తెలంగాణ

లక్ష ఇళ్లకు గ్యాస్ పైప్‌లైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: రానున్న రెండేళ్ళలో హైదరాబాద్‌లో పైప్ లైన్ ద్వారా లక్ష గృహాలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రి ధరేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ళ పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ‘వికాస్ పర్వ్’లో భాగంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంచి నీరు, పారిశుధ్య మంత్రి రాంకృపాల్ యాదవ్ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రామగుండం ఫెర్టిలైజర్‌కు త్వరలో ప్రత్యేక గ్యాస్ పైపులైన్ వేస్తామన్నారు. మల్లవరం నుంచి రామగుండం వరకూ నిర్మించనున్న పైప్‌లైన్ పనులను త్వరలో ప్రారంభిస్తామని, ఈమేరకు టెండర్లు పిలిచామన్నారు. వచ్చే రెండేళ్ళలో పైప్‌లైన్ ద్వారానే లక్ష ఇళ్లకు గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి ఐదు లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు పైప్ లైన్ ద్వారా ఇస్తామన్నారు. దీనికోసమే పారాదీప్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఈ లైన్ ద్వారా డీజిల్, పెట్రోలు, కిరోసిన్ తరలిస్తామన్నారు. రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీకి త్వరలో ప్రత్యేక గ్యాస్ పైప్ లైన్ వేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో 13 ఏళ్ళలో భాగ్యనగర్ గ్యాస్ పైన్ లైన్ ద్వారా 1140 గృహాలకు మాత్రమే వంట గ్యాస్ సరఫరా కావడం విచారకరమని ధరేంద్ర ప్రదాన్ అన్నారు. హైదరాబాద్‌లో సిఎన్‌జి వాహనాలు కేవలం 23 వేలే ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో 10 లక్షల సిఎన్‌జి వాహనాలున్నాయని చెప్పారు. కాలుష్య నియంత్రణకు హైదరాబాద్‌లో సిఎన్‌జి వాహనాల వినియోగాన్ని పెంచుతామన్నారు. గ్రీన్ ట్రాన్స్‌పోర్టు సిస్టం కింద 2016-19 సంవత్సరాల మధ్య 5 కోట్ల ఎల్‌పిజి కనెక్షన్లు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన చెప్పారు. ఈమేరకు ఈ ఏడాది 2 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించడం జరిగిందని, వచ్చే ఏడాది 3 వేల కోట్లు, తర్వాత మొత్తం 8 వేల కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. దీనికి తుది గడువంటూ ఏమీలేదని, ప్రజల అవసరాన్ని బట్టి పెంచుతూనే ఉంటామన్నారు. సిఎన్‌జితో పోలిస్తే పిఎన్‌జి అంత లాభసాటి కాదన్నారు. కెజి బేసిన్‌లో గ్యాస్ లభ్యత తక్కువగా ఉంది కాబట్టి కొన్ని గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లను ఉపసంహరించుకున్నామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈస్ట్- కోస్ట్‌లో ఉండే గ్యాస్ విలువ ఖరీదైనదిగా ఉందన్నారు.
కెజి బేసిన్‌లో అనే్వషణ
కెజి బేసిన్‌లో లక్ష కోట్ల సంపద ఉందని, దీనికోసం అనే్వషణ కొనసాగుతున్నదని, సముద్రంలో 5 వేల మీటర్ల అడుగును 480 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని చెప్పారు. ఇది లభ్యమైతే ఉపరితలంపైకి తేగలిగితే తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. గ్యాస్ హైడ్రెడ్ లభించిందన్నారు. ఇప్పటికిప్పుడు లాభసాటిగా కనిపించదన్నారు. అమెరికాలో కూడా సేల్‌గ్యాస్ లభించినప్పుడు పెద్దగా ఆసక్తి కనబరచలేదని, రాను రాను దాని విలువ తెలిసిందన్నారు. ఒఎన్‌జిసి, రిలయన్స్, జిఎస్‌పిసి ధరలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
ఆడిట్ చేయాల్సింది ప్రజలే
తమ రెండేళ్ళ ప్రభుత్వ పాలనను ఆడిట్ చేయాల్సింది ప్రజలేనని ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. లోగడ యూపీఏ హయాంలో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని విమర్శించారు. అవినీతిని నిర్మూలించామని, కుంభకోణాలు లేవని చెప్పారు. జన్‌ధన్ కార్యక్రమం ద్వారా సుమారు 22కోట్ల బ్యాంకు అకౌంట్లను తెరిపించామని తెలిపారు. కరెంటులేని 18 వేల గ్రామాలకు కరెంటు ఇవ్వబోతున్నామని చెప్పారు. పేదలకు 5 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి ప్రదాన్ తెలిపారు.
తెలంగాణకు సహకారం
కేంద్ర మంత్రి రాంకృపాల్ యాదవ్ మాట్లాడుతూ ఇంటింటికి మంచి నీటి కనెక్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరిస్తామని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణానికి 12 వేల రూపాయల చొప్పున కేంద్రం ఇస్తుందని చెప్పారు. పాఠశాలల్లో తప్పకుండా నిర్మించాలని అన్నారు. మరుగుదొడ్లు లేక కొంతమంది బాలికలు పాఠశాలకు వెళ్ళడం మానేశారని తెలిపారు. సిఆర్‌పిఫ్ వంటి కేంద్ర పోలీసు బలగాల ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, ఆ పార్టీ శాసనసభాపక్షం నాయకుడు జి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.