సబ్ ఫీచర్

గ్రంథ రచనకే జీవితం అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ ఆంగ్ల రచయిత విలియమ్ షేక్స్‌పియర్ పరమపదించిన రోజు, తెలుగు కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ గారు జన్మించిన రోజు. ఈ ఇద్దరూ సాహితీవేత్తలే.. ప్రపంచ పుస్తక దినోత్సవం కూడా ఈ రోజే కావడం విశేషం.
‘‘గజమెత్తు గ్రంథ రచన చేయాలని నా సంకల్పం. నా గ్రంథ రచనోద్యోమున్నూ డబ్బుకోసం కాదు. ఎలా కలిగిందో, ఎందుక్కలిగిందో శుద్ధ అజ్ఞాన దశలోనే కలిగింది నాకు గ్రంథాలు రచించి గుట్టలు గుట్టలుగా పెట్టాలన్న సంకల్పం. నేను చెయ్యగలిగినా, చెయ్యలేకపోయినా, దేశీయులు గుర్తించినా..గుర్తించకపోయినా, నా జాతికి నేను చేయవలసిన దోహదం కొంత ఉంది. రచనే అందుకు సాధనం నాకు. అది సాగించాలంటే కొంత చెయ్యి ఆడాలి నాకు. అలా అడ్డానికి బువ్వ కావాలి. కళాజీవి అయిన వాడికి బువ్వ ప్రయోజనం అంతే!’’ అన్నారు శ్రీపాద వారు, తన ఆత్మకథ ‘అనుభవాలూ-జ్ఞాపకాలూను’లో. రచన గొప్పదయితే వికాసం జాతికి, తత్కర్తకు కాదు. రచన చేదయితే నష్టమూ జాతికే, తత్కర్తకు కాదు. సుఖమో, దుఃఖమో-ఇవి మాత్రమే రచయితకందేవి. ఆత్మవిశ్వాసము, కీర్తి కాంక్ష, ద్రవ్యాశ- ఇవి సహజాలు గ్రంథకర్తకు. వప్పుకుంటాను. కానీ వాటికి మించిన హుందాతనమూ, సంయమనమూ-ఇవీ మిక్కిలి అగత్యాలు గ్రంథకర్తకి అని కూడా అన్నారాయన.
అంతేకాదు గ్రంథరచన తామెందుకు చేస్తున్నారో కూడా చక్కగా చెప్పారు. ‘‘జనులకు స్వవిషయము విడమరచి చెప్పడం-ఆత్మగౌరవం అలవరచడం, సహనం కలిగించడం, సరికొత్త భావాలు మప్పడం కొత్త ఆశలు కల్పించడం-గతంలో వుండుకున్న సత్యం ఆవిష్కరించడం, భవిష్యత్తుకు కొత్త దారులు కల్పించడం, తన్మూలంగా దేశీయులందరికీ స్వయం నిర్ణయ శక్తి కలిగించడం, ఇదీ నా పూనిక...అందుకే నా గ్రంథ రచన. జాతికి నవ్య దృక్పథం అలవరచి దేశానికి, తెనుగుదేశానికి భారతదేశంలో మహోన్నత ప్రతిపత్తి కలిగిచడం నా పూనిక అన్నారు.
అది నిర్విఘ్నంగాను, నిరాటంకంగాను, సాగడం, నా లక్ష్యం..జాతికి ప్రాతిపదికలకు భంగంలేని గమ్యం కనపడడం నా ప్రాపకం..అని భావించారు ఆయన.
జీవితమంతా సాహిత్యానికకే అంకితం చేశారు.. ఉద్యోగం బతుకు తెరవుకోసం చేయలేదాయన. రచనలు చేయడంకోసమే తాను పుట్టానన్నట్టు రాయడం, పుస్తక ప్రచురణ..అలా సాగిపోయింది శ్రీపాద జీవితం.
తెలుగులో ‘అ, ఆ...లు నేర్పడం దగ్గర నుంచి వసంత వాచకాల నుంచి రామాయణ భారతాలను మాట్లాడే భాషతో రాయడం వరకూ సాగిందా రచన. చరిత్ర గ్రంథాలు రాశారు, వైద్య గ్రంథాలు రాశారు. చిన్న కథలు రాశారు, నాటికలు రాశారు. నాటకాలు రాశారు, నవలలు రావారు, రూపకాలు రాశారు-బహుముఖీయంగా సాగింది ఆయన గ్రంథ రచన..
చనిపోయే ముందు కుడివైపు పక్షవాతం వచ్చింది.
‘‘నా రచనలు నేను సాపు ప్రతులు రాసి నా జాతికి సమర్పించుకోలేని దుస్థితి..’’ అంటూ బాధపడ్డారు.
ఇటువంటి సాహితీవేత్తను ఆయన జన్మదినం నాడు, ప్రపంచ పుస్తక దినోత్సవం నాడు తలచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

-డా. వేదగిరి రాంబాబు సెల్: 9391343916