Others

ఎముకల అమరికతో మెరిసే పళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిందిటివారం పళ్లు విరిగితే ఏం చెయ్యాలో చదివేరు. ఈ వారం ఎముకలు విరిగితే ఏం చెయ్యాలో చదవండి.
ప్రమాదాల్లో ఇంకా కొట్టాటలో మొహానికి దెబ్బ తగిలే అవకాశం ఎక్కువ. ఆ దెబ్బ గట్టిగా తగిలితే మొహంలోని ఎముకలు విరిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా దెబ్బ తగిలిన సందర్భాల్లో మొహంమీద వాపు, చర్మానికి గాయాలు సహజం కానీ చర్మం కిందనున్న ఎముకలు విరిగాయా లేదా అన్నది చెప్పడం అంత సులభం కాదు. వాపులో మనం ఎముకలని తాకి విరిగాయా లేదా అని పరిశీలన చెయ్యడం నొప్పితో కూడుకున్న పని. చాలామంది పేషెంట్స్ దానికి సహకరించకపోవచ్చు. అందుకే అన్ని ప్రమాదాల్లో మొహానికి గాయం అయినపుడు ఎక్స్‌రేలు కాని సిటి స్కాన్(ప్లెయిన్)గాని తీసుకుని ఎముకలు విరిగాయా లేదా అని నిర్థారించుకోవాలి.
ఏ ఎముకలు విరిగినపుడు ఎలాంటి కష్టాలు ఉంటాయి
కింది దవడ : ఇది విరిగినపుడు నోరు తెరవడం కష్టంగా ఉంటుంది. నోరు వంకరగా తెరుచుకుంటుంది. కొందరిలో నోరు మొత్తంగా మూయటం కుదరదు. కింది దవడ పళ్లు, పైదవడ పళ్లు కొన్ని చోట్ల కలుసుకోవు. దీనివల్ల తినడం కష్టం అవుతుంది. కింది పెదవికి తిమ్మిరి వచ్చే ప్రమాదం కూడా ఈ ఎముక విరగడంవల్ల కలగవచ్చు.
పైదవడ: పైదవడ విరిగినపుడు పైపళ్లు ఇంకా కింది పళ్లు కలవక తినడం, కొరకడం కష్టమవుతుంది. పైదవడ మొత్తం విరిగితే అప్పుడది నోట్లో ఊగుతూ, నొప్పిగా, తినడానికి మింగడానికి చాలా ఇబ్బందిగా వుంటుంది.
బుగ్గ ఎముకలు: ఇవి విరిగినపుడు బుగ్గకి తిమ్మిరి రావచ్చు. సహజంగా ఎత్తుగా కనిపించే బుగ్గ లోపలికి పోతుంది. ప్రమాదం జరిగిన తర్వాత వాపు వల్ల అలా కనిపించకపోయినా క్రమేపి వాపు తగ్గిన వారం రోజుల్లో వెనక్కి జారిపోయిన లోపం కనిపిస్తుంది. అది చూడటానికి అంత ఆకర్షణీయంగా ఉండదు. చాలా వెనక్కి గనక బుగ్గ ఎముకలు దిగిపోతే అవి కింది దవడకి అడ్డుగా మారి నోరు తెరవడం కష్టమవుతుంది.
ముక్కు ఎముకలు: ఇవి విరిగినపుడు ముక్కులోపలికి పోయినట్టు కనిపిస్తుంది. ముందు వాపువల్ల తెలియకపోయినా వాపు తగ్గగానే ముక్కుమీద గుంట కనిపిస్తుంది. చాలా లోపలికి పోయిన వారిలో ఊపిరి తీయడం కష్టం అవుతుంది. రెండు కళ్లమధ్య దూరం పెరుగుతుంది.
కంటి చుట్టు ఉండే ఎముకలు: ఇవి విరిగినపుడు చూసినవన్నీ రెండుగా కనిపించే ప్రమాదం ఉంది. కనుపాప సునాయాసంగా అన్ని వైపులా తిరగకపోవచ్చు. కంటి గుడ్డు లోపలికి పోవడం లేక బాగా బయటకు రావడం లాంటిది జరగచ్చు.
