తెలంగాణ

ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, అక్టోబర్ 17: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రశ్నించే ప్రజా సంఘాల గొంతులను నొక్కివేస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ అన్నారు. గురువారం ‘ఆంధ్రభూమి’ కార్యాలయానికి ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీతో పాటు వివిధ సంఘాలు 19వ తేదీన తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆయన అన్నారు. అన్ని సెక్షన్ల ప్రజలు పాల్గొని ఈ బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది కేవలం కార్మికుల సమస్య మాత్రమే కాదని, ఈ సమస్య రాష్ట్ర ప్రజలందరిదిగా భావించాలన్నారు. ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల డిమాండ్లను పరిష్కరించేంత వరకు పోరాడాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి సంస్థను అమ్మకానికి పెడుతుందన్నారు. కేవలం కొద్ది మంది ప్రైవేటు వ్యక్తుల పాలకుల సొంత ప్రయోజనాల కోసం ఇప్పటికే 20 శాతం ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిందన్నారు. టీఎస్ ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, అందుకే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం దాటవేస్తుందన్నారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో ప్రజలపై, కార్మికులపై నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆర్టీసీలో 20 శాతం ప్రైవేటు బస్సులను అద్దెకు పెట్టి వాటికి పూర్తి అద్దె చెల్లిస్తూనే వాటి నిర్వహణ, మోటారు వాహన పన్ను, బీమా ప్రీమియం చెల్లిస్తున్నారంటే కొద్దిమంది ప్రైవేటు యాజమాన్యాల శ్రేయస్సు కోసమేనని జగన్ ఆరోపించారు.
ఆ కారణంగానే ఆర్టీసీ నష్టాల్లో ఉందని, దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వందేనన్నారు. కార్మికులు తమ వౌలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతుంటే వారిపై ఫాసిజాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. పదేపదే బెదిరింపులకు పాల్పడుతూ సమ్మెపై నిషేధం పెట్టి ఎస్మా ప్రకటిస్తామని, గడువులోపు విధుల్లోకి హాజరు కాకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని హుకుం జారీ చేశారని అన్నారు. కార్మికులకు మద్దతు తెలుపుతున్న ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని జగన్ అన్నారు. ప్రజల కనీస ప్రాథమిక హక్కులను కూడా ప్రభుత్వం కాలరాస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కివేస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి నష్టాల నుండి బయటపడేయాలన్నారు. ప్రభుత్వ బకాయిలను వెంటనే ఆర్టీసీకి చెల్లించాలని, కండక్టర్లకు, డ్రైవర్ల రిక్రూట్ జరపాలని జగన్ డిమాండ్ చేశారు.
కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు డీజిల్‌పై వ్యాట్‌ను తొలగించి ప్రైవేటు వ్యక్తుల బస్సులను ఆర్టీసీ నుంచి తొలగించి కొత్త బస్సులను కొనుగోలు చేయాలన్నారు. అక్రమ అరెస్టులను నిలిపివేసి కేవలం కార్మికుల సమస్య లాగే సమ్మెను సూచించకుండా రాష్ట్ర ప్రజలందరి సమస్యగా భావించాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలంతా 19వ తేదీన తలపెట్టిన కార్మిక సంఘాల బంద్ పిలుపులో భాగమై విజయవంతం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. కార్మికుల డిమాండ్స్ పరిష్కారమయ్యేంత వరకు సమ్మెను విరమించకూడదని, వీరోచితంగా పోరాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ విజ్ఞప్తి చేశారు.