సబ్ ఫీచర్

పిఎల్‌జిఏ వారోత్సవం ప్రశాంతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టుల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఏ) 19వ వార్షిక వారోత్సవం (డిసెంబర్ 2-8) ప్రశాంతంగా ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మందుపాతర పేల్చేందుకు సన్నాహాలు చేస్తున్న ముగ్గురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మరణించారు.
ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం ప్రాంతాల్లో కరపత్రాల పంపిణీ, పోస్టర్లు అతికించడం లాంటి కార్యక్రమాలు జరిగాయి. మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటి అధికార ప్రతినిధి జగన్ పత్రికా ప్రకటనలు పంపినా పెద్దగా స్పందన కనిపించలేదు. తూర్పుగోదావరి జిల్లా సింగనకోట అటవీ ప్రాంతంలో మావోలకు చెందిన ఆయుధ డంప్‌ను పోలీసులు కనుగొన్నారు. కేరళలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇస్లామిక్ తీవ్రవాదులతో మావోలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని ఆ రాష్ట్ర సిపిఎం నాయకులు ప్రకటించారు. మార్క్సిస్టు పార్టీకి చెందిన ఇద్దరు యువకులు మావోలకు సహకరిస్తున్నారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈలోగా ఝార్ఖండ్‌లో శాసనసభ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపు ఇచ్చినా మొదటి, రెండవ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత సందర్భంగా మావోల మెరుపుదాడుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. అంతకుమించి చెప్పుకోదగ్గ సంఘటన ఏదీ జరగలేదు.
కుందన్ పహాన్
విచిత్రమేమిటంటే మావోయిస్టులు ఎన్నికల్ని బహిష్కరించమని పిలుపునిస్తే మాజీ మావోలు అక్కడ ఎన్నికల్లో పోటీ చేయడం.. కుందన్ పహాన్ అనే కరడుగట్టిన మావోయిస్టు పోలీసులకు లొంగిపోయి ఇప్పుడు ‘తమర్’ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్నాడు. ఇలాంటి సన్నివేశాలు బీహార్- ఝార్ఖండ్ రాష్ట్రాల్లో తరచూ కనిపిస్తాయి. తాజాగా కుందన్ పహాన్ జైల్లో ఉండి ఎన్నికల్లో పోటీచేస్తుండటం అక్కడ చర్చనీయాంశంగా మారింది. దీంతో మావోల ఎన్నికల బహిష్కరణ నినాదం ఎలా అభాసుపాలవుతున్నదో తేటతెల్లమవుతోంది.
దృఢమైన పార్టీ, దీర్ఘకాలిక పోరాటం, ఐక్యసంఘటన ఆధారంగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసి రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకుంటామని దశాబ్దాలుగా చెబుతున్న మావోయిస్టుల మాటలకు మాన్యత కొరవడింది. వారి మాజీలే, ప్రత్యర్థి ముఠాలే ఎన్నికల్లో పాల్గొంటూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంవైపు మొగ్గుతున్న ‘‘దృశ్యం’’ స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో బలమైన నాయకత్వం, క్యాడర్, గెరిల్లా దళాలున్నాయని చెప్పుకునే ఝార్ఖండ్-బీహార్ రాష్ట్రాల్లో పరిస్థితి వారు చెప్పుకుంటున్నట్టు ఏమాత్రం లేదని రెడ్ కారిడార్ రంగు వెలసిపోతోందని కుందన్ పహాన్ తదితరుల చర్యలు చెబుతున్నాయి.
కరుడుగట్టిన మావోయిస్టు కుందన్ పహాన్ 2017 సంవత్సరంలో పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆరోజుల్లో అతనిపై రూ.15 లక్షల రివార్డు ఉంది. ఇతను వందకు పైగా నేరాల్లో పాల్గొన్నట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. కుందన్ పహాన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకుగాను ఎన్నికల కమిషన్‌కు 44 పేజీల తన నేర చరిత్రను సమర్పించాడు. పోలీసు వ్యానులో వెళ్లి తన నామినేషన్ పత్రాలను సమర్పించాడు.
2009 సంవత్సరం.. అంటే దశాబ్దం క్రితం ఇతను నిఘా అధికారి ఫ్రాన్సిస్ ఇందూవర్‌ను అతి కిరాతకంగా హత్యచేశాడు. ఆ రోజుల్లో ఈ హత్య దేశంలో పెద్ద సంచలనం సృష్టించింది. అలాగే డిఎస్‌పి ప్రమోద్‌కుమార్ గుప్తాను సైతం కిరాతకంగా హతమార్చాడు. తమర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు రమేష్‌సింగ్ ముండాను సైతం ‘ఖతం’చేశాడు. విచిత్రమేమిటంటే.. ముండా కుమారుడు వికాస్ ఇప్పుడు జార్ఖండ్ ముక్తిమోర్చా టికెట్‌పై పోటీ చేస్తున్నాడు. కుందన్ పహాన్ అతనిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగాడు. ప్రస్తుతం కుందన్ హజారీబాగ్ జైల్లో ఉన్నాడు. అధికారుల అనుమతితో పోటీ చేస్తున్నాడు.
తమర్ నియోజకవర్గ ఓటర్లకిది ఓ వింత అనుభవం. మరో నేరస్తుడు రాజాపీటర్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. వీరి తరపున వారి భార్యలు ప్రచారం చేయడం కొసమెరుపు.
కుందన్ పహాన్ పోటీచేస్తున్న తమర్ నియోజకవర్గం రాంచీ జిల్లాలోకి వస్తుంది. అలాగే కొంత భాగం అటవీ-ఆదివాసీ ప్రాంతం. ఈ నియోజకవర్గం ‘కుంతి’ పార్లమెంట్ నియోజకవర్గంలోనిది. ఈ ప్రాంతం మావోయిస్టుల ప్రాబల్యం గలదని చాలాకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అనేక క్రూరమైన సంఘటనలు ఇక్కడే జరిగాయి. గతంలో ఒక బ్యాంకు వ్యాన్‌నుంచి రూ.5 కోట్ల నగదు కుందన్‌పహాన్ నాయకత్వంలో దోచుకున్నారు.
ఝార్ఖండ్‌లో మొత్తం 81 శాసనసభ స్థానాలుండగా 28 ఎస్.టి. స్థానాలుండటం గమనార్హం. ఎన్నికలు జరిగినప్పుడల్లా మావోలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం సర్వసాధారణం... అలాగే ప్రజలు దాన్ని పట్టించుకోకపోవడమూ అంతే సాధారణమైంది. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు ఝార్ఖండ్‌లో అనేక హింసాత్మక సంఘటనలకు పాల్పడినా ఎన్నికలు సజావుగా ముగిశాయి. కుందన్ పహాన్, నకుల్ యాదవ్, ధనేశ్వర్‌యాదవ్ లాంటి మావోలు లొంగిపోయి నిర్బంధంలో ఉన్నారు. వారి బలం బాగాతగ్గింది. సరైఖేలా, దుమ్కా తదితరచోట్ల మావోలు తమ ప్రతాపం ప్రదర్శించినా ఆ సంఘటనలు వారి పూర్వవైభవాన్ని వెనక్కి తీసుకురావడానికి ఏమాత్రం దోహదపడలేదు.
ఇది ఇలా ఉండగా ఝార్ఖండ్ రెండవ దశ ఎన్నికలకు ఒక రోజుముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పూణెలో అఖిల భారత పోలీసు డైరెక్టర్ జనరల్స్ వార్షిక సదస్సులో మాట్లాడుతూ అతి త్వరలో నక్సలిజం (మావోయిజం) తుడిచిపెట్టుకు పోతుందన్నారు. తీవ్రవాదానికి దేశంలో తావులేదని చెప్పారు. దశాబ్దకాలంలో మావోల హింసాత్మక చర్యలవల్ల దాదాపు నాలుగువందల మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది ఛత్తీస్‌గఢ్, బీహార్, ఝార్ఖండ్‌లలో మరణించారు. క్రమంగా మావోల ప్రాబల్యం తగ్గుతోందని హోం మంత్రిత్వశాఖ తన నివేదికలో వెల్లడించింది. చాలా రాష్ట్రాల్లో మావోలు ఆత్మరక్షణలో పడ్డారని, వెనుకంజ వేశారని ఆ నివేదిక పేర్కొన్నది.
రెండు దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్ కీలక నాయకులు శీలం నరేశ్, ఆదిరెడ్డి, సంతోష్‌రెడ్డి కరీంనగర్ జిల్లా కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాక వారి స్మృత్యర్థం ఏర్పడిన పిఎల్‌జిఏ వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 2నుంచి 8వరకు జరుపుతున్నారు. ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యులైన ఆ అగ్రనాయకులు మరణించిన మరుసటి సంవత్సరమే అప్పటి పీపుల్స్‌వార్ పిఎల్‌జిఏను ప్రకటించి తన శక్తిని ప్రదర్శించింది. నక్సలైట్ ఉద్యమంలో ఇది చాలా కీలకమైన మలుపుగా అందరూ భావించారు. దండ కారణ్యంలో రెడ్ కారిడార్ నిర్మాణానికి పాల్పడి, ఈ బలంతో వివిధ నక్సల్స్ గ్రూపులను తనలో కలుపుకుంది. ముఖ్యంగా మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ కలయికతో మావోయిస్టుపార్టీ 2004 సంవత్సరంలో ఆవిర్భవించింది. అనంతరం హింసాత్మక సంఘటనల జోరు పెరిగింది.
ఆ జోరులోనే ఝార్ఖండ్‌లో కుందన్‌పహాన్ లాంటివారు పుట్టుకొచ్చారు. సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు తావులేకుండా ‘వీరప్పన్’మాదిరి వ్యవహరించారు. తెలంగాణకు చెందిన కేంద్ర కమిటి సభ్యుడు ఆ పార్టీ మిలటరీ కమిషన్ సభ్యుడు సట్వాజీ కొంతకాలంక్రితం లొంగిపోయినప్పుడు తాను ఝార్ఖండ్‌లో పనిచేసినప్పుడు చూసిన పార్టీలోని అరాచకాన్ని బట్టబయలు చేశారు. ఆయన చాలా విషయాలు బహిర్గతం చేశారు. మావోయిస్టు పార్టీ సవ్యంగాలేదని ఆ వివరాలు చెప్పకనే చెప్పాయి.
ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం ఆకాశానికి తాకుతున్న తరుణంలో దానివల్ల అశేష ప్రజానీకం ప్రయోజనం పొందుతున్న వేళ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడిన సందర్భంలో, పెద్దఎత్తున ప్రజలు ప్రజాస్వామ్యానికి చిహ్నమైన ఎన్నికల్లో పాల్గొంటూ ప్రభుత్వాలను ఎన్నుకుంటున్న సమయంలో మావోల ఎన్నికల బహిష్కరణ నినాదం ఏమాత్రం ప్రాసంగికంగా కనిపించడం లేదు. మాజీ మావోలు, వారి ప్రత్యర్థులే ఎన్నికల్లో పాల్గొంటుండగా వారి పిలుపునకు మాన్యత ఎక్కడుంది? దండకారణ్యం, రెడ్ కారిడార్, రెడ్ ఆర్మీ, లాంగ్ మార్చ్, జనతన సర్కార్, ఎర్రకోటపై ఎర్రజెండా... నూతన ప్రజాస్వామిక విప్లవం... లాంటి మాటలు-పదాలు సమాజం నడకతో ‘‘సింక్’’కాని పదాలని మావోలు ఇంకెప్పుడు తెలుసుకుంటారో?... కుందన్ పహాన్ లాంటి మాజీ మావోల చర్యలతోనైనా మావోలు ‘‘చైతన్యం’’ తెచ్చుకుంటారా?...

- వుప్పల నరసింహం 9985781799