తెలంగాణ

మూసీ తీరం.. ఆందోళనల పర్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: ప్రభుత్వాలు మారినా...సొంత రాష్ట్రం వచ్చినా జిల్లాలోని మూసీ బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వల అసంపూర్తి పనులు పూర్తి కాకపోవడంతో రైతాంగం దశాబ్ద కాలంగా కాల్వల పూర్తికి ఆందోళన పర్వం సాగిస్తూనే ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ కాల్వల పూర్తిపై హామీలు గుప్పిస్తున్న ప్రజాప్రతినిధులు ఎన్నికల పిదప ఏరుదాటేదాకా ఓడ మల్లయ్య..దాటాక బోడి మల్లయ్య చందంగా వ్యవహరిస్తున్నారంటూ మూసీ కాల్వల పరిధిలోని రైతులు వాపోతున్నారు. జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలిచిన ఆరు ఎమ్మెల్యే స్థానాలు కూడా మూసీ తీరంలోని భువనగిరి, నకిరేకల్, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలే కావడం గమనార్హం. స్వరాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే తమకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున పది, ఇరవై కోట్లతో పూర్తయ్యే అసంపూర్తి మూసీ కాల్వలన్నీ ఏడాదిలోగా పూర్తవుతాయన్న ఆశలు క్రమంగా అడుగంటిపోతుండడం రైతులను మళ్లీ ఆందోళన బాట పట్టించింది. విపక్షాల అండతో వరుస ఆందోళనలు సాగిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇరకాటంగా మారింది. ఎన్నికల హామీ మేరకు తొలి ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో అసంపూర్తి మూసీ కాల్వలకు పైసా విదల్చని టిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండో ఏడాది మాత్రం చిన్ననీటి వనరులకు గంప గుత్తగా 220 కోట్ల కేటాయింపులు చూపింది. ఏడాది కాలంగా కాల్వల పనులు ముందుకు సాగకపోవడం నిరాశకు లోనుచేసింది. స్వయంగా ఇరిగేషన్ మంత్రి టి.హరీష్‌రావు పలుమార్లు సమీక్షించినా పురోగతి కొరవడింది. ప్రస్తుతం బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి కాలువల పరిధిలోని పలు గ్రామాల చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరిస్తున్నారు. అయితే ముందుగా తమ అసంపూర్తి కాలువలను పూర్తి చేస్తేనే తమ గ్రామాల చెరువులు నిండుతాయని, కాల్వల పనులు పూర్తి చేయాలంటూ రైతులు వరుస ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. వచ్చే బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించి పనులు జరిపించాలని మూసీ తీర రైతాంగం ఉద్యమిస్తోంది.
దశాబ్దకాలంగా సాగుతున్న మూసీ కాల్వలు
భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని 32 గ్రామాల చెరువులు, కుంటలు నింపుతూ 89 కిలోమీటర్లు సాగుతూ 7500 ఎకరాల ఆయకట్టుకు మూసీ సాగునీరందించే బునాదిగాని కాల్వకు 14.53 కోట్ల అంచనా వ్యయంతో 2005లో మంజూరివ్వగా 2006లో పనులు ప్రారంభమయ్యాయి. భూసేకరణ పరిహారం లేకుండా ముందుగానే రైతులు భూములిచ్చినా నేటికి పదేళ్లుగా కాలువ పనులు పూర్తి చేయలేదు. 2010 వరకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించకపోవడం గమనార్హం. 583 ఎకరాల భూసేకరణకు తొలివితడగా మంజూరైన 3.30 కోట్లు 8 గ్రామాల భూసేకరణకే సరిపడగా 20 గ్రామాల్లో పెండింగ్‌లో పడింది. 2013లో భూసేకరణ, కాలువ పనుల కోసం 25 కోట్ల 76 లక్షలకు అంచనాలు సమర్పించగా 11.5 కోట్లు మంజూరుకాగా సదరు నిధులు సకాలంలో ఖర్చుచేయక మురిగిపోయాయి. ఇప్పటిదాకా 50 శాతం కాలువ పనులు కూడా సాగలేదు. ఇక భువనగిరి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లోని 30 గ్రామాల చెరువులు, కుంటలు నింపుతు 7800 ఎకరాలకు మూసీ సాగునీరందించే లక్ష్యంతో 26.58 కోట్ల అంచనా వ్యయంతో 2006లో చేపట్టిన 63 కిలోమీటర్ల పిల్లాయిపల్లి కాలువ పనులు సైతం అసంపూర్తిగా ఉన్నాయి.
2013లో ఈ కాలువ అంచనా వ్యయం కూడా 42.10 కోట్లకు పెంచగా భూసేకరణ, ప్రధాన కాలువ, పిల్ల కాలువ పనులు నేటికి 60 శాతం కూడా పూర్తి కాలేదు. భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల్లోని 32 గ్రామాల చెరువులు, కుంటలు నింపుతూ 5,827 ఎకరాల ఆయకట్టుకు మూసీ సాగునీరందించేందుకు 44 కిలోమీటర్ల పొడవుతో 6.31 కోట్ల అంచనా వ్యయంతో 2005లో మంజూరైన ధర్మారెడ్డిపల్లి కాలువ కూడా దశాబ్దకాలంగా అసంపూర్తిగా ఉంది. ఇప్పటిదాకా ఆరుకోట్ల మేరకు ఖర్చయినా మరో 2 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి.