తెలంగాణ

ముగిసిన ఉప ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ : రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచార పర్వం శనివారంతో ముగిసింది. ఈనెల 21న జరిగే పోలింగ్‌లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఓటర్లను ఆకట్టుకునేందుకు విరామం లేకుండా ఆహర్నిశలు ప్రచార పర్వాన్ని పోటాపోటీగా సాగించారు. ఆక్టోబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ మొదలుకుని 17 రోజుల పాటు టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి, బీజేపీ అభ్యర్థి కోట రామారావు, టీడీపీ అభ్యర్థి చావ్ల కిరణ్మయి, వారి పార్టీల నాయకులు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. శనివారంనాటితో ప్రచార పర్వానికి తెరపడడంతో మైక్‌లు మూగబోగా, ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో భాగంగా ప్రధాన పార్టీలన్నీ ప్రలోభాల పర్వానికి తెరలేపాయి. ఇప్పటికే కుల సంఘాల వారిగా తాయిలాల తంతు సాగించిన పార్టీలు ఓటర్ల వారీగా తాయిలాల పంపిణీకి కేడర్‌ను పురమాయించాయి. చివరి రోజు ప్రచారంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బీజేపీ నుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రోడ్‌షోలతో సందడి చేశారు. వారి రోడ్‌షోలకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా హాజరయ్యారు. టీఆర్‌ఎస్ నుండి మంత్రి జగదీష్‌రెడ్డి ప్రచారం సాగించారు.
ప్రతిష్టాత్మంగా సాగిన ప్రచార పర్వం
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఎలాగైనా తమ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ హేమాహేమీలందర్నీ రప్పించి అధికార టీఆర్‌ఎస్ దీటుగా ప్రచారాన్ని సాగించారు. ఒకపక్క తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను ఓటర్లకు ఏకరవు పెడుతూ మరోపక్క సీఎం కేసీఆర్ నియంతృత్వ విధానాలను అసెంబ్లీలో ప్రశ్నించే గళం కోసం పద్మావతిని గెలిపించాలంటూ ఉత్తమ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మె, సీపీఐ తొలుత టీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చి తదుపరి ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉపసంహరించుకున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నించింది. మరోవైపు ఈ దఫా హుజూర్‌నగర్‌లో తొలిసారిగా గులాబీ జెండా ఎగురేయాలన్న కసితో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తనకు ఒక్క అవకాశమిచ్చి గెలిపిస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గం అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తానంటూ విస్తృత ప్రచారం సాగించారు. సైదిరెడ్డి విజయం కోసం టీఆర్‌ఎస్ నుండి మంత్రి కేటీఆర్ రోడ్‌షో నిర్వహించగా, మంత్రులు జి.జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విస్తృత ప్రచారం సాగించారు. మూడుసార్లు
ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదంటూ విమర్శలు గుప్పిస్తూ దేశంలోనే ఆదర్శనీయ పథకాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ విమర్శలకు దిగారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు తమకు కేటాయించిన మండలాల్లోనే మకాం వేసి ఓటర్లను కలిసి సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ ఒక్కసారి టీఆర్‌ఎస్‌కు ఓటేసి చూడాలంటూ అభ్యర్థించారు. ఇక కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన విధానాలను చూసి, మార్పు కోసం బీజేపీని గెలిపించాలంటూ ఆ పార్టీ అభ్యర్థి కోట రామారావు ప్రచారం సాగించగా, ఆయన గెలుపు కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారం సాగించారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి చావ్ల కిరణ్మయి ప్రజలకు అందుబాటులో ఉండే స్థానిక అభ్యర్థినైన తనను గెలిపించాలని కోరగా, ఆమె గెలుపు కోరుతూ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, హరికృష్ణ సోదరి సుహాసిని ప్రచారం సాగించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీతో పాటు 13 పార్టీలు, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 28 మంది ఎన్నికల బరిలో పోటీ పడుతుండగా ఈనెల 21న జరిగే పోలింగ్‌లో ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. మొత్తం నియోజకవర్గంలో 2,36,646 మంది ఓటర్లు ఉండగా, వీరిలో మహిళా ఓటర్లు 1, 20,320 మంది, పురుష ఓటర్లు 1,16,326 మంది ఉన్నారు.

*చిత్రాలు.. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచార పర్వానికి తెర...ఆఖరి రోజు ప్రచారంలో జగదీష్‌రెడ్డి, ఉత్తమ్‌రెడ్డి, రేవంత్ రెడ్డి, కిషన్‌రెడ్డి