సబ్ ఫీచర్

పుట్టుకతో మాస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడ కాకినాడ? ఎక్కడ మదరాసు?
ఓపక్క ఎంజిఆర్. ఇంకోపక్క శివాజీగణేశన్. ఇటు ఏయన్నార్. అటు యన్‌టిఆర్.
ఇక -ఎస్వీఆర్, జయలలిత, సూర్యకాంతం.. లాంటి దిగ్గజ నటులను చూడటమే గొప్ప విషయం. కలుసుకునే అవకాశం వస్తే -ఆనందం. వాళ్లతో కలిసి నటించే చాన్సొస్తే
-ఎగిరి గంతులే. బహుశ అలా ఎగిరి గంతులేయడానికే పుట్టాడు -మాస్టర్ విశేశ్వరరావు. పువ్వు పుట్టినప్పుడే పరిమళించింది అన్నది తెలుగు సామెత. కాని -పరిమళించడానికే
పుట్టినోడు విశే్వశ్వరావు. నాలుగేళ్ల ప్రాయం నుంచే ప్రేక్షకులకు ఆనందాన్ని
పంచే అదృష్టాన్ని అందిపుచ్చుకున్న మాస్టర్ విశే్వశ్వర రావు
-ఈవారం వెనె్నల అతిథి. ఆయన జ్ఞాపకాలే -మనకు ముచ్చట్లు.
కాకినాడలో గరిమెళ్ల కృష్ణమూర్తి, తాయారమ్మల ఏడో సంతానం -విశే్వశ్వర రావు. ముగ్గురు అన్నలు, ముగ్గురు అక్కల తరువాత పుట్టిన చిన్నోడు. ఆ చిన్నోడే -అందరికంటే ముందు పెద్దోడయ్యాడు. తోబుట్టువులకు తమ్ముడిలా ఉండాల్సినోడు -తండ్రి మరణానంతరం తండ్రయ్యాడు. అవసరాన్ని ఆకళింపు చేసుకుని -సంపాదించడం మొదలెట్టాడు. అమ్మానాన్నలిచ్చిన ఆస్తి -అన్నలు, అక్కలే. అందుకే -ప్రపంచం తెలీని ప్రాయంలోనే బాధ్యతలు నెత్తికెత్తుకున్నాడు. అన్నలు, అక్కల చంకన పెరగాల్సిన కుర్రాడే -తనవాళ్లను భుజానికెత్తుకున్నాడు.
**
నాన్న బతికున్నపుడు హరికథలు చెప్పేవాడు. మధ్యమధ్యలో నాలుగు నవ్వించే మాటలు చెప్పించేవారు. మిమిక్రీ కూతలు కూయించేవారు. నాకు భలే సరదాగా ఉండేది. అలా -నాన్నతోపాటు నేను తిరిగినన్ని ఊళ్లు ఎవరూ తిరిగుండరేమో. ప్రాపంచిక జ్ఞానానికి -ఆ ప్రయాణాలే నా పాఠశాల అయివుంటుంది. నాన్నతోపాటు ఊళ్లు పట్టుకు తిరుగుతున్న నన్ను -తుని రాజావారు ఐదో ఏటనే సన్మానించారు. పసి ప్రాయంలో నేను పూయించిన కామెడీ పువ్వులకు రూకలు రాల్తాయని అప్పటికి నాకు తెలీదు. తొలిసారి -నా మెడలో రూపాయల దండపడింది. ఏనుగు అంబారిపైకి ఎక్కించింది. అదంతా రాజావారి ఆదరణ -అంటూ తన కథను జ్ఞాపకంగా గుర్తు చేసుకున్నారు విశే్వశ్వర రావు.
మరోసారి-
విజయవాడలో హరికథకెళ్లారట. అప్పుడు -పని ముగించుకొని, తిరుగు ప్రయాణం కోసం స్టేషన్‌కొచ్చాం. అదే రోజు విజయవాడలో ఎస్వీఆర్, చిత్తూరు నాగయ్యలకు సన్మానమట. రైలెక్కడానికి వాళ్లూ స్టేషన్‌లో ఉన్నారు. అకస్మాత్తుగా నన్ను ఎవరో ఎత్తుకుని తీసుకెళ్లి -ఎస్వీఆర్ ముందు నిలబెట్టారు. కాసేపు కామెడీ చేయమని కితకితలు పెట్టారు. కళా ప్రదర్శనకు కాలు దువ్వడమే తప్ప, కాదనే మాట నాకిప్పటికీ తెలీదు. అందుకే -్ఫటాఫటా కామెడీ కక్కేశా. కితకితలకంటే ఎక్కువ నవ్వించా. మహానటుల ముందు కుప్పిగంతులన్న విషయం నాకు తెలీదు కనుక -ఎలాంటి సంకోచం, భయంలేని ప్రదర్శన నాది. నన్ను చూసి ఇద్దరూ ముసిముసిగా నవ్వారు. మురిసిపోయారు. ఇంత చిన్న వయసులో ఇంతింత డైలాగుల ప్రతిభా? అంటూ మెచ్చుకున్నారు. మీరెటూ ప్రోగ్రాంల కోసం ఊళ్లు తిరుగుతుంటారు కనుక, ఓసారి మదరాసు రండి. కార్యక్రమం ఏర్పాటు చేయిస్తానన్న భరోసా ఎస్వీఆర్ నుంచి వచ్చింది. కట్ చేస్తే -ఆంధ్రా క్లబ్‌లో ప్రోగ్రాం. కార్యక్రమం అనంతరం ఎస్వీఆర్ నుంచి వెండి గ్లాసు బహుమతి. సంగీత దర్శకుడు పామర్తి నుంచీ మరో వెండి గ్లాసు...
