తెలంగాణ

ఎమ్మెల్సీ స్థానానికి కవిత నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 18: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థిగా మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత బుధవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన తెరాస ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేష్‌గుప్తా, హన్మంత్‌సింధే, షకీల్, సురేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వీ.గంగాధర్‌గౌడ్ తదితరులంతా కవిత వెంట నామినేషన్ స్వీకరణ కేంద్రానికి తరలివచ్చారు. అనంతరం ఎన్నికల నిబంధనలను అనుసరిస్తూ ఎమ్మెల్యేలు బిగాల, షకీల్, బాజిరెడ్డి, సురేందర్‌లతో కలిసి మాజీ ఎంపీ కవిత రిటర్నింగ్ అధికారి చాంబర్‌లోకి వెళ్లి రెండు సెట్ల నామినేషన్‌లు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఆమె అనుయాయులు కవితకు అనుకూలంగా నినాదాలు చేస్తూ పెద్దపెట్టున బాణసంచా పేల్చి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. అంతకుముందు కవిత తనకు అభ్యర్థిత్వం ఖరారైనందున ఉదయం వేళలోనే హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గల స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఉమ్మడి జిల్లాకు చెందిన తెరాస ఎమ్మెల్యేలను కలిసి వారి మద్దతు కోరారు. ఎమ్మెల్యేలతో కలిసి కాన్వాయ్‌గా నిజామాబాద్‌కు బయలుదేరిన సందర్భంలోనే మార్గమధ్యంలో కామారెడ్డి, ఇందల్వాయి, డిచ్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఆమె స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తూ నిజామాబాద్‌కు చేరుకున్నారు. ముందుగా మెట్టినింటికి చేరుకుని, భర్త, అత్తమామల ఆశీర్వాదం
తీసుకుని, ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కలెక్టరేట్ వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, గత పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లా రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన మాజీ ఎం.పీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు హాజరైన సందర్భంగా ఆమెను కలిసేందుకు పెద్దసంఖ్యలో తెరాస నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎనలేని ఉత్సాహం ప్రదర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆమె నివాసం వద్దకు ముందుగానే చేరుకుని కవిత రాక కోసం నిరీక్షించారు. ఈ సందర్భంగా కవిత నివాసం వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా మాజీ ఎంపీ కవిత తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తుండడం పట్ల ఆమె అనుయాయులు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ఎక్కడ చూసినా తెరాస శిబిరంలో ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. స్థానిక సంస్థల్లో తెరాసకు స్పష్టమైన ఆధిక్యత ఉన్న దృష్ట్యా కవిత గెలుపు సునాయసమేనని పేర్కొంటున్నారు. కాగా, తెరాస అభ్యర్థిగా ఇప్పటికే తొలిసెట్ నామినేషన్ వేసిన మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు బుధవారం సైతం మరో సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
బీజేపీ అభ్యర్థిగా పీ.లక్ష్మీనారాయణ
ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోతన్‌కర్ లక్ష్మీనారాయణ బుధవారం నామినేషన్ వేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, పల్లె గంగారెడ్డి తదితరులతో కలిసివచ్చి ఆయన సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల్లో బీజేపీకి తగినంత బలం లేనప్పటికీ, తెరాసకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కల్పించకూడదనే ఉద్దేశంతో అభ్యిర్థిని బరిలోకి దించారని తెలుస్తోంది.

*చిత్రం... నామినేషన్ దాఖలు చేస్తున్న మాజీ ఎంపీ కవిత