రాష్ట్రీయం

థర్మల్ ప్లాంట్‌కు అభ్యంతరాలపై కలవరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆశనిపాతంగా పర్యావరణ అభ్యంతరాలు
* 25వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిపై ప్రతికూల ప్రభావం!

నల్లగొండ, నవంబర్ 26: నల్లగొండ జిల్లాకు తలమానికంగా నిలుస్తుందనుకున్న దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు చెంతనే నీటి వనరుగా ఉందనుకున్న మూసీ నది అనూహ్యంగా అడ్డంకిగా మారడం ప్లాంట్ భవితవ్యంపై ఆందోళన రేకెత్తించింది. థర్మల్ ప్లాంట్‌ను మూసీ నది సమీపంలో నిర్మించ తలపెట్టడం పర్యావరణ, జల కాలుష్య కారకమవుతుందంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రిత్వ శాఖ అభ్యంతరాలు పెడుతూ పర్యావరణ అనుమతులు వాయిదా వేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. థర్మల్ ప్లాంట్‌ను ప్రస్తుత ప్రతిపాదిత స్థలంలో కాకుండా మరోచోటికి తరలించడంపై సాధ్యాసాధ్యాలు చూసుకోవాలంటూ సలహా ఇవ్వడం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలను, జెన్‌కో యంత్రాంగాన్ని కలవరపెట్టాయి. జిల్లాలో ఒక భారీ విద్యుత్ ప్రాజెక్టు వస్తుందనుకున్న జిల్లా ప్రజలకు కేంద్రం పెట్టిన పర్యావరణ అభ్యంతరాలు ఆశనిపాతంగా మారాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఇంకెన్ని కష్టాలు ఎదురవుతాయో, ఎప్పటిలోగా అనుమతులు సాధిస్తారోనన్నదీ ప్రశ్నార్ధకంగా మారింది. అయితే యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పెట్టిన అభ్యంతరాల పరిష్కారం దిశగా జెన్‌కో అభ్యర్థన మేరకు సబ్ కమిటీ వేయడం ప్లాంట్ భవితవ్యంపై ఆశలను సజీవంగా నిలిపింది. సబ్ కమిటీ ఏర్పాటు, క్షేత్ర స్థాయి పరిశీలన, నివేదిక తదితర తతంగాలు ఎప్పటికి పూర్తవుతాయో, ప్లాంట్ నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో, అసలు కమిటీ ప్లాంట్ ఏర్మాటుకు సానుకూల నివేదిక ఇస్తుందో లేదోనన్న బెంగ జిల్లావాసుల్లో నెలకొంది. జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాలెం-దిలావర్‌పూర్ గ్రామాల పరిధిలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్ధ్యంతో యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు గత జూన్ 8వ తేదిన సీఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ థర్మల్ ప్లాంట్‌ను తెలంగాణ జెన్‌కో నిర్మించనుంది. ఇందుకోసం 5,548 ఎకరాల భూసేకరణ అవసరముండగా కేంద్ర అటవీ శాఖ నుండి 4 వేల ఎకరాల మేరకు పరస్పర భూ బదలాయింపు కూడా సాగింది. మిగిలిన భూముల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ యాదాద్రి థర్మల్ ప్లాంట్ స్థాపనకు మూసీ జల కాలుష్యం ప్రమాదం పేరుతో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు జెన్‌కోకు మింగుడు పడనిదిగా మారింది. యాదాద్రి థర్మల్ ప్లాంట్ స్థలం ఎంపికలో, అలాగే కేంద్రం నుండి పర్యావరణ అనుమతుల సాధనలో ప్రభుత్వం, జెన్‌కోలు తగిన కసరత్తు చేయడంలో తప్పడగులు వేశాయా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ రేకేత్తుతోంది. కృష్ణా, మూసీ నదిని యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నీటివనరుగా చూపిన జెన్‌కో జలకాలుష్యంపై ఎదురయ్యే అభ్యంతరాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కాలేకపోవడం విమర్శలకు గురవుతోంది. ఇప్పటికే మూసీ నది జలాలు కాలుష్య కాసారంగా మారడాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ అనుమతుల కమిటీ గట్టిగా పరిశీలనలోకి తీసుకోవడం గమనార్హం. అయితే యాదాద్రి థర్మల్ ప్లాంట్‌తో పాటు రామగుండం ఎన్‌టిపిసికి కూడా పర్యావరణ అనుమతులు వాయిదా పడడంపై కూడా తెలంగాణ ప్రాజెక్టుల పట్ల కేంద్రం వివక్షా పూరిత వైఖరి కోణంలో సైతం టిఆర్‌ఎస్ వర్గాలు పరిశీలన సాగిస్తుండడం విశేషం. రెండు భారీ థర్మల్ ప్లాంట్‌లకు కేంద్రం పెట్టిన అభ్యంతరాలతో వాటి నిర్మాణంలో ఆలస్యమైతే 2019 నాటికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధన సాధ్యాసాధ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన సైతం వినిపిస్తోంది.