నుదుటి ఎముక: ఈ ఎముక విరిగినపుడు నుదుటిపై గుంట పడుతుంది. వాపు తగ్గాక అది కనిపిస్తుంది. చాలా లోతైన గుంట పడితే అప్పుడు మెదడులోని ద్రవాలు ముక్కులోంచి కారే ప్రమాదం ఉంది. దానిని చాలా శ్రద్ధగా చికిత్స చెయ్యాల్సి వస్తుంది.
చిక్కులు తెలుకున్నాం ఇపుడు వాటికి చెయ్యాల్సిన చికిత్స చూద్దాం
కింది ఇంకా పైదవడ చికిత్స: ఒకప్పుడు పైదవడ కానీ కింది దవడ విరిగినపుడు, వాటి పళ్లని తీగలతో సరైన స్థానంలో పెట్టి కట్టేసేవారు. నోరు ఒక అంగుళం కూడా తెరుచుకోదు. 4 నుంచి 6 వారాలు అలానే ఉంచేసేవారు. ఈ సమయంలో తినడం ఉండదు. తాగడమే. ఏదైనా సరే మిక్సీలో రసం చేసుకొని తాగాలి. బాధితుడు ఆ నోరు కట్టేసిన 4 నుంచి 6 వారాల్లో 8 నుంచి 10 కేజీల బరువు తగ్గేవాడు. లావు తగ్గాలనుకున్న వారికి ఇది ఓ వరంలా ఉండేది. మిగతా వారికి శాపమే!
కాలంతోపాటు చికిత్సా విధానం మారింది. ఇపుడు విరిగిన ఎముకలని సరైన స్థానంలో పెట్టి, పైపళ్లు ఇంక కింద పళ్లు సరిగ్గా కలుస్తున్నాయో లేదో అని నిర్థారించుకొని ఆ విరిగిన ఎముకలని ప్లేట్స్, స్క్రూస్ సహాయంతో స్థిరీకరణ చేస్తున్నారు. ఒకలా చూస్తే ఇది వడ్రంగి పని.ఈ ఎముకల వరకు వెళ్లడానికి ప్రమాదంలో చర్మం మీదపడిన గాయాలని వాడతారు. చర్మంమీద ఏ గాయం (కోసే గాయం) పడనపుడు నోట్లోంచి వెళ్ళే ప్రయత్నం చేస్తారు.చిన్న పిల్లల్లో ఇంక ముసలివారిలో సాధ్యమైనంత వరకు ఆపరేషన్ చెయ్యకుండా, ఎముకల మీద ఎక్కువ భారం పడకుండా ఉండేలా మెత్తటి ఆహారం తినమని సూచన ఇస్తారు. ఇలా 3 నుంచి 6 వారాలు పాటించాల్సి వస్తుంది. చిన్నపిల్లలలో ఎంత త్వరగా నోరు తెరవడం ఇంకా వాడటం (2 వారాలు తరువాత) మొదలుపెడితే అంత మంచిది. అలా చెయ్యకపోతే కింది దవడ పైదవడకు అతుక్కుపోయి నోరు తెరుచుకోలేకపోవడం వంటి ప్రమాదం వచ్చే అవకాశం వుంది.
బుగ్గ/ముక్కు/నుదుటి ఎముకల చికిత్స
బాగా లోతుగా గనుక ఎముకలు దిగిపోతే తిరిగి వాటిని పైకి లేపి, వాటిని సరైన స్థానంలో ప్లేట్స్ అండ్ స్క్రూస్స్‌తో స్థిరీకరణ చెయ్యాల్సి వస్తుంది. ఈ ఎముకల వరకు వెళ్లడానికి అప్పటికే ఉన్న గాయాలను వాడే ప్రయత్నం చేస్తారు. ఈ గాయాలు లేకపోయినా ఎముకలు విరిగిన చోటు నుంచి దూరంగా ఉన్నా అపుడు నోట్లోంచి గాని, చెవిలోంచిగాని కనుబొమలు మధ్యలోంచి గాని జుత్తులోంచిగాని వెళ్ళే ప్రయత్నం చేస్తారు.
కొన్నిసార్లు వాపువల్ల ఎముకలు సరైన మోతాదులో పైకి వచ్చాయో లేదో డాక్టర్లకి తెలియకపోవచ్చు. ఆపరేషన్ తరువాత 2 నుంచి 3 వారాల్లో వాపు తగ్గాక మనకా లోపం కనిపించవచ్చు. కొంచెం ఎక్కువ పైకి లేచినా లేక కొంచెం లోపలికి ఉన్నా అపుడు తిరిగి కరెక్షన్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. ఇది అవసరమైతే 2 నుంచి 3 నెలల తరువాత చేస్తారు (మొదటి ఆపరేషన్ నుంచి).
కంటి ఎముకల చికిత్స
ఈ కంటి చుట్టూ ఉన్న ఎముకలు విరిగినపుడు, కనుపాపను కదిలించే కండలు ఆ విరిగిన ఎముకల మధ్య ఇరుక్కొని నలిగిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల కనుపాప అన్ని దిశల్లో ప్రమాదం ముందు కదిలినట్లు కదలలేదు. ఆ సందర్భాలలో ఆ కండను మెల్లగా ఎముకల మధ్య నుంచి బయటకు తెచ్చి మళ్లీ తిరిగి ఇరగకుండా కండకి ఇంకా విరిగిన ఎముకి మధ్య ఏదైనా అడ్డు పెట్టాల్సి వస్తుంది. మిగతా చుట్టూ ఉండే ఎముకలకి పై చెప్పిన విధంగా చికిత్స చెయ్యాలి.
ఆపరేషన్ తరువాత పాటించాల్సిన నియమాలు
* స్థిరీకరణ చేసిన ఎముకల మీద భారం పడకుండా చూసుకోవాలి. పడుకున్నపుడు ఎక్కువ శ్రద్ధ వహించాలి.
* 4 నుండి 6 వారాలు గట్టి పదార్థాలు తినకూడదు.
* ఎముకలు అతుక్కోవడానికి 4 నుంచి 6 వారాలు పడుతుంది.
* ఎముకలు అతుక్కున్న తరువాత వాటిని స్థిరీకరణ చేసేందుకు వాడిన ప్లేట్స్ అండ్ స్క్రూస్ తీయాల్సిన అవసరం ఉండదు. కొందరిలో కొన్ని అనివార్య కారణాలవల్ల తీయాల్సి వస్తే అది ఆపరేషన్ జరిగిన 3 నెలల తరువాత తీసే ప్రయత్నం చేస్తారు.
గతంలో రోడ్డు ప్రమాదంలో ఎముకలు విరిగినా ఆపరేషన్ చేయించుకోనివారు ఏం చెయ్యాలి?
వీరి ఎముకలు తప్పు స్థానంలో అతుక్కుపోయి ఉంటాయి. అలాంటివారిలో ఏదో లోపమో లేక కష్టమో వీరిని బాధపెడుతూ ఉంటుంది. ఇలాంటి బాధితుల్లో తప్పుగా అతుక్కున్న ఎముకలని విరగగొట్టి సరైన స్థానంలో పెట్టి స్థిరీకరణ చెయ్యాల్సి వస్తుంది.
చెక్కని కోసి కావాల్సిన విధంగా స్క్రూల సహాయంతో అతికించే వడ్రంగికీ మాకు పెద్ద తేడా లేదు. వాళ్లు ఫర్నీచర్ చేయడానికి చెక్కుతారు, మేము అందంగా మలచడానికి ఎముకలని చెక్కుతాము. (చిత్రం) వైర్లతో అమరిక

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615 , faceclinics@gmail.com