!!!
ఇంకేంటి విశే్వశ్వర రావు పొంగిపోయాడు -అంటూ తన కెరీర్‌కు తొలి అడుగులేసిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు విశే్వశ్వర రావు.
అక్కడ్నుంచే ఆయన లైఫ్ టర్నైందని చెప్పాలి. అలా ఆంధ్ర క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకి నిర్మాత, హాస్యనటుడు పద్మనాభం కూడా వచ్చారు. పొట్టి ప్లీడరు సినిమా రూపొందించే ఆలోచనలో ఉన్నారాయన. విశే్వశ్వరరావు టాలెంట్ చూసి ముచ్చటపడి -ఆ సినిమాలో చిన్న వేషమిచ్చారు. సినిమా కళామతల్లివైపు అదే తొలి అడుగు. వాణిశ్రీ, పద్మనాభంల మధ్య సన్నివేశం. ఓ రకంగా వాణిశ్రీకి మనవడిగా కనిపించారట ఆ చిత్రంలో. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే తీరిక కూడా విశే్వశ్వర రావు దొరకలేదు. -‘రోజూ ఏదోక షూటింగ్ తప్పక ఉండేది. నాన్న చిన్న వయసులోనే కాలం చేయడంతో.. నన్ను పట్టుకుని అమ్మే స్టూడియోలకు తిరిగేది. నా వేషాలతో వచ్చిన సంపాదనతోనే కుటుంబాన్ని నడిపించేది. భక్తపోతన, రక్తసింధూరం, కృష్ణావతారం, నిండు దంపతులు, బాలభారతం, నేరము-శిక్ష, బాలమిత్రుల కథ, ఓ సీత కథ, భార్యాబిడ్డలు, కథానాయకుని కథ, మా నాన్న నిర్దోషి, మూగనోము, ఇంటి గౌరవం, బాలరాజు కథ, అందాల రాముడు, పట్టిందల్లా బంగారం, బాగ్దాద్ గజదొంగ, ధర్మదాత, సిసింద్రీ చిట్టిబాబు, స్నేహం- ఇలా అప్రతిహతంగా దాదాపు 200 చిత్రాల్లో బాలనటుడిగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాను’ అంటారు విశే్వశ్వరరావు. ‘చిత్రమేంటంటే -ఇపుడున్న చాలామంది హీరోలు ఆనాడు నన్ను చూసి, నాకులా సినిమాల్లో వెలగాలని వచ్చినోళ్లే. ఎదిగారు కూడా’ అంటారు విశే్వశ్వర రావు ఆనందంగా.
**
స్నేహం చిత్రం పూర్తయ్యేసరికి కౌమారదశకు వచ్చారు విశే్వశ్వర రావు. చదువు అటకెక్కుతుందన్న భయంతో షూటింగ్ గ్యాప్‌లలోనే చదువుతుండేవారు. స్నేహం చిత్రం అనంతరం ఎమెస్సీ మ్యాథ్స్ పూర్తి చేశారు. ఫార్మాస్యూటికల్ కంపెనీలో మానేజర్‌గా ఉద్యోగం. ‘అలా మళ్లీ పట్టణాలు పట్టుకు తిరగాల్సి వచ్చింది. -బెంగుళూరు, విజయవాడ, మధురై, ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలు తిరిగి చివరికి మళ్లీ బదిలీమీద చెన్నైకి వచ్చా’ అంటారు విశే్వశ్వర రావు. అదే సమయంలో నటి జయసుధ వింత కోడళ్లు చిత్రాన్ని వౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ‘ఎంగమామ చిత్రంలో నీ నటన చూసే నేను సినిమాలు చేయాలనుకున్నా. ఓ రకంగా నీ ఫ్యాన్‌ని నేను. దాదాపు 18సార్లు ఆ చిత్రం చూశాను’ అని కితాబిచ్చి తన సినిమాలో తన ఇన్‌స్పిరేటర్‌కు చాన్స్ ఇచ్చారు జయసుధ. శివాజీ గణేశన్ కుమారుడు ప్రభు కూడా తన నటనకు ఇన్‌స్పిరేషన్ విశే్వశ్వరరావే అని చెబుతుంటారు. తన తండ్రితో నటించిన విశే్వశ్వరరావు అంటే తనకెంతో ఇష్టమని, ఎంగమామ చిత్రాన్ని తాను కూడా 21సార్లు కేవలం విశే్వశ్వరరావు కోసమే చూశానని చెబుతుంటారాయన. ఐదుగురు అన్నదమ్ముల ‘వింత కోడళ్ళు’ చిత్ర కథలో ఐదో కొడుకుగా సుత్తివేలుతో కలిసి నటించారు. ఇది సెకెండ్ ఇన్నింగ్స్. ఈ ఇన్నింగ్స్‌లోనూ మరో 200 చిత్రాలు పూర్తి చేసేశారు విశే్వశ్వర రావు. ప్రెసిడెంటుగారి పెళ్లాం, ముఠామేస్ర్తీ, బిగ్‌బాస్, మెకానిక్ అల్లుడు, పెళ్లిసందడి, మగరాయుడు, ఆయనకు ఇద్దరు, చెప్పవే చిరుగాలి, నువ్వొస్తావని, నవవసంతం, శివపుత్రుడు లాంటి చిత్రాలు విశే్వశ్వరరావు నటనకు గీటురాయిగా నిలిచాయి. అతిలోక సుందరి శ్రీదేవి -తన హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబులకంటే ముందే విశే్వశ్వరరావుతో కలిసి స్టెప్పులు వేశారు. పట్టిందల్లా బంగారం, బాలభారతం లాంటి చిత్రాల్లో శ్రీదేవితో కలిసి నటించారాయన. ‘శ్రీదేవి తరఫున ఆమె తల్లి వస్తే, నా తరఫున మా అమ్మ వచ్చేవారు. ఇద్దరూ సెట్స్‌లో కూర్చుని మాట్లాడుకుంటూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మేమిద్దరం నటిస్తూంటే, వారిద్దరూ చూస్తూండేవారు. సెట్లో ఎప్పుడూ నా పక్కనే కూర్చునేది. ఇద్దరం షూటింగ్ గ్యాప్‌లో ఆడుకునేవాళ్లం. శ్రీదేవికి మొదట్లో మద్రాసు యాస ఉండేది. ‘నేను నీ పక్కన దా కూసుందును.. మా అమ్మకు తెలిస్తే అరుసును..’ అంటూ ఆమె మాట్లాడుతుంటే నాకు నవ్వొచ్చేది. నా చిన్నప్పటినుంచి అచ్చమైన తెలుగు బహు చక్కగా రావడంవల్ల ఆమె మాటలు విని నవ్వుకునేవాడిని. సెట్లో మాత్రం దర్శకులు ఎలా చెబితే అలా అప్పజెప్పేసేది డైలాగును. పెద్దయ్యాక ఆమె చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది. తరువాత మేమెప్పుడూ కలుసుకోలేదు. ఒక్కసారి మాత్రం మద్రాసు వచ్చినపుడు నాకోసం వాకబు చేసి మరీ పిలిపించుకుంది. చిన్ననాటి కబుర్లు ఎన్నో చెప్పుకున్నాం. తరువాత చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రంలో మేమిద్దరం కలిసి నటించాం. అది చెన్నై బాలయ్య ఇంట్లోనే చిత్రీకరించారు. ఓసారి బాలభారతం షూటింగ్ కోసం దర్శక నిర్మాతలతో కలిసి నేనూ, శ్రీదేవి హోగెన్‌కల్ వెళుతున్నాం కారులో. దారిలో పెద్ద అడవి. అడవిలో కొంతదూరం వెళ్లాక ఓ ఏనుగువచ్చి ఎదురుగా నిలబడింది. కారు అద్దాలు వేసేసి సైలెంట్‌గా కూర్చున్నాం. శ్రీదేవి అయితే చాలా భయపడిపోయింది. అరవద్దు అంటూ నోటి మీదవేలుపెట్టి చూపించా. ఆమె భయంతో అలాగే కూర్చుండిపోయింది. చివరికి ఏనుగు అటు ఇటు తొండాన్ని తిప్పి వెళ్లిపోయింది. అది గనుక తొండంతో కారును ఎగరేస్తే మేము ఏమైపోయేవాళ్లమో. ఆ తరువాత హోగెన్‌కల్‌లో పదిరోజులపాటు షూటింగ్ జరిగింది. శ్రీదేవిని తలచుకుంటేనే ఓ మధురమైన జ్ఞాపకం వెంటాడుతుంది. ఓరకంగా వాళ్ల అమ్మగారు దూరమయ్యాక సరైన గైడెన్స్ లేకపోవడంతో ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొందని నేను అనుకుంటాను’ అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారాయన. మరికొన్ని ముచ్చట్లు వచ్చేవారం
*

-సరయు శేఖర్, 9676247000