సబ్ ఫీచర్

ఈ స్థితి నుండి తెలుగుజాతి బయటపడాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు భారత పాలక వర్గాలు లొంగిపోయి వచ్చే ఏడాదికి 30 ఏళ్లు పూర్తికానున్నది. ఈ లొంగుబాటు పర్యవసానం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్ఫుటమవుతోంది. ఇక నుండి ఈ రాష్ట్రాన్ని ఆంగ్లప్రదేశ్ అని పిలుచుకోవడమే సమంజసంగా ఉంటుంది. ఆంగ్లేయ పాలకులు ప్రత్యక్ష వలస పాలనను వీడి తెర వెనుకకు తప్పుకున్న తర్వాత ఏర్పడిన తొలి భాషాప్రయుక్త రాష్ట్రం, విద్యామాధ్యమాన్ని తన మాతృభాషలో సంపూర్ణంగా రద్దుచేసుకుని ఆంగ్ల భాషా మాధ్యమాన్ని శిరసావహించ పూనుకుంది. 75 ఏళ్ల క్రితపు బ్రిటిష్ ప్రధాని చర్చిల్ ‘‘్భరతీయులు స్వాతంత్య్రానికి అర్హులు కారు’’, అని ప్రకటించిన నాడు అది శే్వత జాతి అహంకారం అని మాత్రమే మనం భావించాం కానీ, మన పాలకులలో గూడుకట్టుకొని ఉన్న బానిస మనస్తత్వపు దళసరి లక్షణాలను అవలోకన చేసుకోలేకపోయాం. మనం సాధించామనుకున్న స్వాతంత్య్రానికి గల మేడిపండు లక్షణాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాం. మన కాళ్లపై మనం నిలబడగలిగిన స్వతంత్ర ఆర్థిక వ్యవస్థనూ కుల- ధనస్వామ్యాలకు వ్యతిరేకమైన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను, మతాలకతీతమయిన లౌకిక సాంస్కృతిక జీవనాన్ని... వాటి నిజమైన అర్థంలో సాదించుకోలేకపోయిన దుష్ఫలితాలు విషాద సన్నివేశాలను ఒక్కటొక్కటిగా చవిచూస్తున్నాం. అందులో భాగమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర భాషా మాధ్యమంలో చదువుకునే అవకాశాలను కోల్పోవటం!
బెంగాల్ రాష్ట్ర విభజన ద్వారా బ్రిటిష్ వలస పాలకులు మత ప్రాతిపదికన భారతీయులను విడగొట్టే పథకంతో 1905లో నాటిన విష బీజాలు మతోన్మాద వటవృక్షాలై ఉపఖండ దేశాల్ని నేడు వెక్కిరిస్తున్నాయి. విభజించి పాలించే విధానాలను నాటి యువతరం ఎదుర్కొన్నట్లే ఈనాడు కూడా ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు, యువజనులు మతాలకు అతీతంగా పౌరసత్త్వ చట్టం పేరిట పెంపొందించనున్న మత విభజన కుట్రలకు వ్యతిరేకంగా చేయిచేయి కలిపి సరికొత్త మలుపుకి దారివేస్తున్నారు. అయితే తెలుగునాట ప్రపంచ బ్యాంకు జీతగాళ్లు ఒకరిమీద ఒకరు పోటీలు పడి ప్రజలను కుల మత ప్రాంతీయ విభేదాలతో పక్కదారులు పట్టించే క్రీడలో ఆరితేరి ఉన్నారు. మాతృభాషా మాధ్యమం రద్దు పరచటంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వానిది తొలి అడుగు కాదు. తనకంటే ముందు పరిపాలించిన వారి విధానాలకు అది చివరి అంకాన్ని జోడించింది. అంతేకాక పాలనా వికేంద్రీకరణ పేరిట అమరావతి రాజధాని విషయంలో కూడా విభజించి పాలించే కుటిల ముఠా రాజకీయాలను ప్రదర్శిస్తున్నారు. ప్రజల రాజధాని పేరిట చంద్రబాబునాయుడు తన సంపన్న, కలగూరగంప ముఠా వ్యాపార ప్రయోజనాలకొరకు తొలి దశలో 33వేల ఎకరాల భూమిని స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. అంతకుముందే శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన సూచనలకు భిన్నంగా నాటి పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో మరొక కమిటీని నియమించారు. బహిర్గతం కాని నారాయణ కమిటీ నివేదిక ప్రకారం అమరావతి రాజధాని నిర్మాణం మొదలెట్టారు. రాజధాని నిర్మాణంకోసం భూములు ఇచ్చుకున్నవారిలో నూటికి 90 మంది రెండు ఎకరాల లోపు రైతులే! నిజానికి వీరంతా చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన అభద్రతకు దిక్కుతోచక భూములు అప్పగించుకున్నవారే! మరో దిక్కులేక, లోలోపల భవిష్యత్తు పట్ల మినుకు మినుకు మనే ఆశలు నింపుకుని తమ జీవితాలను వెళ్లబుచ్చుతున్నవారే! కేంద్ర రాష్ట్ర పాలకుల రాజకీయ పాచికలాటతో సంబంధం లేనివారే!! ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఎలా ఉంటాయో తెలియనివారే!!!
రాజకీయ చావుబతుకుల స్థాయిలో ఘర్షణ పడుతున్నట్లు కనిపిస్తున్న చంద్రబాబునాయుడు జగన్‌మోహన్‌రెడ్డిల నడుమ ఉన్నాయనుకునే వైరుధ్యాలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ముఠా ప్రయోజనాలకు చెందినవనే చెప్పాలి. వారి నడుమ గల ప్రజావ్యతిరేక సామ్యాలను కొందరు చూడలేకపోతున్నారు.
వాటిలో మొట్టమొదటిది అభివృద్ధి నమూనా, విదేశీ బహుళజాతి కంపెనీలను, దేశీయ కార్పొరేట్ శక్తులను ఆకర్షించి, పెట్టుబడి పెట్టించటం ద్వారా మాత్రమే అభివృద్ధికి రహదారి నిర్మించగలుగుతాము అనే ప్రపంచ బ్యాంకు నిర్దేశిత సామ్రాజ్యవాద కార్పొరేట్ నమూనాను పాటించడంలో వారిరువురికి ఎలాంటి తేడా లేదు. పై దోపిడీ వర్గాలకు సేవలు చేయడానికి గడచిన ఐదేళ్లలో జిల్లాకు ఒక లక్ష ఎకరాల చొప్పున ల్యాండ్ బ్యాంక్ సృష్టించి వుంచామని చంద్రబాబునాయుడు ప్రకటిస్తూ వస్తున్నాడు. వాటిని తిరిగి రైతులకు అప్పజెబుతామని జగన్మోహన్‌రెడ్డి అనలేకపోతున్న సంగతి గమనార్హం. నిజానికి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటానికి అసలు కారణం వ్యవసాయ, పారిశ్రామిక సంక్షోభం. దాని పరిష్కారానికనే పేరిట సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు తలవొగ్గిన నాటి నుండి ఈ సంక్షోభం వెనుకకు మళ్ళలేదు సరికదా, రోజురోజుకు మరింతగా ప్రజల జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అభివృద్ధి పేరిట పెరిగిన సంపద పంపిణీలో సింహభాగాన్ని పిడికెడు మంది సంపన్నులు అడ్డగోలుగా కొల్లకొట్టుకుపోయే ప్రపంచీకరణ ప్రక్రియకు స్థానిక కావలిదార్లుగా నేనంటే నేనే అంటూ పాలక పార్టీలు పోటీలు పడుతున్నాయి. అడవులను, జల వనరులను, ముడి ఖనిజాలను కొల్లగొట్టడమే అభివృద్ధి అంటూ ఆదివాసీలను ఏజెన్సీ ప్రాంతాల నుండి గెంటివేస్తున్నారు. వారి స్థానికతను రుజువు పరుచుకోండంటూ ఆదివాసీలపై వేధింపులకు స్వయంగా రాజ్యమే పూనుకుంది. ఇది కూడా ఒక రకపు పౌరసత్వ నమోదు తరహాదే! ఆదివాసీలను పునరావాసానికి అనర్హులుగా ఒకవైపు చేస్తూనే, పునరావాసం పేరిట వారిని నిలదొక్కుకోనీయకుండా వారి కాళ్లపై వారిని బ్రతుకనీయకుండా కారుచౌక వెట్టిచాకిరి కూలీలుగా మార్చుకుంటున్నారు. ఖనిజ సంపదను తరలిస్తున్నారు.
గ్రామీణ పేద ప్రజలకు పంచటానికి భూమి ఎక్కడుంది? అని ఛీత్కరించిన పాలకులు- బహుళజాతి కంపెనీలకు భూమి కొదువలేదు అని పోటీలుపడి అప్పచెబుతున్నారు. లక్షలాది మంది రైతులు మార్కెట్ దోపిడీకి అప్పులపాలై అవమాన భారాలతో గ్రామాలు వదిలి పట్టణాలకు నగరాలకు వలస పోతున్నారు. ఆత్మహత్యల పాలవుతున్నారు.
ప్రపంచ మార్కెట్ శక్తులనుండి మన వ్యవసాయాన్ని చిన్నపరిశ్రమలను ముడి ఖనిజాలను కృష్ణ గోదావరి బేసిన్‌లో లభించే గ్యాస్‌ను రక్షించుకోకుండా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి పరుచుకోకుండా భూగర్భ జలాలను పెంపొందించుకునే చర్యలు తీసుకోకుండా భూమిలో కష్టించే వానికే భూమిపై హక్కును కలిగించకుండా నేటి అభద్రతా జీవితం నుండి విముక్తి చెంది నిజమైన సంక్షేమ జీవితాన్ని గ్రామీణులు, ఆంధ్ర రాష్ట్ర జనులు పొందలేరు.
పాలకుల వైపు చేతులు చాచి ఆశగా ఎదురుచూచే వారుగా మిగుల్చుతున్న విధానాలలో పథకాల పేర్లు మార్చడంలో తప్ప ఈ రెండు పార్టీల నడుమ తేడాలు ఏమున్నాయి?
ఎన్నికల ద్వారా పొందిన మెజారిటీ వల్ల తాము ఏదిచేస్తే అదే ప్రజాస్వామ్యం అన్నట్లు ప్రవర్తించటంలో ఈ రెండు ముఠాల నడుమ ఎంత పోలిక ఉందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. వేల కోట్ల రూపాయల ధన ప్రవాహాన్ని పొంగి పొర్లించి, పోటీలుపడి కులతత్వాలు రెచ్చగొట్టి, ఓట్లు కొనుగోలు చేసి సీట్లు పొందిన వీరి ప్రజాస్వామ్యాన్ని ఖండించగల బలమైన పౌర సమాజం లేకపోవటం ఒకటే కదా వీరి అదృష్టం!
రాజధాని నిర్మాణం విషయంలోనే కాక, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే విషయంలో కూడా అనేక ఏకపక్ష నిర్ణయాలు చేసిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు మూడు రాజధానుల సమస్య ముందుకు రాగానే అందరినీ తనకు మద్దతునిమ్మనే తీరు, అధికారంలో ఉండగా ఒక మాట, అది లేనప్పుడు మరొక మాటగా తప్ప వేరొకటి ఏముంది? తమ ధన సంపత్తులతో పోటీపడి, ఎన్నికలలో గెలవలేని వారందరూ రాజకీయ ప్రక్రియకు పనికిరానివారు అన్నట్లు ఆనాడు చంద్రబాబు ప్రవర్తించలేదా? ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కూడా చంద్రబాబు తరహా ఏకపక్ష రహస్య నిర్ణయాలనే చేస్తూ ‘‘మీరు చేయగా లేనిది మేము చేస్తే తప్ప ఎలా అవుతుంది?’’ అంటూ చేస్తున్న ఎదురుదాడి ప్రకటనలలో ‘దొందూ దొందే’ అని తెలిసిపోవటం లేదా??
మాతృభాష మాధ్యమం రద్దుపరిచే సందర్భంలోనూ, మూడు రాజధానుల మూడుముక్కలాటలోనూ పౌర సమాజంలో కనీస చర్చకు అవకాశం ఇవ్వకుండా, తమ స్వంత నిపుణుల కమిటీలను నియమించుకుని, తాము ముందే చేసుకున్న నిర్ణయాలకు అనుకూలమైన నివేదికలు యిప్పించుకుని ప్రజల జీవితాలను ప్రభావితం కావాంచే కీలక నిర్ణయాలను యుద్ధప్రాతిపదికపై అత్యవసరంగా చేయటంలో ఏం ప్రజాస్వామ్యముంది? కలిగిన వారికి ఒక బడి, లేని వారికి ఇంకో బడిగా సాగుతున్న ‘రెండు గ్లాసుల చదువులను అందరికీ ఒకే బడిగా మార్చవలసింది పోయి అందరికీ మాతృభాష మాధ్యమం రద్దు అనే హడావుడి ప్రకటనలు నిర్ణయాలు ‘మూర్ఖరాజు’ కథని తలపిస్తోంది.
