సబ్ ఫీచర్

పొగిడితే పోయేదేమీలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలలో ప్రతి పార్టీ, ప్రతి అభ్యర్థి గెలుపు కోసమే పోటీ చేస్తారు. చివరి వరకు అందుకోసమే ప్రయత్నిస్తారు. అంతేకానీ, ఇంకొకరి గెలుపు ఓటముల కోసం పోటీ చేసే పార్టీ సహజంగా అయితే ఉండదు. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని పార్టీలు కొందరు అభ్యర్థులు వేరొకరి గెలుపు/ఓటమికి ఉపకరించేందుకు ఎన్నికల బరిలో దిగడం ఉంటుంది. అయితే, అలాంటి పార్టీలు అట్టే కాలం మన లేవు. మఖలో పుట్టి పుబ్బలో పుటుక్కుమని పోతాయి. అలాగే, ప్రజారాజ్యం వంటి మరి కొన్ని పార్టీలు, లక్ష్యం అది కాకపోయినా పరిణామక్రమంలో పరిస్థితుల ప్రభావం వలన కాలగర్భంలో కలిసి పోతుంటాయి. ఎంత చెడ్డా, ఎంతగా దిగాజరినా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఆ కోవకు చెందే పార్టీలు కాదు. కానీ ఇటీవలి కాలంలో వరస ఓటముల కారణంగానో ఏమో, కాంగీ కమీలు తమ గెలుపు కంటే బీజేపీని ఓడించడం ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డిల్లీ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఒక్కసీటు గెలవలేదు.. ఇది నిజానికి, ఎందుకు ఇలా మిగిలాం.. అని ఆలోచించుకోవలసిన, ఆత్మపరిశీలన చేసుకోవలసిన సమయం, సందర్భం. అయినా, అదేమీలేకుండా బీజేపీకి అధికారం అందకుండా పోయిందని ఆ పార్టీల నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు.
ఇదొక విచిత్ర పరిస్థితి.. ఒక పార్టీ గెలుపు, ఓటములు మరొక పార్టీకి ఆనందం ఇచ్చిందంటే, అది ఆత్మవినాశనానికి సంకేతం. ఆత్మహత్యా సదృశ్యం. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, ఎందుకనో ఈ వాస్తవాలను గుర్తించడం లేదు. బీజేపీ ఓటమి కోసం ఎలాంటి త్యాగాలకు అయినా సిద్ధమైపోతున్నాయి. చివరకు సిద్ధాంతాలనే త్యాగం చేసేందుకు కూడా వెనకాడడం లేదు. అందుకే, ఆ రెండు పార్టీలు రాజకీయంగానే కాదు, సైద్ధాంతికంగా కూడా అస్తమయం దిశగా అడుగులు వేస్తున్నాయని ఎవరో కాదు, కాంగ్రెస్ అనుకూల వామపక్ష భావజాలంతో మమైకపోయిన మేధావులు కూడా ఆందోళన వ్యక్తపరుస్తు న్నారు. బీజేపీ జాతీయ వాదం పట్ల వ్యతిరేకత కారణంగా ఇప్పటికే ఇటు కాంగ్రెస్, అటు వామపక్షాలు భారీ మూల్యాన్ని చెల్లించాయి. ఇప్పుడు డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్’ విజయాన్ని తమ విజయం కంటే ఎక్కువగా ఆస్వాదిస్తున్న పార్టీలు, నాయకుల తీరు చూస్తే, కాంగ్రెస్ కమీ ద్వయం అస్తమయం దిశగా అడుగులు కాదు ఏకంగా పరుగులే తీస్తున్నాయి అనిపిస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేస్తూ ఆప్ ‘చీపురు’ మరో మారు డిల్లీని ఊడ్చేసింది. ఎనిమిది నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో డిల్లీ, సహా మరో డజనుకు పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజీపీ ఏ విధంగా అయితే, ఒకటీ అరా మినహ మిగిలిని స్థానాలు అన్నింటినీ ఎగరేసుకు పోయిందో, అదే విధంగా 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే, ఇది ఓ హస్తం (ఐదు) తక్కువే అయినా, ఆప్ సాధించిన విజయం నిస్సందేహంగా అద్భుత విజయం. ఆప్ అధినేత, ముఖ్యమంత్రి ఏకే (అరవింద్ కేజ్రీవాల్) ప్రభుత్వం ఐదేళ్ళ పాలనను చూసి ప్రజలు ఆయనకు, పార్టీకి మరో అవకాశం ఇచ్చారా, లేక పీకే (ప్రశాంత్ కిశోర్) వ్యూహం ఫలించి ఆప్ అందలం ఎక్కిందా, ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీజేపీ వ్యూహం బెడిసి కొట్టిందా అదీకాక పోతే జాతీయ ఎన్నికల్లో జాతీయ పార్టీలను, అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక పార్టీలకు అధికారం అప్పగించాలని ఢిల్లీ ఓటరు అప్రకటిత నియమం ఏదైనా విధించుకున్నారా.. కాంగ్రెస్ చేతులెత్తేయడం ఆప్‌కు కలిసొచ్చిందా? ఆప్ అద్భుత విజయానికి ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అనేది వేరే చర్చ. అది ఎవరికి తోచిన విధంగా వారు చేసుకోవచ్చును. చేస్తున్నారు కూడా.. కానీ ఆప్ విజయాన్ని కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు ఆస్వాదిస్తున్న తీరు, ఆ రెండు పార్టీల దౌర్భాగ్య స్థితికి అద్దం పడుతోంది. కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదన్న ఒకే ఒక్క కారణంగా చిదంబరం నుంచి సీతారం ఏచూరి దాకా, మురిసిపోవడం దివాలాకోరు రాజకీయాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చును.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వరసగా రెండవసారి తుడిచిపెట్టుకు పోయింది. సీట్ల సంగతి దేవుడికెరుక కనీసం ఉనికిని అయినా నిలుపుకోలేక పోయింది. 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవ సారి ఖాతా అయినా తెరవలేదు. ఒక్క ఐదారు స్థానాలలో తప్పించి మిగిలిన అన్ని చోట్లా పార్టీ అభ్యర్ధులు డిపాజిట్లు గల్లంతయ్యాయి. హస్తం పార్టీకి ఐదు శాతం ఓట్లు కూడా దక్కలేదు. వామపక్షాలదీ అదే తీరు, కాదు అంతకంటే అధ్వాన్నం. సీపీఐ, సీపీఎం పార్టీలలో ఒకరికి 0.01 ఇంకొకరికి 0.02 ఒక శాతం మొత్తం కలిపి ఒక శాతం కంటే తక్కువ శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అయినా, వామపక్ష పార్టీలు సంతోషంతో చిందులు వేస్తున్నాయి. ఒకప్పుడు చైనాలో వాన కురిస్తే ఇక్కడ గొడుగులు పట్టిన కామ్రేడ్లు ఇప్పుడు ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి సామెతను గుర్తుకు తెస్తున్నారు.
నిజమే, కేవలం ఎనిమిది నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలు గెలుచుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది. అధికారం అందుకోలేకపోయినా గౌరవప్రదమైన ‘ఓటమి’ని అయినా పొందలేకపోయింది. కనీసం రెండంకెల స్థాయికి అయినా చేరలేక పోయింది. అయితే గుడ్డిలో మెల్లగా పార్టీకి ఉన్న స్టాండర్డ్ వోట్ షేర్ స్థిరంగా ఉండడమే కాదు, ఎంతో కొంత పెరిగింది. అలాగని, అంతటితో సంతృప్తిని చెందితే అది బీజీపే చేసే పెద్ద పొరపాటే అవుతుంది. కానీ బీజేపీ, ఇంతవరకు అలాంటి పొరపాటు చేయలేదు, పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ తప్పిదాలను అంగీకరించారు. ఎన్నికల ప్రచారంలో కొందరు పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసిందని అంగీకరించారు. అంతేగానీ, అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగానే అయినా బీజేపీ భావజాలాన్ని కొంతవరకు అరువు తీసుకున్నారని ఆనందపడలేదు. ఓటమికి సాకులు వెతికే ప్రయత్నం చేయలేదు. లోపాలు గుర్తించారు. దిద్దుబాటు అవసరాన్ని అంగీకరించారు. కాబట్టి బీజేపీ ఓటమిలో కొంత హుందాతనం అయినా మిగిలింది. అలాగని ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి తృప్తిని ఇచ్చాయని అనుకోలేము. ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కాదనలేం. సిద్ధాంత పునాదులు ఉన్న ఒక జాతీయ పార్టీగా ఎక్కడ పారేసుకున్నమో అక్కడ వెతుక్కునే ప్రయత్నం చేస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి కాబట్టి, బీజేపీ ఓటమిని భిన్నంగా చూడవలసి వస్తుంది.
