తెలంగాణ

‘బెగ్గర్ ఫ్రీ సిటీ’గా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాన్ని యాచక రహిత నగరం (బెగ్గర్ ఫ్రీ సిటీ)గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. యాచకులకు ప్రత్యామ్నాయ పునరావాసంపై కేంద్ర అధికారుల బృందం శనివారం నగరంలో పలు ప్రభుత్వ శాఖలతో సమావేశమైంది. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశాన్ని బెగ్గర్ ఫ్రీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందని, ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ నుంచి ఏడాది పాటు యాచకులకు ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించేందుకు కేంద్రం రూ.10 కోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు వీలుగా నేడు ప్రభుత్వం వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, రూ.5కే భోజనం వంటివి అందిస్తోందని అన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తి జీవించేందుకు అవకాశం కల్పించడంలో భాగంగా యాచకుల సామాజిక, ఆర్థిక, కుటుంబ పరిస్థితులను గుర్తించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సంయుక్త కార్యదర్శి రాధికా చక్రవర్తి మాట్లాడుతూ బెగ్గర్స్ పునరావాసంపై విధివిధానాలను రూపొందించేందుకు
దేశవ్యాప్తంగా సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ నగరంలోని 150 వార్డుల్లో కేవలం రూ.5కే జీహెచ్‌ఎంసీ భోజనం అందిస్తోందని, మరిన్ని స్వచ్ఛంద సేవలు ముందుకొచ్చి, యాచకులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలను అందించాలని కోరారు. విశ్వనగరంగా పోటీ పడుతున్న హైదరాబాద్ నగరంలో కేంద్ర నిర్వహించే బెగ్గర్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు ముందుకు రావాలని ఆయన సూచించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, రంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్ హరీశ్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లు వీ సంతోష్, రాహుల్ రాజ్, యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ డీ సౌజన్య, ట్రాఫిక్ డీసీసీ చౌహాన్ పాల్గొన్నారు.

*చిత్రం... ఎన్జీఓలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం