తెలంగాణ

ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మే 25: టెన్త్, ఇంటర్ చదువులు పూర్తిచేసుకున్న పిల్లలను ఇంటర్, బిటెక్‌లలో చేర్పించేందుకు వెళ్తూ రెండు కుటుంబాల్లోని ఐదుగురు రోడ్డు ప్రమాదంలో అసువులు బాశారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం టేక్రియాల్ వద్ద 44వ జాతీయ రహదారిపై ఉదయం 8.45కు ఈ ప్రమాదం సంభవించింది. దేవున్‌పల్లి ఎస్‌ఐ సంతోష్‌కుమార్ కథనం ప్రకారం జిల్లాలోని నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి చెందిన గంగిణి ప్రవీణ్‌కుమార్ (40), అతని కుమారుడు గంగణి భరత్ (14), కుమార్తె గంగిణి నిఖిత (17), వీరితో పాటు ఆర్మూర్ మండలం అలూరు గ్రామానికి చెందిన మిత్రుడు లక్ష్మణ్ (35), అతని కుమారుడు అర్షిత్ (17) నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తున్నారు. మార్గంమధ్యలో కామారెడ్డి బైపాస్ రోడ్డువద్ద క్రాసింగ్‌లో రెండు లారీల నడుమ చిక్కుకుని కారు నుజ్జునుజ్జయంది. దీంతో సంఘటన స్థలంలోనే ఐదుగురూ మరణించారు. ఇద్దరు మిత్రుల పిల్లలు ఎస్‌ఎస్‌సి, ఇంటర్ పాస్‌కాగా ఉన్నత చదువుల నిమిత్తం వారిని హైదరాబాద్‌లోని కళాశాలల్లో చేర్పించాలని బయలుదేరారు. హైదరాబాద్ వెళ్తున్న వీరు మార్గమధ్యలో ఉన్న కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్‌లో ఉంటున్న ప్రవీణ్ తమ్ముని కలిసిన తర్వాత కామారెడ్డి బైపాస్ రోడ్డు వైపు కారు దాటేందుకు ప్రయత్నిస్తుండగా, వెనుక నుండి వచ్చిన లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. అదే సమయంలో బైపాస్ రోడ్డువైపు ఉన్న జాతీయ రహదారిలో హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వేగంగా వస్తున్న లారీ సైతం కారును ఢీకొట్టగా రెండు లారీల నడుమ కారు ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మిత్రులు, వారి పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రవీణ్‌కుమార్, లక్ష్మణ్ ఇద్దరూ తెరాసకు చెందిన వారని సమాచారం. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే డిఎస్పీ భాస్కర్, టౌన్ సిఐ శ్రీనివాస్‌రావు, రూరల్ సిఐ కోటేశ్వర్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన తరువాత జాతీయ రహదారిపై అరగంట పాటు నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించారు. సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించిన మంత్రి, విప్ ప్రమాదం గురించి వాకబు చేశారు. పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ట్రాక్టర్‌లో తరలించారు. ప్రమాదానికి కారకులైన లారీ డ్రైవర్లు ఇద్దరూ పరారీలో ఉండటంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
chitram..
రోడ్డు ప్రమాదంలో రెండు లారీల మధ్య చిక్కుకుని నుజ్జునుజ్జయన కారు