సబ్ ఫీచర్

అక్షరాలకు ఆదిదేవత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జాతి మనుగడకు అక్షర సంపద అవసరం. జ్ఞానప్రదాయని అయన సరస్వతి దేవి కటాక్షం ఉంటే చాలు విజ్ఞాన నిధులు సమకూరినట్లే. విభిన్న రీతుల్లో సాగే ఈ విజ్ఞాన నిధులు సమకూరితే ఆయా రంగాల్లో వారు ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాల వల్ల సమకూరే అక్షర సంపదను సొంతం చేసుకునేందుకు పెద్దలు తమ పిల్లలకు ఈ రోజు అక్షరాభ్యాసం చేయస్తారు. మాఘమాసంలోని శుద్ధ పంచమి శ్రీ సరస్వతీదేవి పుట్టినరోజు. దీనే్న శ్రీపంచమి, వసంత పంచమి, మదన పంచమి అని కూడా పిలుస్తారు. విద్యారంభానికి ఇది ఎంతో శుభప్రదమైన రోజుగా పరిగణిస్తారు. సర్వజ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవి. బ్రహ్మ వైవర్తపురాణంలో మాఘ శుద్ధ పంచమిని విద్యారంభ దినంగా పాటించాలని, సరస్వతీ పూజ చేయాలని ఉంది. సరస్వతి అంటే వాక్కు, పరిశుద్ధమైన మాట. వేద వేదాంగాలూ, శాస్త్రాలూ, పురాణేతిహాసాలు సరస్వతీదేవి శబ్దమయ రూపాలు. సర్వవిద్యలకూ రూపం సరస్వతి. శ్రీవాణి కృప లేకుంటే, లోకానికి మనుగడే లేదు. వాగ్దేవి ఉపాసనవల్ల వాల్మీకి రామాయణ రచన చేశాడంటారు. ఆదిశేషుడు, బృహస్పతి, ఆదిశంకరులు, యాజ్ఞవల్క్యుడు వంటి ఎందరో శారదానుగ్రహ కారణంగా జ్ఞానసంపన్నులయ్యారు. వ్యాసుడు గోదావరి తీరాన సైకత మూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించాడని పురాణ కథనం. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, బాసరగా ప్రసిద్ధి పొందింది. సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో వుండే జ్ఞానం’ అని అర్థం. వేదాలు సరస్వతీమాత నుంచే వెలువడ్డాయని ‘గాయత్రి హృదయం’ గ్రంథం అభివర్ణించింది. సరస్వతీదేవిని పూర్వం అశ్వలాయనుడు ఆరాధించి ఆ తల్లి కటాక్షం పొందాడు. సరస్వతీదేవిని ఆరాధించే విధానం ‘సరస్వతీ రహస్యోపనిషత్’ అనే గ్రంథం తెలియజేస్తోంది. తెల్లని పద్మం సరస్వతికి సింహాసనం.
గుణాల్లో సత్వగుణమే ప్రధానం అంటారు. సరస్వతీదేవి సత్వగుణానికి సంకేతం. సత్వగుణానికి శుక్లవర్ణం సంకేతం. అక్షర జ్ఞాన సంపదలను అనుగ్రహించాలని శుక్ల పంచమి నాడు భక్తిశ్రద్ధలతో కోరితే, అది నెరవేరుతుందన్నది ప్రజల విశ్వాసం. అక్షరభ్యాసం నాడు ‘సరస్వతీ నమస్త్భ్యుం’ అంటూ పురోహితుడు వాగ్దేవిని ఆహ్వానించి, అక్షరాభ్యాసం చేయించడం భారతీయ సంప్రదాయం. ఆమె వీణ పేరు కచ్ఛపి. ఆమె నివాసస్థానం నాలుకపైభాగం. అందుకే ఎవరి నోట మాట, పాట, సాహిత్యం, సంగీతం, శాస్త్ర ప్రవచనం వెలువడితే వారిని సరస్వతీ అనుగ్రహం ఉన్నవాళ్లని అంటారు.
