సబ్ ఫీచర్

రగులుతున్న రాజధాని రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుంచి తెలుగువారికి రాజధాని సమస్య ఒక వెంటాడుతున్న శాపంలా మారింది. అమరజీవి పొట్టి శ్రీరాములుగారి ఆత్మబలిదానంతో మన దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలకు అంకురార్పణ జరిగింది. పొరుగువారికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఆనాటి మద్రాసు పట్టణంలో 40% పైగా తెలుగువారు ఉన్నప్పటికీ ఎంతో ఉదారమనస్సుతో ఎంతో అభివృద్ధిచెందిన మద్రాసును తమిళ ప్రజలకు వదిలేసి కర్నూలును రాజధానిగా చేసుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచుకున్నారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా 1956లో తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్‌ను రాష్ట్ర రాజధానిగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తెలుగు ప్రజలందరికీ ఏర్పడింది.
ప్రాంతీయ అసమానతలు, ఆర్థిక వ్యత్యాసాల మూలంగా వచ్చిన ప్రజా ఉద్యమాల మూలంగా కొన్ని అనివార్య పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్‌నుంచి తెలంగాణ ప్రాంతం విడిపోయి, ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. అప్పటి యుపిఏ ప్రభుత్వంవారు హైదరాబాద్ నగరం కనీసం పది సంవత్సరాలపాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. అంతవరకూ వేచి ఉండే ఓపిక, సంయమనం లేక చంద్రబాబునాయుడుగారు మధ్యలోనే అమరావతికి తరలిపోయి అక్కడ రాజధానికి ఏర్పాట్లు ప్రారంభించారు. అక్కడ చుట్టుప్రక్కల ఉన్న తుళ్ళూరు మండలం, వెలగపూడి పరిసర 29 గ్రామాల ప్రజల నుంచి భూములను నయానోభయానో ప్రభుత్వపరం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
చంద్రబాబునాయుడుగారు తన ప్రభుత్వ హయాంలో చేసిన ప్రజావ్యతిరేక పరిపాలనా విధానాలకు ఫలితంగా ఘోరంగా ఓడిపోయి, తన 23మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో కూర్చున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రభావమో లేక గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే 151 మంది ఎమ్.ఎల్.ఏలతో అధికారాన్ని పొందారు.
ఇంతటితో ఆంధ్ర ప్రజల కష్టాలు తీరాయి అని అనుకొంటుంటే అక్కడే అసలు కథ ప్రారంభం అయింది. గత ప్రభుత్వం తన పార్టీ ఎమ్.ఎల్.ఏలను తమ అధికార పార్టీలో కలుపుకొన్నారు అనే అక్కసుతోనే లేక మరే ఇతర కారణాలవల్ల అయితేనేమి జగన్‌మోహన్‌రెడ్డిగారు గత ప్రభుత్వ నిర్ణయాలను రద్దుచేయడం ప్రారంభించారు. వాటిలో ముఖ్యంగా ఇప్పుడు అతి ముఖ్యమైన సమస్య రాజధాని గురించి. ఈ వ్యవహారం చూస్తుంటే ప్రభుత్వ, ప్రతిపక్ష వైఖరులు రెండు రియల్ ఎస్టేట్ సంస్థల మధ్య పోరుగా కనపడుతున్నది. అప్పుడు అమరావతి రాజధాని కాబోతున్నది అని అప్పటి అధికారంలో ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ ఆ చుట్టుప్రక్కల గ్రామాలలోని భూములను తక్కువ ధరలకు కొని రాబోయే కాలంలో కోట్లు గడించాలి అని తమ సంపాదనలు అన్నీ పెట్టుబడిగా పెట్టారు. వారి వ్యూహాలకు చెక్ పెట్టే రీతిలో జగన్‌మోహన్‌రెడ్డిగారు అధికార వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అసెంబ్లీలో ప్రకటన చేశారు.
ముఖ్యమంత్రిగారు విశాఖపట్నంలో, రాష్ట్ర సచివాలయం, రాష్ట్ర సిబ్బంది అందరూ విశాఖపట్నంలోనే ఉంటారట. మరి అమరావతిలో లెజిస్లేటివ్ రాజ్‌భవన్ కొనసాగిస్తారట. అమరావతిలో దాదాపు 400 ఎకరాలకు ఇన్‌సైడ్ ట్రేడింగ్ అయిందని, దాని మూలంగా రూ.320 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగింది అని ఇది రాజధాని మార్పుకు కారణం అని ప్రస్తుత ప్రభుత్వం పేర్కొంటోంది.
ఇదిలాఉంటే గడచిన నాలుగు నెలల్లో విశాఖ ప్రాంతంలో దాదాపు 600 ఎకరాల మేరకు భూములు అధికార ప్రతినిధులు కొన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమగారి ఆరోపణలు వినిపించారు. ఇలా ఒకరిపై మరొకరు బురద జల్లుకునే దుష్ప్రరిణామాలే కనపడుతున్నాయి. కాని నిజంగా ప్రజలకు మంచిచెయ్యాలి అనే ఉద్దేశం కనపడుటలేదని రాజకీయ విశే్లషకుల అభిప్రాయాలు.
ప్రాంతీయ, కులాభిమానాలు, వ్యక్తిగత వైరాలు, వ్యాపార ప్రయోజనాలు ఇంకను అనైతిక, అక్రమ లావాదేవీలతో రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. నిజానికి, కొన్ని వేల ఎకరాల పంటలు పండే భూములు అన్యాయంగా రైతుల దగ్గరనుంచి తీసుకొని ఇప్పుడు మరలా వారికి ఇస్తాము అంటే వారికి ఒరిగేది ఏమిటి. పంట పొలాలను వాటి నైసర్గిక రూపురేఖలను మార్చి పండటానికి అయోగ్యమైనవి ఇస్తే రైతులకు లాభమేమి. మరలా ఎన్ని సంవత్సరాలకు వాటిని సేద్యయోగ్యముగా చేసుకొంటానికి వీలవుతుంది. ఇప్పటికి సుమారు 50 నుంచి 80కోట్ల రూపాయల నష్టం రైతులకు జరిగింది. ఇప్పుడు మరలా రాజధాని మారిస్తే అమరావతి దగ్గర భూముల విలువ పడిపోతుంది.
ఈ సమస్య ఇంతటితో తీరదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలనుంచి కూడా తమ ఏరియాల్లోకూడా రాజధాని పెట్టమని ఉద్యమాలు జరగవచ్చు. ఇప్పటికే కొంతమంది కర్నూలులోను, మరికొంతమంది ఒంగోలులోను, విజయనగరంలోను రాజధానులు పెట్టమని తమ స్వరాలు వినిపిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ ప్రకారం దొనకొండ ఉండనే ఉన్నది.
అందుకని ఆంధ్ర రాష్ట్రంలోని అధికార పక్షంవారు ఒక మెట్టుక్రిందకు దిగి, ప్రతిపక్షాలవారు తమ ఆభిజాత్యాన్ని వదిలి ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించి, ప్రజలందరి ఆమోదయోగ్యమైన, ఉపయోగకరమైన విధంగా రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆశావహముతో ఎదురుచూస్తున్నది.

-‘జనశ్రీ’ 7995900497