంబంధిత నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పదవుల్లో ఉన్నామని గర్వపడకుండా ఎన్ని సేవలు అందించామన్న ధ్యాసతో పని చేయాలని సూచించారు. 1100 సంవత్సరాల క్రితం కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులన్నీ తాంబలంగా మారాయని, వీటి పునరుద్ధరణకు మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. చెరువుల అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు, ప్రజలు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని సాగుకు అందిస్తామని, సాధారణ రైతు ఏడాదికి రెండు పంటలు సాగు చేయడం కళ్లారా చూడాలన్నదే తన తాపత్రయమని, అప్పుడే తన జన్మకు సార్థకత చేకూరుతుందన్నారు. నాలుగేళ్లలో చెరువులన్నీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానంగా గ్రామాల్లో దళితవాడలు అభివృద్ధి చెందితేనే గ్రామాభివృద్ధి సాధించినట్టు భావించాలన్నారు. మిత్రులైనా, శత్రువులైనా చివరకు వెళ్లేది స్మశాన వాటికకేనని, ప్రతి గ్రామంలో వైకుంఠధామాలను ఏర్పాటు చేయాలని, వీటికి అవసరమైన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. స్థలం లేకపోతే సేకరించాలని కలెక్టర్‌కు బాధ్యత అప్పగించారు. ప్రస్తుతం కరెంటు సమస్య తీరిందని, వచ్చే మార్చి ఏప్రిల్ నాటికి పగటి పూటే తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేయిస్తామని, 2018నాటికి 24 గంటలు విద్యుత్ ఇవ్వాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదలు ఆత్మగౌరవంతో నివసించాలనే లక్ష్యంతో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. తొలివిడతలో 60 వేల ఇళ్లు మంజూరు చేశామని, వచ్చే ఏడాది మరింత పెంచుతామన్నారు. గ్రామాభివృద్ధికి సర్పంచులే హీరోలు కావాలన్నారు. నాటి గురువులు నేటి తరానికి ఆదర్శవంతులని, నేటి సమాజంలో పంతుళ్లలో అంకితభావం కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నీటి పారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, బాబుమోహన్, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కలెక్టర్ రొనాల్డ్ రాస్, జెడ్పీటీసీలు, ఎంపిపిలు, సర్పంచులు పాల్గొన్నారు.

చిత్రం... దుబ్బాకలో ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతున్న సిఎం కెసిఆర్