తెలంగాణ

చిగురించని సింగూర్ ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు వరద పోటెత్తడంతో ప్రధాన జలాశయాలు ఇంచుమించు పూర్తిగా నిండిపోవడంతో సర్వత్రా సంతృప్తి వ్యక్తమవుతోంది. అయతే ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రవహిస్తున్న మంజీర నదీ పరీవాహక ప్రాంతంపై వరుణుడు అలకవహించాడని చెప్పవచ్చు. 29.99 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ వద్ద మంజీర నదిపై ప్రాజెక్టు నిర్మించిన విషయం తెలిసిందే. గత యేడాదితో పాటు ఈ వర్షాకాలంలో మంజీర నది పరిసర ప్రాంతాల్లో ఆశించిన వర్షాలు కురియలేదు. వర్షాకాలం ప్రారంభం నాటికి సింగూర్ ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటిపోయి కేవలం 0.4 టీఎంసీలకు పడిపోయింది. నాలుగు నెలల వర్షాకాలం పూర్తయినా కనీసం ఒక్క టీఎంసీ నీరు కూడా రాలేదు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో కురిసిన అడపాదడపా వర్షాలకు కేవలం అర టీఎంసీ నీరు మాత్రమే ప్రాజెక్టులోకి వచ్చింది. మహారాష్టల్రోని బీడ్ జిల్లా బాలాగాట్ కొండల్లో పుట్టిన మంజీర నది కర్నాటకలోని బీదర్ జిల్లా మీదుగా తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెడుతోంది. మంజీర నది పరీవాహక ప్రాంతమైన మహారాష్ట్ర, కర్నాటకల్లో కూడా ఆశించిన వానలు పడకపోవడంతో నదిలో వరద ప్రవాహం ఏ మాత్రం కనిపించ లేదు. కర్నాటకలో ఈ నదిపై కారింజ ప్రాజెక్టును నిర్మించారు. ఆ ప్రాజెక్టుకూడా నిండకపోవడంతో దిగువకు ఎంతమాత్రం నీరు రావడం లేదు. గోదావరి నది ఉపనదుల్లో మంజీర కూడా ఒకటిగా ఉంది. రెండేళ్ల క్రితం సింగూర్ ప్రాజెక్టు నిండుకుండలా ఉంటే గోదావరి నదిపై నిర్మించిన ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ఆయకట్టు పరిరక్షణ కోసం ప్రభుత్వం 15 టీఎంసీల నీటిని విడుదల చేయడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. మహారాష్టల్రో కురుస్తున్న భారీవర్షాలకు గోదావరి నదికి వరదపోటెత్తడంతో ఐదు రోజుల క్రితం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో మిగులు జలాలను గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. మంజీర నదిపై సింగూర్ ప్రాజెక్టును తాగు, సాగు నీటి అవసరాల కోసం నిర్మించగా, సంగారెడ్డి మండలం కలబ్‌గూర్ వద్ద సుమారు 2 టీఎంసీల సామర్థ్యంతో తాగునీటి అవసరాలకు మంజీర బ్యారేజ్‌ను నిర్మించారు. మెదక్ జిల్లా పాపన్నపేట, కొల్చారం మండలాల మధ్య నిజాం కాలంలో ఘన్‌పూర్ ప్రాజెక్టును సాగునీటి అవసరాల కోసం నిర్మించారు. ప్రస్తుత కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ (బంజెపల్లి) వద్ద కూడా సాగునీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టును నిర్మించారు. పోచారం ప్రాజెక్టు నిండటంతో మిగులు జలాలు మంజీర నది గుండా నిజాంసాగర్ ప్రాజెక్టుకు కొంత మేరకు చేరడంతో ఆ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఊరటచెందుతున్నారు. సింగూర్, ఘన్‌పూర్ ప్రాజెక్టుల పరిధిలోని వేలాది ఎకరాల్లో వరి పంటను సాగుచేసే రైతులను మాత్రం రెండేళ్లుగా నిరాశ నిస్పృహలకు గురి చేస్తోంది. ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్టులో ఉన్న నీరు సైతం పచ్చగా కనిపిస్తోంది. మంగళవారం ఉదయానికి సింగూర్ ప్రాజెక్టులోకి కేవలం 198 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, నీటి నిల్వ 0.955కు చేరుకుంది. ఈ నీటిలో నుండి ఆవిరి రూపంలో 20 క్యూసెక్కులు, మిషన్ భగీరథ తాగునీటి పథకం కోసం 5 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. మిషన్ భగీరథ ఇంటెక్‌వెల్ వరకు కాలువ తవ్వించి కష్టతరంగా నీటిని చేరవేస్తుండటం దురదృష్టకరం. వానలు పడాల్సిన సమయంలోనే ప్రాజెక్టు పరిస్థితి ఇంతటి దయనీయంగా ఉంటే వచ్చే వేసవి కాలం పరిస్థితి ఏమిటని అన్ని వర్గాల వారిని ఆందోళనకు గురి చేస్తోంది. భూగర్భ జలమట్టం సైతం వందల అడుగులకు పడిపోవడంతో బోర్లన్నీ వట్టిపోయాయి. పట్టణాల్లోని ఇళ్లలోని బోర్లు ఎండిపోవడంతో నీటి కష్టాలను భరించలేక అద్దె ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయిన సంఘటనలు లేకపోలేదు. ఎండాకాలం వచ్చే సరికి పరిస్థితి పునరావృతం అవుతుందేమోనన్న ఆందోళన ఇప్పుడే ప్రారంభమైంది. ప్రకృతి వైపరీత్యాన్ని అధిగమించడానికి ప్రభుత్వం ఇప్పటి నుండే ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించాలని కోరుకుందాం.

*చిత్రాలు.. * దిగువన వెలవెలబోతున్న మంజీర నది
ఒక టీఎంసీ నీరున్నా సింగూర్ ప్రాజెక్టు మధ్యలో ఏర్పడిన మట్టి దిబ్బలు,