తెలంగాణ

మద్యం నిషేధించాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత డీకే అరుణ గురువారం ఉదయం మహిళా సంక ల్ప దీక్షను ప్రారంభించారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ఈ దీక్షను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ప్రారంభించగా, జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధరరావు, ఎమ్మెల్యే టీ రాజాసింగ్, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, మహిళా మోర్చా నేత ఆకుల విజయ, అందెశ్రీ, అత్యాచారం-హత్యకు గురైన టేకు లక్ష్మి భర్త, పలు యువజన సంఘాల
నాయకులు సైతం హాజరై మద్దతు పలికారు. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు వచ్చి అరుణకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ తెలంగాణలో మద్యాన్ని నిషేధించే సమయం ఆసన్నమైందని అన్నారు. మహిళలు, చిన్నారుల భవిష్యత్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించాలని పేర్కొన్నారు. తాగొచ్చిన భర్తలను ఇంట్లోకి రానివ్వబోమని మహిళలు సంకల్పం తీసుకోవాలని చెప్పారు. మద్యం వల్లనే మహిళలపై నేరాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. మద్యం వల్లనే దిశ, మానస, సమతపై అత్యాచారాలు జరిగాయని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధ ఆలోచన చేయాలని అన్నారు. మద్య నిషేధానికి మహిళా సమాజం నుండి మద్దతు లభిస్తోందని అన్నారు. ఉద్యమ సమయంలో తాను చెప్పిన మాటలను కేసీఆర్ నేడు మరిచారని, ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత వేరొక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మద్యంపై ప్రభుత్వానికి ఏడాదికి 20 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని, మద్యంపై వస్తున్న ఈ ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడపడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చేశారని ఆమె ధ్వజమెత్తారు. మద్యం తాగిన భర్తలు, భార్య, పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్నారని అన్నారు. అనేక కుటుంబాలు మద్యం వల్లనే ఆర్థికంగా చితికిపోతున్నారని, గ్రామాల్లో బెల్ట్‌షాపులు పెరిగిపోతున్నాయని, అయినా ఇవేవీ సీఎంకు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం మద్య నిషేధం వైపు అడుగులు వేయడం శుభపరిణామమని, దేశ భవిష్యత్ అయిన యువత మద్యానికి బానిసలు కావడం బాధాకరమని పేర్కొన్నారు. యువతను పెడదారి పట్టిస్తున్న పబ్‌లు, క్లబ్‌లు నిషేధించాలని అన్నారు. మద్య నిషేధంపై పోరాటాన్ని బీజేపీ ముందుండి నడిపిస్తోందని పేర్కొన్నారు.
మందు బంద్ కావాలి: అందెశ్రీ
అందెశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్య నిషేధం చేస్తే ప్రజలు జేజేలు కొడతారని, మద్యం కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పలుకుతుందని పేర్కొన్నారు. మద్యంతో అనేక అకృత్యాలు జరుగుతున్నాయని, మద్యం బంద్ అయితే తెలంగాణ కుటుంబాలు చక్కగా ఉంటాయని పేర్కొన్నారు. మద్యం కారణంగా జరుగుతున్న హత్యలు, చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ప్రభుత్వం మేల్కోవాలి: మురళీధరరావు
ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతోందని, ఆదాయం కోసం మద్యం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధరరావు విమర్శించారు. మద్యం వల్ల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. మద్యం వల్ల మహిళలకు చెప్పలేనంత ఇబ్బంది ఎదురవుతోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలని ఆయన చెప్పారు. మద్యం అమ్మకాలు ప్రభుత్వానికే కళంకమని, ఇప్పటికైనా వీటి అమ్మకాలను బంద్ చేయాలని ఆయన కోరారు.

*చిత్రం...సంకల్ప దీక్షలో మాట్లాడుతున్న డీకే అరుణ