తెలంగాణ

భారత ఎన్నికల వ్యవస్థ గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: ప్రపంచంలో భారత ఎన్నికల వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉందని, ఈ వ్యవస్థ చాలా గొప్పదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ఇక్కడ (తారామతి బారాదరి) ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య అవార్డు’ల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సవాళ్లతో కూడుకున్నదన్నారు. ఈ ఎన్నికల నిర్వహణలో దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగులు పాల్గొన్నారని ఆమె గుర్తు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీ నాగిరెడ్డి అభినందనీయుడన్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, ఎన్నికల్లో పోటీ చేసిన అందరికీ సమాన అవకాశాలు కల్పించడం క్రమశిక్షణకు మారుపేరన్నారు.
తెలంగాణ గవర్నర్‌గా తాను రాకముందు సౌత్ చెన్నైలో తనకు ఓటు హక్కు ఉండేదని, అత్యధికులు విద్యావంతులు అయినప్పటికీ, పోలింగ్ 49 శాతం మాత్రమే జరిగేదని గుర్తు చేస్తూ, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం వరకు కూడా పోలింగ్ కావడం ఓటర్ల చైతన్యానికి నిదర్శనమని తమిళిసై పేర్కొన్నారు. ఎన్నికల్లో రాజకీయం, ధనబలం, కండబలం ఉన్నప్పటికీ, అన్ని సమస్యలను పరిష్కరిస్తూ, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం గొప్పవిషయమన్నారు.
కష్టపడి పనిచేస్తే అవార్డులు లభిస్తాయని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి నిరూపించారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కితాబిచ్చారు. 12,750 గ్రామ పంచాయితీలు, 539 మండల పరిషత్తులు, 32 జిల్లా పరిషత్తుల ఎన్నికల నిర్వహణలో చిన్న రిమార్క్ లేకుండా పెద్దగా రీపోలింగ్ లేకుండా ఎన్నికలు నిర్వహంచడం అభినందనీయమన్నారు. ఎన్నికల కమిషన్ విధి నిర్వహణ సవాళ్లతో కూడుకున్నదని, రాజకీయ నేతలు, పార్టీల విమర్శలను సమర్థతగా ఎదుర్కొంటూ, నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి మొత్తం 192 మంది అధికారులు, సిబ్బందిని ఈ అవార్డులకు ఎంపిక చేయడం అందులో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులు, సిబ్బంది ఎక్కువగా ఉండడం తనకు సంతోషం కలిగిస్తోందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీ నాగిరెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించామని, ఎన్నికల చట్టాలను పూర్తిగా అమలు చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా అమలు చేశామన్నారు. రాష్ట్ర ప్రజాస్వామ్య అవార్డులు దేశంలో మొదటిసారి మహారాష్ట్ర అమలు చేసిందని, తెలంగాణ రెండో రాష్ట్రంగా పేరు తెచ్చుకుందన్నారు. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఏడుగురు జిల్లా కలెక్టర్లకు, ఇతర అధికారులు, సిబ్బందికి అవార్డులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

'చిత్రం... తారామతి-బారాదరిలో శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర డెమోక్రసీ అవార్డు కార్యక్రమంలో మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై