తెలంగాణ

పాలమూరు ప్రాజెక్టు భూ నిర్వాసితుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 18: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉద్ధృతం అవుతోంది. గత నెల రోజుల నుండి ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్యాకేజీల దగ్గర నిరాహార దీక్షలు చేపట్టి రెండు రోజుల క్రితం ప్రగతి భవన్ ముట్టడికి సైతం బయలుదేరారు. కానీ జడ్చర్ల సమీపంలో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టులు చేశారు. అయితే ఓ పక్క అరెస్టుల పర్వం కొనసాగుతున్నా మరోపక్క భూ నిర్వాసితులు మాత్రం పట్టువిడవకుండా తమకు పరిహారం చెల్లించాకే ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్‌తో రోడ్డెక్కుతున్నారు. అందులో భాగంగా మంగళవారం పాలమూరు ఎత్తిపోతల పథకంలోని వట్టెం రిజర్వాయర్ ముంపుబాధితులు ఏకంగా నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారి బిజినపల్లిలో వందలాది మందితో రాస్తారోకో చేశారు. దాంతో గంటల తరబడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్డుపై బైఠాయించి ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము ప్రభుత్వానికి భూములు ఇచ్చిన తమకు మాత్రం నష్టపరిహారం చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, తమను ప్రభుత్వం మోసం చేస్తోందంటూ ఆందోళనకు దిగారు. వట్టెం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న కారుకొండ తండా, జీడిగుట్ట తండా, అనికానిపల్లి తండాలకు చెందిన వందలాది మంది గిరిజనులు తమ పిల్లాపాపలతో కలిసి ఆందోళనకు దిగారు. అయితే వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడం, వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన పోలీసులు భూ నిర్వాసితులతో చర్చించి ఆందోళనను విరమింపజేయాలని సూచించారు. కొద్దిసేపు పోలీసులకు, భూ నిర్వాసితుల మధ్య వాగ్వివాదం జరగగా చివరగా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రాస్తారోకోను విరమించారు.
అయితే గత నెల రోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న భూ నిర్వాసితుల ఆందోళనలతో పాలమూరు ఎత్తిపోతల పథకం పనులకు అంతరాయం ఏర్పడి పనులు నిలిచిపోయాయి. పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని వట్టెం రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంతో పనుల టెండర్లలో వివిధ ప్యాకేజీ పనులు దక్కించుకున్న పలు కంపెనీల వారు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడి యంత్రాలు అక్కడే నిలిచిపోవడంతో తమకు సైతం తీవ్ర నష్టం జరుగుతోందని కాంట్రాక్టర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు జరిగే దగ్గర యంత్రాలను నడవనివ్వకుండా నిర్వాసితులు అడ్డుపడుతుండటంతో కాంట్రాక్టర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిర్వాసితులు ప్రాజ్టెక్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన ప్రభుత్వం మాత్రం వారికి పరిహారం ఇవ్వకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. వట్టెం రిజర్వాయర్ పరిధిలోని 9,10,11 ఫ్యాకేజీల పనులు గత నెల రోజుల నుండి నిలిచిపోయాయి. తమకు పరిహారం ఇచ్చిన తరువాతే పనులు కొనసాగించాలంటూ భూ నిర్వాసితులు చేస్తున్న ఆందోళనకు రోజురోజుకు వివిధ పార్టీల నుండి, ప్రజా సంఘాల నుండి, ప్రజల నుండి వారికి మద్దతు లభిస్తుండటంతో భూ నిర్వాసితులు తమ ఆందోళనను మాత్రం రోజురోజుకు ఉద్ధృతం చేస్తున్నారు. ఏదిఎమైనప్పటికీ పాలమూరు ప్రాజెక్టులో భాగంగా వట్టెం రిజర్వాయర్ పరిధిలోని మూడు ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.