తెలంగాణ

తల్లుల జాతరకు తొలి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 22: చల్లని తల్లుల మహాజాతరకు మొదటి అడుగు పడింది. గుడిమెలిగే పండుగతో జనజాతరకు వేదిక సిద్ధమవుతోంది. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం గుడిమెలిగే పండుగతో పూజారులు ఆలయాల శుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మేడారంలో గుడిమెలిగే పండుగను పూజారులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పూజారులు, వడ్డెరలు, ఆదివాసీ మహిళలు కలిసి అడవిలోకి వెళ్లి కొత్త గడ్డిని సేకరించి డోలు, సన్నాయి వాయిద్యాలతో గుడివద్దకు తెచ్చి ఆలయంపై కప్పారు. అదే విధంగా గుడిలోని సమ్మక్క-సారలమ్మ పూజా మందిరంలో పుట్ట మన్నుతో ఆలయాన్ని అలికి శుద్ధి చేసి ముగ్గులు వేసి ధూపదీప నైవేద్యాలు అమ్మవార్లకు సమర్పించి సంప్రదాయబద్ధంగా యాటపోతుతో మొక్కులు చెల్లించి పూజలు ఘనంగా నిర్వహించారు. కనె్నపల్లిలోని సారలమ్మ ఆలయంలో ప్రధాన పూజారి కాక సారయ్య కొత్తగడ్డిని తెచ్చి సారలమ్మ మందిరంపై కప్పి అలికి ముగ్గులు వేసి తోరణాలు కట్టి సారలమ్మకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి యాటపోతులతో మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా అమ్మవార్ల జాతరకు తొలి అడుగు పడడంతో మహాజాతరకు రంగం సిద్ధమైంది. ఈ బుధవారం గుడిమెలిగే పండుగ పూర్తికావడంతో వచ్చే బుధవారం మండమెలిగే పండుగ కార్యక్రమాన్ని పూజారులు ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం వచ్చే మూడవ బుధవారం మహాజాతరకు సిద్ధమవుతారు. ఫిబ్రవరి 5,6,7 తేదీలలో మూడు రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇప్పటికే భక్తుల సౌకర్యార్ధం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. అమ్మవార్లు గద్దెలపైకి వచ్చిన అనంతరం వనప్రవేశంతో మేడారం మహాజాతర ముగుస్తుంది. మూడు బుధవారాలకు ఇక్కడ ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి బుధవారం భక్తులు జాతరకు పోటెత్తుతారు. గుడిమెలిగే, మండమెలిగే అమ్మవార్ల రాక మూడు ఘట్టాలు ఈ జాతరలో ప్రత్యేకంగా నిలుస్తాయి. మహాజాతర సమయంలో వడ్డేలు పూర్తిగా పూజలోనే నిమగ్నం అవుతారు. జాతర ముగిసిన తర్వాత వచ్చే బుధవారం ఫిబ్రవరి 12న తిరుగువారం పండుగగా జరుపుకుంటారు.
ఈ సందర్భంగా తల్లులకు యాటలను బలి ఇవ్వడం, నిలువెత్తు బంగారం (బెల్లం) తల నీలాలను సమర్పించుకుంటారు. దీంతో మహాజాతర ముగుస్తుంది.
''చిత్రాలు.. సమ్మక్క ఆలయంలో గుడిపై కొత్త గడ్డి కప్పుతున్న పూజారి
* సారలమ్మ పూజాసామగ్రిని శుద్ధి చేస్తున్న పూజారులు