తెలంగాణ

దిగజారిన రాజకీయాలు: సురవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం, డిసెంబర్ 4: ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం, మంత్రి పదవులు తీసుకోవడం వంటి విలువలు లేని రాజకీయాలు నేడు రాజ్యమేలుతున్నాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాం గ్రామంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ గులాం రసూల్ సంతాపసభ శుక్రవారం జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పేదలు, గిరిజనుల అభ్యున్నతికోసం అహర్నిశలు పోరాటాలు చేసిన వ్యక్తి రసూల్ అని కొనియాడారు. రాచకొండలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, బిడిఎల్ క్షిపణి వ్యతిరేక పోరాటాలను విజయవంతంగా నిర్వహించి పాలకుల గుండెల్లో నిద్రపోయాడన్నారు. రాజ్యాంగంపై ప్రమాణాలు చేసి నైతిక విలువలు లేకుండా పార్టీలు మారడం హేయమైన చర్యగా సురవరం అభివర్ణించారు. అనైతిక విలువలను చట్టసభల్లోని స్పీకర్లు ప్రోత్సహించే విధంగా మారిపోయాయన్నారు. చట్టసభల్లో పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల స్పీకర్లు నిర్ణయం తీసుకోకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు.
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను శుభ్రం చేయండి
హైదరాబాద్, డిసెంబర్ 4: మురికి కూపాలుగా మారిన ఓల్డ్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను శుభ్రం చేయాలని తెలంగాణ సిపిఎం శాసనసభ పక్ష నేత సున్నం రాజయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత 10 రోజులుగా శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారంతో క్వార్టర్స్ నిండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్వార్టర్లలో పని చేస్తున్న వారిని కొనసాగించేందుకు టెండర్లు ఖరారు కాలేదని కారణం చెప్పి నిలివేయడం వల్ల ఈ సమస్య వచ్చిందని అన్నారు. ఎనిమిదేళ్ల నుంచి పని చేస్తున్న వారిని పనిలో పెట్టుకునేందుకు టెండర్లు ఖరారు కాలేదని ఆపి వేయడం సరికాదని, దీనివల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు నిత్యం తిరుగుతున్నా పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శుల దృష్టికి ఈ విషయం తెచ్చినా టెండర్ల పేరుతో సమస్యను గాలికొదిలేశారని అన్నారు.
చండీయాగం భద్రతను పర్యవేక్షించిన ఐజి
జగదేవ్‌పూర్, డిసెంబర్ 4: మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండల ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలో ఈనెల 23 నుండి అయిత చండీయాగం నిర్వహించనున్న దృష్ట్యా శుక్రవారం ఐజి నవీన్ చందా, ఎస్‌పి సుమతిలు భద్రతాచర్యలను పర్యవేక్షించారు. యాగ నిర్వహణ కోసం పనులు ఏర్పాట్లు కొనసాగుతున్న క్రమంలో యాగానికి రాష్టప్రతి, గవర్నర్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, పీఠాధిపతులు హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈమేరకు భద్రతాచర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. వీరివెంట సిద్దిపేట డిఎస్‌పి శ్రీ్ధర్‌గౌడ్, గజ్వేల్ సిఐ సతీష్, జగదేవ్‌పూర్ ఎస్‌ఐ వీరన్నలు ఉన్నారు.
నల్లమలపై పోలీస్ నిఘా
మహబూబ్‌నగర్, డిసెంబర్ 4: మావోయిస్టు పార్టీ ప్రజా గెరిల్లా ఆర్మీ వారోత్సవాల సందర్భంగా నల్లమల ప్రాంతంపై పోలీసుల నిఘా ముమ్మరంగా కొనసాగుతోంది. ఏటా డిసెంబర్ 2వ తేదీ నుండి మావోయిస్టు పార్టీ ప్రజా గెరిల్లా ఆర్మీ వారోత్సవాను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అయితే, ఈ ఏడాది కూడా దండకారణ్యం ఏఓబి ప్రాంతాల్లో ప్రజా గెరిల్లా ఆర్మీ వారోత్సవాలను ఆ పార్టీ ముమ్మరంగా నిర్వహించాలని కరపత్రాలు, వాల్ పోస్టర్లు, పత్రిక సాధనాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. గతంలో కూడా నల్లమల ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ప్రజా గెరిల్లా ఆర్మీ వారోత్సవాలను నిర్వహించేవారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కదలికలు తగ్గిపోయాయి. అయినా కూడా పోలీసులు ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీ నుండి వారం రోజుల పాటు ఈ ప్రాంతంలో నిఘాను కొనసాగిస్తున్నారు. రాత్రివేళల్లో మద్దిమడుగు రూట్‌లో వెళ్లే బస్సులపై అంక్షలు విధించి అక్కడి నుండి అచ్చంపేటకు ఆ బస్సులను తిప్పి పంపాలని పోలీసులు ఆదేశించారు.
ముగ్గురు రైతుల ఆత్మహత్య
మేళ్లచెర్వు, ఏటూరునాగారం, డిసెంబర్ 4: పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేని నిస్సహాయ స్థితిలో నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో శుక్రవారం ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో పొట్ట కోటేశ్వర్‌రావు (55) పంట కోసం చేసిన అప్పు తీరే దారిలేక ఇంట్లోనే విద్యుత్ వైరును పట్టుకొని ఆత్మహత్యకు చేసుకొన్నాడు. అలాగే, వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం షాపల్లి గ్రామానికి చెందిన గద్దల రామయ్య (56) అనే రైతు పురుగుల మందు తాగి శుక్రవారం మృతి చెందాడు. ఇదే జిల్లా ములుగు మండలం మల్లంపల్లికి చెందిన చిట్టిరెడ్డి జక్కిరెడ్డి (42) అప్పులు తీర్చలేని పరిస్థితిలో మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.