వసంత పంచమి ఉదయం పూట స్నానాదికాలు ముగించుకుని శుచి అయి, గణపతిని పూజించి, కలశంలో దేవిని ఆవాహన చేయాలి. విద్యాదాయిని సరస్వతీదేవి ప్రతిమ లేదా చిత్రపటానికి తెల్లని పూలు, అక్షతలు, మంచి గంధం, తెల్లని నగలు అలంకరించి షోడశోపచారాలతో పూజించి, పాయసం నివేదించాలి. పూజానంతరం ఆ పాయసాన్ని ప్రసాదంగా అందరికీ పంచి తాము భుజించాలి. సరస్వతీదేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెను తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్ల నువ్వులతో చేసిన లడ్డు, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ వంటి వాటిని నివేదిస్తే సరస్వతీదేవి ప్రసన్నురాలై కోరిన కోరికలు తీరుస్తుందని శాస్త్రోక్తి. సర్వసృష్టిని, సర్వమానవ ప్రపంచాన్ని నడిపే అంతఃశ్శక్తి సరస్వతీదేవి అనే రహస్యాన్ని మొదట గ్రహించినవాడు శ్రీ శంకర భగవత్పాదులు. అందుకనే సర్వాద్వైత పీఠాలలో సరస్వతీదేవితో కూడి వున్న శారదా చంద్ర వౌళీశ్వర ఆరాధనను ప్రవేశపెట్టారు.
శ్రీపంచమి దక్షిణ భారతదేశంలో అంతగా ప్రచారంలో లేకపోయినప్పటికీ, ఉత్తర భారతదేశంలో ఈ పంచమి నాడు సరస్వతీదేవిని అత్యంత శ్రద్ధతో పూజిస్తారు. శ్రీపంచమి రోజు విద్యాభ్యాసం మొదలుపెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకం కూడా చాలామందికి ఉంది. అందుకే తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం ఒకటి. ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతను అంబితమే, నదీతమే, దేవితమే అని శ్రుతి కీర్తించింది. అనగా అమ్మల్లో శ్రేష్ఠురాలు, నదుల్లో గొప్పది, దేవతల్లో ఉన్నతురాలు సరస్వతి. సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా వుంది. వేదం సరస్వతీదేవిని ‘ప్రణోదేవి సరస్వతి! వాజే భిర్వాజినీ వతీ ధీవా మవిత్య్రవతు’ అని ప్రశంసించింది. విద్యాదానం జ్ఞానదానమేనని, అన్నదానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు. శాంతమూర్తియైన సరస్వతీదవి ఒక చేత వీణ, మరో చేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్ధులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి దక్కుతుందనేది శాస్త్రోక్తి. దొంగలు దోచలేనిది, నలుగురికి పంచగల శక్తి విద్యకు మాత్రమే ఉంది. మనిషికి మాటే ప్రాణం కాబట్టి దేవిని ఆరాధించి మనిషి సద్బుద్ధిని పొందుతాడు. గాయత్రీ దేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపంవలన విద్యను కోల్పోవడంతో సూర్యుని ఆరాధించగా, అతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేగాక ఆ గ్రంథాన్ని పొట్ట కూటికోసం నరులెవ్వరికీ అంకితమివ్వనని వాగ్దానం చేశాడు. మన రాష్ట్రంలో బాసర సరస్వతీ ఆలయం, వర్గల్ సరస్వతీ ఆలయం, శృంగేరీలోని శారదాదేవి ఆలయం ప్రసిద్ధిగాంచినవి. గుజరాత్‌లో దండియా ఉత్సవాలు జరుపుకున్నట్లే, ఉత్తరాఖండ్‌లో వసంత పంచినాడు భూదేవికి వైభవంగా పూజలు చేయడం ఆచారం. శృంగారకేళి వినోదాలకు, దేశ వ్యాప్తంగా వసంతోత్సవాలకు వైతాళికుడి లాంటి శ్రీపంచమి, పర్వదినమే కాదు - అక్షర శుభోదయానికి శ్రీకారం వంటిది. సరస్వతీదేవిని నలువరాగి, పలుకు చెలి, చదువుల వెలది అంటూ అచ్చతెలుగులో ముచ్చటతీరా పిలుచుకుంటారు. ఈ రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, అందరూ సరస్వతీ అనుగ్రహానికి పాత్రులవుదాం.
సరస్వతీ నమస్త్భ్యుం, వరదే కామరూపిణీ!
విద్యారంభం కరిష్యామి, సిదిర్భవతుమే సదా!

-కె.రామ్మోహన్‌రావు