తెలంగాణ

హుజూర్‌నగర్‌లో గెలుపు ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 23: రాష్ట్ర ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఫలితం గురువారం వెలువడనుంది. ఈనెల 21న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపును గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్ గోదాముల్లో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కేంద్ర పారామిలటరీ బలగాల పహారా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించబోయే ఓట్ల లెక్కింపులో భాగంగా 14 టేబుల్స్‌ను ఏర్పాటు చేసి 22 రౌండ్‌ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకల్లా ముగిసిపోనుంది. తొలి రెండుగంటల్లోనే దాదాపుగా విజేత ఎవరన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఉప ఎన్నికల్లో 13 రాజకీయ పార్టీల అభ్యర్థులు 15 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్ నుండి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుండి నలమాద పద్మావతిరెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుండి చావా కిరణ్మయి పోటీ చేశారు. వీరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డి మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ నెలకొనడంతో విజేత ఎవరన్నదానిపై ఉత్కంఠత నెలకొంది. ఆర్టీసీ సమ్మెతో పాటు సీఎం కేసీఆర్ పాలనా విధానాలపై ప్రతిపక్షాలు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌పై విమర్శల దాడి సాగించిన నేపథ్యంలో హుజూర్‌నగర్ ఫలితం అధికార పార్టీ పనితీరుకు కొలమానంగా మారింది. రెండు పార్టీలు పోటాపోటీగా విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం సాగించడంతో పాటు ఓటర్లకు తాయిలాల పంపిణీలో సైతం పోటీ పడ్డారు. ఈనేపధ్యంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆసక్తి, ఉత్కంఠతను రేపింది. సైదిరెడ్డి గెలిస్తే ఈ నియోజకవర్గంలో తొలిసారిగా గులాబీ జెండా ఎగురనుండగా, పద్మావతి గెలిస్తే కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడంతో పాటు ఉప ఎన్నికల్లో అధికార పార్టీదే గెలుపన్న చరిత్రను తిరగరాసినట్టవుతుంది.
లెక్కింపునకు భారీ బందోబస్తు
ఓట్ల లెక్కింపు సందర్భంగా సూర్యాపేట జిల్లాలో 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమలు చేయనున్నారు. జిల్లా రిటర్నింగ్ అధికారి, సూర్యాపేట కలెక్టర్ అమయ్‌కుమార్‌తో పాటు ముగ్గురు కేంద్ర పరిశీలకులు, రాష్ట్ర పరిశీలకుల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపుప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 8 గంటల నుండి ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపుకు ప్రతి టేబుల్‌కు మైక్రో అబ్జర్వర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, ముగ్గురు సిబ్బందిని నియమించారు. మొత్తం ఉప ఎన్నికల్లో 2 లక్షల 36,842 మంది ఓటర్లకుగాను పోలైన 2 లక్షల 754 ఓట్లను లెక్కించనున్నారు. అలాగే ప్రతి మండలానికి ఐదు వీవీప్యాట్‌ల స్లిప్‌లను కూడా లెక్కించనున్నారు.
అయితే ఇప్పటికే ఉప ఎన్నికలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య నెలకొన్న ముఖాముఖీ పోటీ క్రమంలో రెండు పార్టీలు పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్న నేపధ్యంలో ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. లెక్కింపు, ఫలితం వెల్లడి ఆలస్యమైనా వివాదరహితంగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

*చిత్రం...కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఈసీ పరిశీలకుడు ప్రతాప్‌సింగ్, కలెక్టర్ అమయ్‌కుమార్