తెలంగాణ

హరీశ్‌ను కలిసిన కోమటిరెడ్డి..పిసిసి చీఫ్ ఉత్తమ్‌పై నిప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 4: దక్షిణ తెలంగాణలో టిఆర్‌ఎస్ విస్తరణకు సవాల్‌గా మారిందని భావిస్తున్న నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేగింది. గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వలలో చిక్కిన జిల్లా కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శల దాడులకు దిగుతు రోడ్డున పడ్డారు. నేను ముందంటే నేను ముందు కారెక్కుతానంటు పోటీలు పడుతు కాంగ్రెస్ శ్రేణులను గందరగోళంలోకి నెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, గుత్తాలలో ఎవరైన తమ పార్టీలోకి వస్తే బాగుండనుకున్న టిఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఏకంగా వారిలో ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని వద్ధనాలో అన్న నిర్ణయాత్మక స్థానంలో సగర్వంగా నిలబడింది. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు, సిల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లుగా కొన్ని రోజులుగా జోరుగా ప్రచారంలో ఉంది. తాజాగా సీఎం కెసిఆర్‌ను ఎంపి గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావు కలిశారు. కెసిఆర్‌తో భేటీ పిదప ఇక గుత్తా టిఆర్‌ఎస్‌లో చేరుతారన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. పైకి యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్వాసితుల గూర్చి, జిల్లా విభజన సమస్యలపై కలిశామని వారు చెప్పినా పార్టీ మార్పు కోసమే ప్రధాన చర్చగా సాగినట్లుగా రెండు పార్టీల శ్రేణుల్లో ప్రచారం సాగింది. ఎంపి పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరుతానని ఎమ్మెల్సీ, మంత్రి పదవితో పాటు జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలన్న గుత్తా ప్రతిపాదనలపై కెసిఆర్ సానుకూలంగా స్పందించి గుత్తాకు పార్టీలో చేరికపై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఎంపి పదవికి గుత్తా రాజీనామా అంశంపై మరోసారి చర్చించే ఉద్దేశంతో గుత్తా చేరిక ఆలస్యమవుతోంది.
కోమటిరెడ్డికి నో చాన్స్ !
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరికపై నెల రోజుల ముందుగానే సిఎం కెసిఆర్‌తో చర్చలు జరిపి ఈ నెల 6న కారెక్కేందుకు సిద్ధమవ్వగా ఎంపి గుత్తా ఎపిసోడ్ కోమటిరెడ్డి చేరికకు ఆటంకంగా మారింది. మంత్రి పదవి, బ్రహ్మణ వెల్లంల-ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు పూర్తి, వచ్చే ఎన్నికల్లో అనుచరులకు టికెట్ల కేటాయింపులపై కెసిఆర్ నుండి కోమటిరెడ్డి హామీలు పొందారు. అయితే కోమటిరెడ్డి గత నెల రోజులుగా అమెరికాలో ఉన్న సమయంలో చకాచకా మారిన పరిణామాల మధ్య గుత్తా, భాస్కర్‌రావు కోమటిరెడ్డి కంటే ముందుగానే కార్కెక్కేందుకు సిద్ధమవ్వడం కోమటిరెడ్డిని షాక్‌కు గురిచేసింది. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు ఇప్పటికే టిఆర్‌ఎస్‌లో ఉన్న కోమటిరెడ్డి వ్యతిరేక వర్గీయులంతా కోమటిరెడ్డిని టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవద్ధని, ఎంపి గుత్తానే చేర్చుకోవాలంటు కెసిఆర్, హరీష్‌రావుల వద్ధ తమ వాదనలు గట్టిగా వినిపించారు. గుత్తా రాకపోతే కోమటిరెడ్డిని చేర్చుకోవాలనుకున్న కెసిఆర్ ఇప్పుడు గుత్తా టిఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధపడటంతో కోమటిరెడ్డి చేరికకు రెడ్ సిగ్నల్ చూపినట్లుగా రెండు పార్టీల శ్రేణుల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. గతంలో టిడిపిలో సమకాలికులుగా పనిచేసిన కెసిఆర్, గుత్తా మధ్య ఉన్న అనుబంధం గుత్తాకు టిఆర్‌ఎస్‌లో చేరికకు కలిసివచ్చిందని భావిస్తున్నారు.
కాగా, టిఆర్‌ఎస్‌లో చేరికపై నెలకొన్న ప్రతిష్టంభనపై కోమటిరెడ్డి శనివారం హుటాహుటిన మంత్రి హరీష్‌రావును కలిసి తాజా పరిణామాలపై చర్చించారు. ఈ భేటిలో కోమటిరెడ్డికి టిఆర్‌ఎస్ నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం ఆయనలో తీవ్ర అసహనాన్ని రేకెత్తించింది. ఉత్తమ్, జానా, గుత్తాలు తనను కాంగ్రెస్‌లో ఎదుగనివ్వకుండా, ఇటు టిఆర్‌ఎస్‌లో చేరనివ్వకుండా రాజకీయంగా దెబ్బకొట్టారంటు ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో హరీష్‌రావుతో భేటీ పిదప వెంకట్‌రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి పిసిసి చీఫ్ ఉత్తమ్ కారణమంటూ విరుచుకపడ్డారు. అటు సరిగ్గా ఇదే రోజున నల్లగొండలో ఎలిమినేటి మాధవరెడ్డి పోలీస్ ఆడిటోరియం భవనంపై గుత్తా పేరుతో పాటు ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరును శనివారం ఎవరో తొలగించడం గుత్తా, కోమటిరెడ్డి మధ్య వర్గపోరుకు మరింత ఆజ్యం పోసింది. వెంకట్‌రెడ్డి పేరు తొలగింపు గుత్తా వర్గీయుల పనేనంటు ఆడిటోరియం ముందు వెంకట్‌రెడ్డి అనుచరులు ధర్నాకు దిగి జిల్లా అధికారులకు ఫిర్యాదు సైతం చేశారు. ఈ నేపథ్యంలో గుత్తా, కోమటిరెడ్డి మధ్య వర్గపోరు కాంగ్రెస్ పార్టీలో తుఫాన్‌లా తయారైంది. అటు జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ఎదురుచూస్తున్న టిఆర్‌ఎస్‌కు గుత్తా, కోమటిరెడ్డిల పార్టీ మార్పు వివాదం కాస్తా ఆయాచిత వరంలా కలిసివచ్చింది. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లుగా జిల్లాలో టిఆర్‌ఎస్ బలోపేతానికి మంచి రోజులొచ్చాయంటూ టిఆర్‌ఎస్ వర్గాలు కాంగ్రెస్ వర్గపోరును వినోదంగా చూస్తున్నాయి.