తెలంగాణ

పురపోరు.. కారు జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలకుగాను దాదాపు వందకు పైగా స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయబావుటా ఎగురవేసింది. ఆరు స్థానాల్లో కాంగ్రెస్, మూడు స్థానాల్లో బీజేపీ, రెండు స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించాయి. మిగతా స్థానాల్లో పరిస్థితి రసవత్తరంగా మారింది. క్యాంపు రాజకీయాలు, ఇతర రాజకీయాలు వీటిపై ఎక్కువ ప్రభావం చూపుతాయని స్పష్టమవుతోంది.
మొత్తం 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎనిమిదింటిలో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించినప్పటికీ పూర్తి మెజారిటీ రాలేదు. నిజామాబాద్‌లో 60 వార్డులుండగా బీజేపీ 28 వార్డులను కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్ 13 స్థానాల్లో ఎంఐఎం 16 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ రెండు స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలవడంతో ఆసక్తికరంగా మారింది. అయితే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉండడం వల్ల టీఆర్‌ఎస్-ఎంఐఎం కలిసి ఈ స్థానం కూడా చేజిక్కించుకునే అవకాశం ఉంది.
మున్సిపాలిటీలకు సంబంధించి నారాయణ్‌ఖేడ్, చండూ రు, వడ్డెపల్లి, పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిభట్లలో కాంగ్రెస్ ఆధిక్యత సాధించింది. నార్సింగిలో కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్ కన్నా ఒక వార్డు ఎక్కువ వచ్చినప్పటికీ ఈ స్థానంలో కూడా టీఆర్‌ఎస్‌కే చైర్‌పర్సన్ పదవి దక్కుతుందని తెలిసింది. హాలియాలో మొత్తం 12 వార్డు స్థానాలు ఉండగా ఆరు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి పట్టు సాధించింది.
ఇలాఉండగా కొల్లాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలోని ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులే ఆధిక్యత సాధించారు. చివరి క్షణంలో వీరంతా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నందు వల్ల ఈ స్థానం కూడా టీఆర్‌ఎస్ ఖాతాలో చేరుతుంది. అయిజలో కూడా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు సత్తా చాటినప్పటికీ, వీరిలో చాలామంది గులాబీ కండువాలు కప్పుకుంటారని స్పష్టమవుతోంది. ఇలాఉండగా ఖానాపూర్, నస్‌పూర్, కొంపల్లి,
యాదగిరిగుట్ట, నేరేడుచర్ల, నల్లగొండ, భూత్పూర్, నారాయణపేట, అమరచింతలలో రసవత్తర పరిస్థితి నెలకొంది. వీటిలో రాజకీయ చేతివాటం ఎలా ఉంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ మున్సిపాలిటీల్లో గెలుపొందిన అభ్యర్థులను ఆయా పార్టీలు ఇప్పటికే క్యాంపులకు తరలించినట్టు తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం మొత్తం మున్సిపాలిటీల్లోని 2,727 వార్డు ల్లో టీఆర్‌ఎస్ 1,580 స్థానాలను దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 530 స్థానాల్లో, బీజేపీ 236 స్థానాల్లో, ఎంఐఎం 69 స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రులు, ఇతరులు 300 పైగా వార్డుల్లో గెలిచారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్లలో 154 స్థానాల్లో టీఆర్‌ఎస్, 65 స్థానాల్లో బీజేపీ, 40 స్థానాల్లో కాంగ్రెస్, 17 స్థానాల్లో ఎంఐఎం, 50 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు.
27న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక
ఈ నెల 27న మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నిక నిర్వహంచేందుకు రంగం అధికారులు సిద్ధం చేశారు. ఇందుకోసం రిటర్నింగ్ అధికారులు శనివారమే నోటీసులు జారీ చేశారు.