రాజధాని తరహా నగరాల నిర్మాణం గురించి సుమారు 2400 సంవత్సరాలకు పూర్వమే గ్రీకు తత్త్వవేత్త ప్లేటో చెప్పిన మాటలు చూద్దాం.
‘ఏ నగరమైనా అదెంత చిన్నదైనా వాస్తవానికి అది రెండుగా విభాజితమై ఉంటుంది. ఒకటి పేదల నగరం. రెండవది ధనికుల నగరం. ఈ రెండూ ఎప్పడు ఒకదానితో ఒకటి పోరాటంలో ఉంటాయి.’’
కార్పొరేట్ల, బడా కాంట్రాక్టర్ల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల, శతకోటీశ్వరుల, అవినీతి అధితఒతతతతకారుల ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్న కొత్త రాజధాని నిర్మాణం, తమ తమ ముఠా ప్రయోజనాల చుట్టూ రెండు పాలక పార్టీలు తిప్పటం అందరికీ అర్థమవుతున్నది.
అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని జనసాహితి ఆనాడు వ్యతిరేకించలేదు. కానీ... ముక్కారు పంటలు పండే వేలాది ఎకరాల భూములను కాంక్రీటు వనాలుగా మార్చుతున్న నిర్మాణ ప్రక్రియను, అది సృష్టించే సాంస్కృతిక విధ్వంసాన్నీ ఖండించింది. అంతేకాక వందకుపైగా తెలుగు రచయితల, వారి సంఘాల చేత కూడా ఖండింప చేసింది. (చూడండి: ప్రజాసాహితి 2015 జనవరి సంచిక)
భారత ఆర్థిక రాజకీయ వ్యవస్థలు సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతున్న అర్థ శతాబ్దకాలంలో రాజకీయ అధికార కేంద్రీకరణ పాలనా వ్యవస్థలోనూ, పాలక రాజకీయ పార్టీలలోనూ పెరిగిపోతున్న సందర్భంలో తెలగునాట కూడా అదే కొనసాగుతూ ఉంది. పాలక రాజకీయ పార్టీలలో ఆంతరంగిక ప్రజాస్వామ్యం అట్టడుగు స్థాయిలో ఉంటూ వస్తోంది. ఇదంతా పరాధీన ఆర్థిక విధానాలు కొనసాగించుతున్నందువల్ల, పెరిగే సంపద పంపిణీలో వ్యత్యాసాలు తీవ్రమవటంగా కూడా మనకు స్పష్టమవుతోంది. ఆర్థిక సంపత్తి, అధికార సంపత్తి, జ్ఞాన సంపత్తి. ఈ మూడు కేంద్రీకరించబడిన సందర్భాలన్నీ తీవ్ర సామాజిక సంఘర్షణలకు కారణమవుతాయి. దీనినుండి తప్పించుకోవటానికి కుల- మత- ప్రాంతీయ విద్వేషాలను పాలకవర్గాలు రెచ్చగొడుతున్నాయి. జాతీయ పౌర చట్టం పేరిట కేంద్ర పాలకులు తమ వైఫల్యాలను దేశ ప్రజలు ప్రశ్నించకుండా చేసుకుందామనే భారీ ప్రయత్నాలు మొదలెట్టారు. యువతరం వారిని నిలదీస్తోంది.
ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల వాస్తవిక జీవన సమస్యల నుండి పక్కదారి పట్టిస్తూ ప్రాంతీయ కుల విద్వేషాలు సృష్టిస్తూ ఆందోళన చేస్తున్న ప్రజానీకాన్ని పోలీసు బలగాలతో అణచివేస్తున్న విధానాలు ఎల్లకాలం సాగవని రచయితలు కళాకారులు మేధావి వర్గాలు గళమెత్తాలి. స్వార్థపూరిత పాలక ముఠాలను అర్థం చేసుకుని వారి కుట్రలకు గురికాకుండా చూడాలి. ప్రపంచ దేశీయ స్థాయిలో తెలుగుజాతి అత్యంత అవమానకర దుస్థితికి దిగజారిపోవటం పట్ల మన ఆగ్రహాన్ని ప్రకటించాలి. రోజురోజుకి రాష్ట్రాల అధికారాలను నిర్వీర్యపరుస్తున్న కేంద్ర పాలకుల అశ్వమేధ యాగాన్ని అడ్డుకోలేని తెలుగు పాలక ముఠాలను నిర్ద్వంద్వంగా ఎండకట్టాలి!!

- దివికుమార్