తెలంగాణ

నేడే హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 20: రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిరేపిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం జరుగనుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ఉప ఎన్నిక బరిలో టీఆర్‌ఎస్ నుండి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుండి పద్మావతి ఉత్తమ్, బీజేపీ నుండి కోట రామారావు, టీడీపీ నుండి చావ్ల కిరణ్మయితో పాటు ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థులు మొత్తం 13 మంది, 15 మంది స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 28 మంది పోటీ పడుతున్నారు. నియోజకవర్గం పరిధిలోని హుజూర్‌నగర్, నేరడుచర్ల, మఠంపల్లి, గరిడేపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం, పాలకీడు మండలాలకు చెందిన 2,36,646 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మహిళా ఓటర్లు 1,20,320 మంది, పురుష ఓటర్లు 1,16,326 మంది ఉన్నారు. కాగా, ఈ ఎన్నిక ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఉత్తమ్, టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మధ్యనే కొనసాగుతుండగా వారు విజయం కోసం పోటాపోటీ ప్రచారం సాగించారు. రెండు పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు పోలింగ్‌కు
ముందు రోజంతా లోపాయికారిగా నగదు, మద్యం పంపిణీలో సైతం పోటీ పడ్డాయి. ఇదిలావుండగా, పోలింగ్ ప్రశాంతంగా సాగేలా ఎన్నికల సంఘం, పోలీస్ శాఖలు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అమయకుమార్ మొత్తం 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో జిల్లా ఎస్పీ భాస్కరన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వివిధ స్థాయి పోలీస్ అధికారులతో పాటు మొత్తం 1500 మంది పోలీస్ సిబ్బంది ఉప ఎన్నిక పోలింగ్‌లో బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. పోలింగ్ సామగ్రితో పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు ఆదివారం సాయంత్రంకల్లా చేరుకున్నారు. పోలింగ్ విధుల్లో రూట్ ఆఫీసర్లు, సెక్టార్ ఆఫీసర్లు, పోలింగ్ సిబ్బంది సహా అంతా కలిపి 1500 మంది సిబ్బందిని నియమించారు. ఆయా కేంద్రాల్లో సోమవారం ఉదయం 6 గంటలకు ఆయా పార్టీల ఏజెంట్లతో మాక్ పోలింగ్ నిర్వహించి 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభించనున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలోనూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 14 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఓటర్లు పోల్‌చిట్టీలతో పాటు ఏదేని గుర్తింపు కార్డుతో తమ ఓటు వినియోగించుకునేలా ఇప్పటికే ఎన్నికల అధికారులు అవగాహన కల్పించారు. ఓటింగ్ యంత్రంతోపాటు ఓటు వేశాక ఓటరు తన ఓటు సరిగా పడిందో లేదో తెలుసుకునేందుకు వీవీ ప్యాట్ స్లిప్ యంత్రాలను కూడా ఈవీఎంలకు అనుసంధానించారు. పోలింగ్ సాగుతున్న తీరుతెన్నులను పరిశీలించేందుకు వెబ్ కాస్టింగ్, వీడియో టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని వివిధచోట్ల ఉన్న సీసీ కెమెరాల సంఖ్యను 169 నుండి 400కు పెంచి వాటిని పోలీస్ స్టేషన్లకు అనుసంధానించారు. అలాగే జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పోలింగ్ కేంద్రాలను అనుసంధానం చేసి నిఘా పెట్టారు.
అక్కడ అదనపు బందోబస్తు
ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో పోలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్న హుజూర్‌నగర్ మండలంలోని బూరుగడ్డ, వేపల సింగారం, లింగగిరి, మేళ్లచెర్వు మండలంలోని వేపలమాధారం, కప్పలకుంట తండా, కందిబండ, రామాపురం, రేవూరు, చింతలాపాలెం మండలంలోని కిష్టాపురం, తమ్మారం, పీక్లానాయక్ తండా, పీకేకుంట తండా, గుడిమల్కాపురం, మఠంపల్లి మండలం రఘునాథపాలెం, యాతవాకిళ్ల, చెన్నాయిపాలెం, గుర్రంబోడు తండా, రామచంద్రాపురం, బిల్యానాయక్ తండా, గరిడేపల్లి మండలం వెలిదండ, పొనుగోడు, కల్మచెరువు, గరిడేపల్లి, కొత్తగూడెం, రాయినగూడెం, గానుగుబండ, పాలకీడు మండలంలోని జాన్‌పహడ్, కోమటికుంట తండా, శూన్యపహడ్, రాఘవపురం, నేరడుచర్ల మండలంలోని పెంచికల్‌దినె్న, మేడారం, కల్లూరు, బక్కయ్యగూడెం, దిర్శించర్లలో అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. పాతనేరస్తుల కదలికలపై నిఘా వేశారు. ఇప్పటికే ఆయా గ్రామాలతో పాటు నియోజకవర్గానికి చెందని బయట వ్యక్తులందర్నీ నియోజకవర్గం వీడి వెళ్లిపోవాలంటూ ఒకరోజు ముందుగానే ఎస్పీ భాస్కరన్ హుకుం జారీ చేశారు. చివరకు పీసీసీ చీఫ్, స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా కోదాడ ఓటరైనందున ఆయన కూడా స్థానికేతరుడేనని వెంటనే ఆయన కూడా నియోజకవర్గం వీడి వెళ్లిపోవాలంటూ ఎస్పీ ఆదేశించారు. దీనిపై ఉత్తమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికల సంఘం ఉత్తమ్‌కు నియోజకవర్గంలో ఉండేలా అనుమతించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపీరి పీల్చుకున్నాయి.

*చిత్రం...ఎన్నికల సామాగ్రిని సరిచూసుకుంటున్న పోలింగ్ సిబ్బంది