అదే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల విషయానికి వస్తే, ఓటముల నుంచి పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేయడం లేదు. అదేవిధంగా, పడి లేచిన కెరటంలా మళ్ళీ జెండా ఎగరేస్తామన్న అత్మవిశ్వాసాన్ని అందించే ప్రయత్నం అయినా చేయడం లేదు. పైగా ఆప్ విజయాన్ని బీజేపీ ఓటమిగా చూసి సంతోషపడుతున్నారు. అంతేకానీ ఆప్ ఎలా గెలిచింది? అనే దిశగా ఆలోచించడం లేదు. అందుకే నిండా మునిగినాక ఇంకా చలేమిటని? చిదంబరం, సీతారాం ఏచూరి లాంటి నాయకులు అనుకుంటే అనుకోవచ్చును గానీ, ఇదే ధోరణి ఇలాగే కొనసాగితే ఉన్న కాస్త పరవు ఊడ్చుకు పోతుందని సొంత పార్టీ నాయకులే విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అయితే, ఒక విధమైన ప్రకంపనలే మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, పార్టీ అధికార ప్రతినిధి, మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ, జ్యోతిరాదిత్య సింధియా ఇంకా చాలా మంది డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చిదంబరం స్పందించిన తీరుతోపాటు పార్టీ అగ్ర నాయకత్వం తీరును తప్పు పట్టారు. ‘బీజేపీని ఓడించిన ఆప్’కు సెల్యూట్ చేస్తున్నా’ అంటూ చిదంబరం చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ శర్మిష్ట, ‘‘బీజేపీని ఓడించే బాధ్యతను ప్రాంతీయ పార్టీలకు అవుట్ సోర్సింగ్ ఇచ్చారా? ఇలా అయితే, రాష్ట్రాల్లో పీసీసీ దుకాణాలను మూసుకోవలసిందే’’ అంటూ ఘాటుగా స్పందించారు. అంతేకాదు, పార్టీ ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అంటూ, పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో తల్లి కొడుకులు సోనియా, రాహుల్ మధ్య సాగుతున్న దోబూచులాటను పరోక్షంగానే అయినా ప్రస్తావించారు. అదేవిధంగా జ్యోతిరాదిత్య సింధియా డిల్లీ ఓటమితో పార్టీ ఆలోచనా విధానం మారవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు.. అంతేకాదు.. ‘్భవజాలం’ (ఐడియాలజీ) మారవలసిన అవసరం గురించి కూడా మాట్లాడారు. ‘‘దేశం మారింది, అందుకు తగ్గట్టుగా సరికొత్త ఆలోచనలతో ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది’’ అంటూ హిందూ జాతీయ వాదానికి వ్యతిరేకంగా పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న ప్రస్తుత పంథాను తప్పుపట్టారు. అదేవిధంగా ఇంకా అనేక మంది నాయకులు ‘మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు’ అన్నట్లుగా ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి కంటే, పార్టీ అగ్ర నాయకత్వానికి సన్నిహితంగా మెలిగే చిదంబరం వంటి నాయకుల తీరు పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఇదిలా ఉంటే, పార్టీ అధ్యక్ష పదివిలో సోనియా కొనసాగడమా..? రాహుల్ గాంధీకి మళ్ళీ బాధ్యతలు అప్పగించడమా? అనే విషయంలో పార్టీ నాయకత్వం ఎటూ తేల్చుకోలేక పోవడంతో ఒక విధమైన నిర్వేదం పార్టీని కమ్మేసింది. అందుకే ఈ పరిస్థితి నుంచి బయట పడడం అయ్యేపని కాదని చాలా వరకు నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.
అదలా ఉంటే, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, అలాగే బీజేపీ వ్యతిరేకతకే ప్రధాన అజెండాగా పనిచేస్తున్న ప్రాంతీయ పార్టీలు, పోటీలుపడి ఢిల్లీ ఎన్నికల విజేత అరవింద్ కేజ్రివాల్ గెలుపులో తమ గెలుపుని చూసుకుని, ఆయనలో తమ భవిష్యత్‌ను వెతుకున్న వారందరినీ అదే కేజ్రివాల్ దూరంగా పెట్టారు. ప్రమాణ స్వీకారానికి ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మాత్రమే ఆహ్వానించారు. బట్టలు సర్దుకుని, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని పిలుపు కోసం ఎదురు చూస్తున్న మమతా బెనర్జీ వంటి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను గానీ ఇతర పార్టీల నాయకులను గానీ పిలవనే లేదు. అంతేకాదు.. మీదా మీది, నాదా నాది, అంటూ కేజ్రీవాల్ ‘సానుకూల జాతీయవాదం’ అనే కొత్త జెండాను ఎగరేసారు. ఒకవిధంగా కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు మిస్ అయిన బస్సును కేజ్రీ క్యాచ్ చేశారు. సో.. వ్రతం చెడ్డా ఫలితం దక్కని తీరులో... కేజ్రీని చంకన ఎత్తుకున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర సో కాల్డ్ లౌకికవాద పార్టీలు.. పొగిడితే పోయేదేమీ లేదు.. ఉన్న కాసింత పరవు తప్ప.. అని కొంచెం ఆలస్యంగా అయినా గ్రహించక తప్పేలా లేదు.

- రాజనాల బాలకృష్ణ 9985229722