స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా నేత్రాలయందు, హృదయమందు, మనస్సునందుగల దోషాలను సకల జన మహాసంరక్షకుడగు పరమేశ్వరుడు తొలగించి నన్ను పరిపూర్ణుని చేయుగాక! సకల భువనాలకు ప్రభువైన భగవంతుడు మాకు శాంతి ప్రదాయకుడగుగాక!
వివరణ:- జీవుడు అల్పజ్ఞుడు. అందువలన ఆతడనేకమైన తప్పిదాలను చేస్తాడు. వాక్కును సంభాషించేందుకే భగవంతుడిచ్చాడు. కాని మానవుడు అసత్యం, అశుభం, అసంబద్ధమూ అయిన మాటలను మాటలాడుతూనే ఉంటాడు. ఈ శరీరం సంసార సాగరాన్ని దాటేందుకు ఈయబడింది. కాని మనిషి హింస, దౌర్జన్యం, వ్యభిచారం, అపకారం మొదలయినవి చేసేందుకు వినియోగిస్తూ ఉంటాడు. మనస్సు దైవాన్ని చింతన చేసేందుకనుగ్రహింపబడింది. కాని నరులు ఆ మనస్సుతో పరద్రోహం, ధనాపహరణ, నాస్తికత్వాది చింతనలతో నింపుకొంటూ ఉంటారు. దైవాన్ని దర్శించేందుకు నేత్రాలు గ్రహింపబడ్డాయి. కాని మనిషి ఆ కన్నులతో చూడరాని వానిని చూచేందుకు ఇష్టపడుతూ ఉంటాడు. ఇది సాధారణంగా జనులంతా చేసే పని. కాని విచారణ శీలురు, ఆస్తికులయినవారీవిధంగా ప్రవర్తించి ఎక్కడ తాము కూడ చెడిపోతామో నన్న భీతితో దైవాన్ని సదా ఇలా-
యనే్మ ఛిద్రం చక్షుషో హృదయస్య మనసో వాతితృణ్ణం
బృహస్పతిర్మే తద్ దధాతు॥
‘‘నా నేత్రాలయందు, హృదయంలో-మనస్సులో ఉన్న దోషాల నా లోక రక్షకుడు తొలగించి నన్ను పరిపూర్ణునిగాచేయుగాక’’అని దైవా న్ని ప్రార్థిస్తుంటారు.
ఇట్టి దైవప్రార్థనలు శుక్లయజుర్వేదంలో ఎన్నో కనబడతాయి.
‘దేవకృతస్యైనసో- వయజనమసి’ (శు.య.వే.8-13) ఇంద్రియ కృతమైన దోషాలకు నీవే సంశోధకుడవు.
‘ఆత్మకృతస్యైనసో- వయజనమసి’ (శు.య.వే.8-13) ఆత్మకృతమైన అపరాధాలకు కూడ నీవే సంశోధకుడవు. ఈ ప్రార్థనలన్నింటిలో సమానాంశం భగవానుడు మాలోని దోషాలను తొలగించి పరిశుద్ధులను చేయుగాక అనియే. కళ్లలో లోపముంటే చూపుసరిగా కానరాదు. హృదయంలో అపవిత్ర భావాలుంటే ప్రవర్తన అపవిత్రంగా ఉంటుంది. మనసులో వికృత ఆలోచనలుంటే కార్యాలు విఫలమవుతాయి. కాబట్టి శరీరంలోగాని శరీరావయవాలలోగాని ఏ దోషమూ లేకుండా ఉండాలంటే దానికి కేవలం దైవకృప మాత్రమే ఉండాలని వేదం-
‘శం నో భవతు భువనస్య యస్పతిః’ ‘‘సకల జగద్రక్షకుడైన పరమాత్మయే మాయెడల దయతో శాంతి ప్రదాయకుడగుగాక’’అనే మానవులు చేయదగిన ప్రార్థనను సూచించింది. ప్రభువు కృపయే ప్రాప్తమయితే సకల దోషాలు పటాపంచలవుతాయి. కాబట్టి మానవులారా! మీ దోష నివృత్తికై-
‘అనుమార్ష్టు తన్వో యద్విలిష్టమ్’ (శు.య.వే.8-14)
‘‘మా శరీర గత దోషాలను మా ఆత్మాభివృద్ధి కనుకూలంగా దైవం పరిశుద్ధం చేయుగాక’’అని యజుర్వేదం ప్రార్థించమని శాసిస్తూంది. మనమూ ఆ శాసనాన్ని శిరసావహిద్దామా మరి.
**
విశ్వంలో ఇదే ప్రథమ సంస్కృతి
అచ్ఛిన్నస్య తే దేవ సోమ సువీర్యస్య రాయస్ఫోషన్య దదితారః స్యామ
సా ప్రథమా సంస్కృతిర్విశ్వవారా స ప్రథమో వరుణో మిత్రో- అగ్నిః ॥
భావం:- ఓ పరమాత్మా! ఎడతెగక సాగే మహాశక్తి సంపన్నమైన నీ ధనసమృద్ధిని పొందేవారమూ సమర్పించేవారము మేమే కావాలి. ఆ విధంగా మేము అందరం పొందేందుకు అర్హమైన మొదటి సంస్కృతి వేద సంస్కృతి. పరమాత్ముడవైన నీవే మాకు మొదటి మిత్రుడవు. అందరూ కోరుకోదగిన వరుణుడవు. మమ్ములనందరిని ముందుకు నడిపించే అగ్నివి.
వివరణ:- భగవానుడు నిత్యుడు. ఆయన చేసే దానాలు కూడ అవిచ్ఛిన్నాలే. అయినా ఆయన చేసే దానాలు మాత్రం ఎవరో అదృష్టవంతులకు మాత్రమే ప్రాప్తవౌతాయి. కాని మేమందరము కూడా ఆ భగవత్ప్రదానాలను పొందేవారమూ మరల పరమాత్మకు సమర్పించేవారమూ కావాలని మా కోరిక. ‘దదితారః స్యామ’ భగవానుడికి మేము సమర్పించాలంటే ముందుగా ఆయన ప్రదానం చేయనిది ఆయనకు ఎలా సమర్పించగలం. అందుచేత మాకు మూలధనంగా ప్రప్రథమంగా భగవత్ప్రదానమయిన ధనము వేదమే. ‘సా ప్రథమా సంస్కృతి ర్విశ్వవారా’ ‘‘ఆ మూలధనం అందరూ పొందదగిన సంస్కారమే’’.

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512