రుచి

పోషకాల పుచ్చకాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవిరాక ముందే మార్కెట్‌లో విరివిగా లభించే పుచ్చపండు దొరికినప్పుడు తప్పక తినాలి. ఇందులో నల్లపుచ్చ, ఆకుపచ్చ తెల్లచారల పుచ్చగా దొరుకుతుంది. ఇది లంకల్లో పాదులుగా పెరుగుతాయి. లోపల ఎర్రగా వుండి ఎర్రగింజలు వుంటాయి. నోరూరించే పుచ్చపండు తింటే వెంటనే ఆకలి తీరినప్పటికీ కాసేపటికే ఆకలి కలిగిస్తోంది. కడుపునొప్పి, జిగట విరేచనాలు పోగొడుతుంది. మూత్రవ్యాధులు నివారిస్తుంది. అజీర్ణం తగ్గి సుఖవిరేచనం అవుతుంది. జీర్ణ శక్తి పెంచుతుంది. వేసవి తాపం తగ్గిస్తుంది. వడదెబ్బ పోగొడుతుంది.

పచ్చడి
పుచ్చకాయ ముక్కలు-4 కప్పులు
ఆవాలు, జీలకర్ర-2 చెంచాలు
మినపప్పు, శనగపప్పు-4 చెంచాలు
పచ్చిమిర్చి-4
ఎండుమిర్చి-3
ఉప్పు-1 చెంచా
కొత్తిమీర కొంచెం
చింతపండు రసం-2 చెంచాలు
బెల్లం-చిన్నముక్క
కొబ్బరి కోరు-1/2 కప్పు
నూనె-5 చెంచాలు
ఇంగువ-శనగబద్దంత
ముందుగా పోపులు వేయించి ప్రక్కనపెట్టాలి. పుచ్చకాయలో ఎర్రభాగం ముక్కల తరగ్గా తెల్లని భాగం వస్తుంది. దీన్ని జాగ్రత్తగా తీసుకుని తరిగి ముక్కలు పెట్టుకోవాలి. ఆకుపచ్చ పెంకులాంటి పొర తరిగి తీసేయాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీలో వేసి అన్నీ కలిపి మిక్సీపట్టాలి. ఇది జారుగా కీరా పచ్చడి మాదిరిగా వస్తుంది. ఇప్పుడు బాణలిలో నూనె వేసి ఇంగువ పాలగించి దీనిలో మిక్సీ పట్టిన ముద్దవేసి నీరు ఇంకిపోయేలా కలపాలి. ఇది దగ్గర పడుతుంది.చివరగా కొబ్బరి కోరు, చింతపండు రసం చేర్చి కలిపి దింపాలి. రెండురోజులు నిల్వ వుంటుంది.

ముక్కల హల్వా
పుచ్చకాయ ముక్కలు-4
శనగపిండి-1 కప్పు
నెయ్యి-1/2 కప్పు
జీడిపప్పు-12
కిస్‌మిస్‌లు-12
ఏలకులు-5
పంచదార-1/2 కప్పు
ఖర్జురం ముద్ద-1 కప్పు
ముందుగా నేతిలో జీడిపప్పు, ఏలకులు, కిస్‌మిస్‌లు వేయించి కలిపి వుంచాలి. ఇపుడు శనగపిండి వేసి వేయించి తీయాలి. ఏలకుల పొడి చేసుకోవాలి. బాణలిలో మిక్సీ పట్టిన పుచ్చరసం వేసి నెయ్యివేసి ఉడకనివ్వాలి. ఇది బుడగలు వస్తుండగా పంచదార శనగపిండి చేర్చి ఉడకనివ్వాలి. దీనిలో వేయించిన జీడిపప్పులు, కిస్‌మిస్‌లు, ఏలకుల పొడి చల్లి దింపి చల్లార్చాలి. పళ్లెంలో పోసి ముక్కలుగా చేసుకోవాలి.

ఆవ పెట్టి కూర
లేత పుచ్చముక్కలు-5 కప్పులు
ఆవాలు-2 చెంచాలు
జీలకర్ర-2 చెంచాలు
మినపప్పు, శనగపప్పు-4 చెంచాలు
ఎండుమిర్చి-2
పచ్చమిర్చి-2
నెయ్యి-2 చెంచాలు
కరివేప-కొంచెం
ఉప్పు-1/2చెంచా
చింతపండురసం-1 చెంచా
నెయ్యివేసి కాగనిచ్చ పోపులు, మిర్చి, పచ్చిమిర్చి కరవేప వేయించాలి. దీనిలో తరిగిన పుచ్చముక్కలు వేసి మగ్గనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత చింతపండు రసం వేసి దింపి చల్లార్చి నూరిన ఆవ పెట్టాలి. ఈ కూర చాలా రుచిగా వుంటుంది.ఇదే పద్ధతిలో అల్లం, మిర్చి, జీలకర్ర ముద్ద చేర్చి కూడా వండవచ్చును.

కస్టర్డ్
పుచ్చకాయ సన్నగా తరిగిన ముక్కలు-4 కప్పులు
ఎండుద్రాక్ష-1 కప్పు
ఖర్జూరం ముక్కలు-1 కప్పు
పంచదార-5 చెంచాలు
పాలు-4 కప్పులు
ఏలకులు-5
కస్టర్డ్ పౌడర్-1 కప్పు
కొబ్బరికోరు-5 చెంచాలు
ముందుగా కాచిన పాలు కొంచెం వెచ్చపెట్టి కస్టర్డ్ పౌడర్, పంచదార, ఏలకులు చేర్చి బాగా కలపాలి. కొబ్బరి కోరు పుచ్చముక్కలు చేర్చి కలపాలి. ఇది బాగా కలిశాక మిగిలిన పళ్ల ముక్కలు చేర్చి కలపాలి. ఈ మొత్తం డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. కొంచెం దగ్గర పడ్డాక ఎండవేళ కప్పులో తింటే మంచి హాయిగా వుంటుంది.

పెరుగు పులుసు
పెరుగు-5 కప్పులు
పుచ్చకాయ తెల్లముక్కలు-4 కప్పులు
మిర్చి-5, పెరుగు-5 కప్పులు
జీలకర్ర-2 చెంచాలు
ఆవాలు-1 చెంచా
ఉప్పు-1 చెంచా
నిమ్మరసం-1/2 కప్పు
కొత్తమీర కొంచెం, నెయ్యి-1 చెంచా
పంచదార-1/2 చెంచా
అల్లం కోరు-2 చెంచాలు
కొబ్బరి కోరు-1 చెంచా
పసుపు-1 చెంచా
ముందుగా బాణలిలో పోపు వేయించి పెరుగుకి నిమ్మరసం కలపాలి. తరిగిన పుచ్చముక్కలు పసుపు వేసి బాణలిలో ఉడికించి చల్లార్చాలి. ఇప్పుడు అన్నీ కలిపి పెరుగులో వేసి అరగంట వుంచిన తర్వత వడ్డించాలి.

కర్డ్ షేక్
పుచ్చపండు ముక్కలు-4 కప్పులు
కొత్తిమీర-కొంచెం
పెరుగు-4 కప్పులు
జీలకర్ర-1 చెంచా
ఉప్పు-1 చెంచా మిర్చి-1
తేనె-1/2 కప్పు
జీడిపప్పులు-12
కిస్‌మిస్‌లు-12
కొబ్బరికోరు-1/2 కప్పు
ఏలకులు-2
అల్లం కోరు-1 చెంచా
ముందుగా పుచ్చకాయ గింజలు తీసి ముక్కలు చేసుకుని పెరుగు, పంచదార, అల్లంకోరు అన్నీ కలిపి మిక్సీపట్టి దీనిపై కొబ్బరి, ఏలకులు, పొడిచల్లి ప్రిజ్‌లో పెట్టలి. బాగా కూల్ అయ్యాక ఎండవేళ తాగితే బాగుంటుంది.

-వాణి ప్రభాకరి