తెలంగాణ

విభజన దిశగా పోలీస్ కమిషనరేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను రెండుగా విభజించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్‌ను రెండు జోన్లుగా విభజించే ప్రక్రియ వేగవంతమైంది. కొత్తగా ఏర్పాటయ్యే జోన్లలో సరిహద్దు జిల్లాలనూ చేర్చేందుకు కసరత్తు జరుగుతోంది. సైబరాబాద్‌ను వెస్ట్‌జోన్, ఉప్పల్ కేంద్రంగా ఈస్ట్‌జోన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ప్రభుత్వానికి తగు ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. విస్తరిస్తున్న నగరం, ఐటి కారిడార్, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాల నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణ కీలకంగా మారింది. దీంతో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులతో పోలీసింగ్‌ను బలోపేతం చేయాలనే లక్ష్యంగా కమిషనరేట్ల విభజన అంశం తెరపైకి వచ్చింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో పూర్తి స్థాయి పరిశీలన పూర్తయినట్టు విశ్వసనీయ సమాచారం. దీనిలో భాగంగానే ప్రస్తుతం ఉన్న సైబరాబాద్ కమిషనరేట్‌ను వెస్ట్‌జోన్‌గా, ఉప్పల్ కేంద్రంగా ఈస్ట్‌జోన్ కమిషనరేట్‌ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పోలీస్ శాఖలో వివిధ భాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది నుంచి ఆప్షన్స్ కూడా కోరినట్టు తెలుస్తోంది. ఈస్ట్‌జోన్ కార్యాలయానికి ఉప్పల్ ప్రాంతంలో 50 ఎకరాల స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్‌ను మరింత విస్తరించాలనే ముందుచూపుతో మూడు జిల్లాల్లోని పలు స్టేషన్లనూ కలపాలంటూ మరోసారి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. సరిహద్దు జిల్లాల పోలీస్ స్టేషన్లను కొన్నింటిని ఈస్ట్, వెస్ట్‌జోన్లలో కలపనున్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ విశ్వనగరంగా విస్తరించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా వెస్ట్‌జోన్ పరిధిలో మెదక్ జిల్లా రామచంద్రాపురం, రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి, షాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్, కేశంపేట, షాద్‌నగర్ (ట్రాఫిక్) రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్లను కలుపుతారు. ఈస్ట్‌జోన్ (ఉప్పల్)లోకి నల్లగొండ జిల్లా పోచంపల్లి, భువనగిరి (ట్రాఫిక్, శాతిభద్రతలు), వలిగొండ, బీబీనగర్, బొమ్మలరామారం, చౌటుప్పల్ (ట్రాఫిక్) పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తారు. పరిపాలన, ఆర్థిక శాఖల నిర్ణయం మేరకు ప్రభుత్వం త్వరలో ఈ విభజనపై స్పష్టత తీసుకురానుందని కొందరు సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా కొత్తగా ఏర్పాటయ్యే పోలీస్ కమిషనరేట్స్‌లో పనిచేసేందుకు వీలుగా ఉద్యోగులకు ఆప్షన్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. రిజర్వ్ పోలీసులు, క్లూస్‌టీమ్, సిసిఆర్‌బి, ఐటి సెల్, ఎస్‌బి, మినిస్టీరియల్ సిబ్బంది నుంచి అంగీకారం కూడా తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. భార్యాభర్తల ఉద్యోగాలు, పిల్లల చదువులు ప్రాతిపదికగా తీసుకొని విభజనలో వెసులుబాటు కల్పించేందుకు వీలుగా ముందస్తు ఆప్షన్స్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా హైదరాబాద్ కమిషనరేట్‌ను కూడా రెండుగా విభజించాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. సికిందరాబాద్ జిల్లాగా మారుస్తుండడంతో సిటీ కమిషనరేట్‌ను రెండుగా చేసి పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి, డిజిపి తగు సమాచారం సేకరించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి కావలసిన వనరులు, సిబ్బంది తదితర అంశాలపై సమగ్ర నివేదిక అందజేయాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం.