సబ్ ఫీచర్

తెలుగు వృద్ధికి పునరంకితం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

తెలుగు భాషను నికోలోకంటి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని, శ్రీనాథుడు కర్ణాట భాష అని, తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుంగు అని, పాల్కురికి సోమనాథుడు జానుతెనుంగు అని ప్రస్తుతించారు. తీయనైన భాష తెలుగు భాష. దేశవిదేశాల్లో ప్రఖ్యాతికెక్కిన తెలుగు భాష మన మాతృభాష కావడం మన తెలుగువారికి గర్వకారణం. నన్నయ, తిక్కన, పోతన మొదలైన కవులంతా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. నేటితరం కవుల వరకు ఆ సాహిత్య వారసత్వ సంపదను పరిరక్షించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు భాష మరిన్ని సొబగులను అద్దుకుంటూ సర్వాలంకృత శోభితయై వెలుగొందుతున్నది. భాషా సౌందర్యంతో నిండిన సామెతలు, లోకోక్తులు, కాకువులు, భాషాపరిజ్ఞానంతో నిండిన అవధానాలు, వివిధ ప్రక్రియలతో నిండిన రచనలు తెలుగుభాష విస్తృతి చెందడానికి తోడ్పడుతున్నాయి.
ప్రసారమాధ్యమాలు, కవులు, రచయిత, సాహితీవేత్తలు, భాషాభిమానుల కృషివల్ల తెలుగు భాష పరిరక్షించబడుతూ వున్న విషయం నిజమే కానీ మరొకవైపు అంతరించిపోబోతున్న భాషల జాబితాలో తెలుగు భాష కూడా ఒకటి అనేటువంటి హెచ్చరికలు భాషాభిమానులను కలవరపెడుతున్నాయి. స్వభాషపై అభిమానం లోపించడం, పరభాషావ్యామోహం, నానాటికీ పెరిగిపోతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ మొదలైనవి ఈ పరిస్థితికి కొన్ని కారణాలు. పరభాషా వ్యామోహంవల్ల ఆ భాషల్లో పాండిత్యం ఎలావున్నా తెలుగు భాష పట్ల గల తేలికభావం పెరుగుతూ వున్నది. ఈ పరిస్థితిని వివరిస్తూ కాళోజీ నారాయణరావుగారు
‘‘ఏ భాష నీది యేమి వేషమురా
ఈ భాష ఈ వేషమెవరికోసమురా
ఆంగ్లమందున మాటలనగనే
ఇంతకుల్కెదవు ఎందుకోసమురా
తెల్గుబిడ్డవయ్యు తెల్గురాదంచును
సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’’
అని తీవ్రంగానే విమర్శించారు. నిజమే, తెలుగువారై వుండి తెలుగురాదని చెప్పడాన్ని నాగరికతగా భావించేవారి సంఖ్య అనేకం. దీనిని నివారించేందుకు తెలుగువారే పూనుకోవాలి. అమ్మలాంటి అమ్మభాషపైన అభిమానాన్ని కలిగి వుండాలి. తెలుగు మాట్లాడేవారిని ప్రోత్సహించాలి. తెలుగు భాషను, తెలుగు మాట్లాడేవారిని కించపరచడం, చిన్నచూపుచూడడం మానుకోవాలి. పరభాషల పట్ల ఆసక్తిచూపడంలో తప్పులేదు కానీ స్వభాషను కూడా సమాదరించాలి. తెలుగుభాషతో ప్రమేయం లేకుండానే తెలుగు నేలలో తర్ఫీదునివ్వాలి. విద్యార్థులకు తెలుగులో కనీస పరిజ్ఞానం వుండేలా చర్యలు తీసుకోవాలి. తెలుగుపై ఆసక్తిని కలిగిస్తూ తప్పులులేకుండా చదవడం, వ్రాయడంలో శిక్షణనివ్వాలి. తెలుగు అభ్యసించినవారు ప్రావీణ్యాన్ని మెరుగుపరచుకోవాలి. పాండిత్యము, నైపుణ్యము కలిగినవారికి తగిన అవకాశాలను కల్పించాలి. తెలుగు మాధ్యమ పాఠశాలలు మూతపడే స్థితికి చేరుకోవడంతో ఇకపై తెలుగుభాష చక్కగా విలసిల్లుతుంది అనే గోరంత ఆశ కాస్తా కొండెక్కి కూర్చుంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుభాషను రక్షించుకోవలసిన అవసరం పెరిగింది. ఉచ్చారణలోను, వ్రాతలోను చిన్నచిన్న దోషాలను లెక్కచేయక్కర్లేదు. అదే ఉదాసీన వైఖరితో రాబోయే కాలంలో ప్రమాదం కలుగుతుంది. దోషాలు సరిదిద్దుకోకుండానే ముందుకు పోతూ వుంటే దోషాలు దోషాలుగానే వ్యాప్తిచెందుతాయి. సరిఅయిన రూపాలు మరుగున పడిపోతాయి. దీన్ని నివారించేందుకు తప్పులను పరిహరించి నేర్వడం తెలుసుకోవాలి.
పరిపాలనా రంగంలో తెలుగును కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై వున్నది, పాలనా సంబంధమైన విషయంలో తెలుగును అమలుజరిగేలా చూడాలి. తెలుగుభాషా జ్ఞానం కలిగిన వారికి ప్రోత్సాహకాలు, ఉద్యోగావకాశాలు మెరుగుపరచాలి. ఉత్తరప్రత్యుత్తరాలు, దరఖాస్తులు మొదలైన అంశాలు తెలుగులోనే వుండేలా చూడాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాలలకు తెలుగు భాషపై మక్కువను పెంచాలి. ఈ రకంగా చేయగలిగితే తేటతెలుగును ముందుతరాల వారికి అందించగలుగుతాము. ప్రాంతాల వారీగా నైతేనేమి, యాసలపరంగా అయితేనేమి తెలుగుభాష విభజించబడినా అది వెలిగించే తెలుగు మాత్రం ఒక్కటే.
‘‘బంగారు పంటలిమ్మని కృపాపరతంత్రకు వృద్ధగౌతమీ గంగకు
మ్రొక్కి తెల్గునయగారమె శీతల వారిధారగా బొంగెడు
తుంగభద్ర మణి బుణ్కి యొయారపువెల్లి గృష్ణవేణింగమనించి యాంధ్రుల కనిందిత జాగృతి నాసచేసెదన్’’
అని పుట్టపర్తి నారాయణాచార్యులవారు కోరుకున్నట్లుగానే ఆంధ్రులు అనిందిత జాగృతిని చేతజిక్కించుకోవాలి. ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా తెలుగువారంతా మరోసారి పునరంకితం కావాలి.

- కె.లక్ష్మీఅన్నపూర్ణ