సబ్ ఫీచర్

పిల్లల ప్రవర్తనను గమనించాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది పిల్లలకు చిన్నప్పటి నుంచీ మంకుపట్టు, పేచీతత్త్వం, మొండితనం వంటివి ఉంటాయి. ఇవన్నీ తల్లిదండ్రుల గారాబం వల్లో.. లేదా అమ్మమ్మ తాతయ్యల ముద్దు వల్ల వచ్చింది అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఇది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కావచ్చని చెబుతారు డాక్టర్లు.. ఈ తరం చిన్నారుల్లో ఎక్కువశాతం మందిలో ఈ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది అంటున్నారు వారు. నెలలు నిండకుండానే పుట్టడం, మెదడు అమరికలో లోపాలు, జన్యుపరమైన సమస్యలూ, పోషకాహారలోపం వంటివి ఈ సమస్యకు దారితీస్తాయి. కొన్నిసార్లు ఇంటి వాతావరణం కూడా పిల్లల్లో ఈ సమస్యను పెంచుతుంది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం, పిల్లలతో గడిపే సమయం తక్కువైపోవడంతో వారు ఒంటరితనానికి గురవుతారు. దాంతో తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు దృష్టంతా తమపైనే ఉండాలనే ఉద్దేశ్యంతోనూ అతిగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. కానీ వీరిలో తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఏకసంథాగ్రాహ్యులు. ఏ విషయాన్నైనా క్షణాల్లో పట్టేస్తారు. అంత చురుకు. అన్ని పనులూ వేగంగా చేస్తారు. వీరు చాలా సమర్థులు. కానీ నిర్లక్ష్యం వల్ల కొన్నిసార్లు అసమర్థులుగా మిగిలిపోవలసివస్తుందని చెబుతున్నారు నిపుణులు.
* పిల్లలకు దేనిమీదా ఏకాగ్రత లేకపోవడం, కుదురుగా ఒకచోట కూర్చోలేకపోవడం..
* ఎదుటివాళ్లు ఏమి చెప్పినా వినకపోవడం..
* అతి చురుకుగా ఉండటం..
* భరించలేని దుందుడుకుతనం..
* వాళ్లకు నచ్చినప్పుడు మాత్రమే చదువుకోవడం..
* గట్టిగట్టిగా అరవడం..
ఇవన్నీ ఈ డిజార్డర్ లక్షణాలే అని చెబుతున్నారు నిపుణులు.
చిన్నారులు చురుగ్గా ఉంటారు. తెలివైనవారే.. అందులో ఎటువంటి సందేహమూ లేదు. కానీ వారికి నచ్చిన అంశాల్లో మాత్రమే వారు చురుకుగా ఉంటారు. చదువు విషయంలో ముఖ్యంగా తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినడానికి మాత్రం వారు అస్సలు ఆసక్తి చూపించరు. ఎందుకంటే వీరు ఆడే వీడియోగేమ్స్, ఇతర ఆటలు చాలా వేగంగా ఉంటాయి. వీరు కూడా ఎప్పుడూ అలాగే ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి వాటితో పోల్చుకుంటే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వారికి చాలా నెమ్మదిగా అనిపించి, పూర్తిగా అనాసక్తులవుతారు. ఏకాగ్రతను కోల్పోతారు.
సాధారణంగా వీరి ప్రవర్తన మూడు స్థాయిల్లో ఉంటుంది. మొదటి రెండు దశల్లో తల్లిదండ్రుల సహాయంతో వారిలో మార్పు తీసుకురావచ్చు. సమస్య మూడోదశలో ఉంటే గనుక తప్పనిసరిగా పిల్లల మానసిక వైద్య నిపుణుల దగ్గరకు తీసుకెళ్లాలి. వారు బిహేవియర్ థెరపీ ద్వారా వారిలో మార్పును తీసుకువస్తారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా జీవనవిధానంలోనూ, కుటుంబపరంగానూ కొన్ని మార్పులు తెచ్చుకోవాలి.
* పిల్లల దినచర్యకు పక్కా ప్రణాళిక ఉండాలి. ఉదయం నిద్ర లేవడం నుంచి రాత్రి నిద్రపోయేవరకు అన్నీ ప్రణాళిక ప్రకారం చేసేలా ఉండాలి. అందులో చదువుకోవడం, హోంవర్కు చేయడం, ఆటలు ఆడటం.. వంటివి కూడా ఉండాలి. కొద్దిరోజులు తల్లిదండ్రులు నెమ్మదిగా, మంచి మాటలతో పక్కన ఉండి చేయిస్తే.. పిల్లలు క్రమంగా అలవాటు పడతారు.
* పిల్లల ప్రవర్తనను బట్టి ఓ చార్టును తయారుచేసి స్టార్స్‌ను ఇవ్వడం వల్ల వారిలో మార్పు వస్తుంది. నెల రోజులకు ఒకసారి వచ్చిన స్టార్ల ఆధారంగా వారికి బహుమతులు ఇస్తే వారు ఇంకా ఎలా మారాలా.. అని ఆలోచన చేస్తారు.
* పిల్లలకు ఏకాగ్రత పెరిగేలా చెస్, మ్యాపింగ్, స్పెల్లింగ్ బీ, సుడోకు, పదబంధాలు పూర్తిచేయించడం, వర్డ్ గేమ్స్.. ఇలాంటి ఆటలు ఆడించాలి. వీటితో వారిలో నెమ్మదిగా ఏకాగ్రత పెరుగుతుంది. ఒక్కసారి ఏకాగ్రత పెరిగితే చాలు.. వారు తరువాత చదువులో ముందుంటారు.
* తల్లిదండ్రులు పిల్లలకు సమయాన్ని కేటాయించాలి. వారి అభిప్రాయానికి విలువనివ్వాలి. వారు ఏం చెబుతున్నారో ప్రశాంతంగా వినాలి. మీ కోసమే మేము ఉన్నామని తల్లిదండ్రులు, పిల్లలకు తరచూ తెలియజేస్తూ ఉండాలి. వీరితో కలిసి ఆడటం, కబుర్లు చెప్పడం, అనుక్షణం వారిని బిజీగా ఉంచడం వంటివి చేయడం వల్ల వారిలో నెమ్మదిగా మార్పు కనిపిస్తుంది.
* పిల్లలను బయటకు తీసుకెళితే నలుగురిలో పరువు పోతుందని.. తీసుకెళ్లరు. కానీ పిల్లలను నలుగురితో కలవనివ్వాలి. దగ్గరలోని పార్కులకు, బంధువుల ఇళ్లకు తీసుకెళ్లాలి. దానివల్ల వారికి ఎవరితో ఎలా ప్రవర్తించాలనేది తెలుస్తుంది.
* పిల్లలను బయటి ఆటలు కూడా ఆడనిస్తుండాలి. వారికి నచ్చిన ఆట ఏదైనా ఆడిస్తే వారిలో ఏకగ్రతతో పాటు, శారీరక శక్తి కూడా పెరుగుతుంది.
* అలాగే పిల్లలకు పుష్టికరమైన ఆహారాన్ని అందించాలి. జంక్ ఫుడ్‌కు వారిని దూరంగా ఉంచాలి. పండ్లు, కూరగాయలు, పోషకపదార్థాలను ఎక్కువగా తినిపించాలి.
ఇలా నెమ్మదిగా వారి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చి, వారిలో ఏకాగ్రతను పెంచితే.. భవిష్యత్తు తరం బాగుంటుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. *